పాక్ కు భారత్ మరో షాక్... ఏమిటీ 'కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్'?
ఈ జలాలు పాక్ కి చేరకపోతే త్రాగునీటికి, సాగునీటికీ కటకటలాడాల్సి రావడంతో పాటు జల విద్యుత్ ఉత్పత్తిపైనా తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
By: Tupaki Desk | 28 Jun 2025 2:16 PM ISTపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ తీసుకున్న పలు దౌత్యపరమైన నిర్ణయాల్లో.. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ఒకటనే సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో పాకిస్థాన్ విలవిల్లాడుతోంది. భారత్ అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తే.. వచ్చే వేసవి నుంచి పాక్ గొంతు ఎండటం మొదలవుతుందని చెబుతున్నారు.
ఈ జలాలు పాక్ కి చేరకపోతే త్రాగునీటికి, సాగునీటికీ కటకటలాడాల్సి రావడంతో పాటు జల విద్యుత్ ఉత్పత్తిపైనా తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. దీంతో... నెదర్లాండ్స్ లోని హేగ్ లో గల మధ్యవర్తిత్వ న్యాయస్థానం (కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్) ను ఆశ్రయించింది పాక్. ఈ తీర్పుపై స్పందించిన భారత్... అది చట్టవిరుద్ధమని షాకిచ్చింది.
అవును... సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ, పాక్.. మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపధ్యంలో వెలువడిన తీర్పుపై భారత్ మండిపడింది. ఈ సందర్భంగా మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై భారత విదేశాంగశాఖ స్పందిస్తూ... సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇందులో భాగంగా... 1960 నాటి సింధు జలాల ఒప్పందంపై ఏర్పాటైన చట్టవిరుద్ధ మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని తాము అంగీకరించలేదని, అయినా అది భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము కాశ్మీర్ లోని కిషెన్ గంగా, రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి దాని సామర్థ్యంపై అనుబంధ అవార్డుగా వర్ణించే ఆదేశాల్ని ఇచ్చిందని పేర్కొంది.
ఇదే సమయంలో.. అసలు మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఉనికిని భారత్ ఎప్పుడూ గుర్తించలేదని.. ఈ కోర్టు తీసుకునే చర్యలు, అది తీసుకునే నిర్ణయం చట్టవిరుద్ధమని విదేశాంగశాఖ తేల్చిచెప్పింది. పహల్గాం దాడి అనంతరం అంతర్జాతీయ చట్టం ప్రకారం తన హక్కులను వినియోగించుకుంటూ, సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టం చేసిందని తెలిపింది.
పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతును విరమించుకునే వరకు ఈ సింధు జలాల ఒప్పంద్దం నిలుపుదల నిలిచే ఉంటుందని స్పష్టం చేసింది. భారతదేశం మున్ముందు ఈ ఒప్పందం ప్రకారం తన బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఏ మధ్యవర్తిత్వ న్యాయస్థానం జోక్యాన్ని పరిగణలోకి తీసుకోమని నొక్కి చెప్పింది.
