జుగులార్ నరం నొక్కిన భారత్... చీకట్లో పాక్ గొంతు ఎండుతుంది!
జుగులార్ నరం అనేది మెడలో ఓ ప్రధాన సిర. ఇది తల నుంచి రక్తాన్ని గుండె వైపు మళ్లిస్తుంది.
By: Tupaki Desk | 24 April 2025 10:00 PM ISTజుగులార్ నరం అనేది మెడలో ఓ ప్రధాన సిర. ఇది తల నుంచి రక్తాన్ని గుండె వైపు మళ్లిస్తుంది. దీన్ని గట్టిగా నొక్కితే తీవ్రమైన హాని కలిగిస్తుంది. ఇది పగిలిపోతే ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. అయితే.. పాకిస్థాన్ లోని పొలిటికల్ డాక్టర్లు ఉద్దేశ్యపూర్వకంగా ఈ తప్పు పదే పదే చేస్తున్నారు. దీంతో.. భారత్ ఆ నరాన్ని గట్టిగా నొక్కాల్సి వచ్చింది.
అవును... పాకిస్థాన్ నాయకులు, అధికారులు తమ తమ ప్రసంగాల్లో కాశ్మీర్ ను పాకిస్థాన్ జుగులార్ నరంగా అభివర్ణిస్తుంటారు. ఇందులో భాగంగా ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కశ్మీర్ పై స్పందిస్తూ... అది మా జుగులార్ సిర.. దాన్ని మేము మర్చిపోము.. మా కాశ్మీర్ సోదరులను వీరోచిత పోరాటంలో వదిలిపెట్టము అని వ్యాఖ్యానించారు.
ఆ ప్రసంగం చేసిన కొద్ది రోజుల్లోనే పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. సుమారు 5 - 6 మంది ఉగ్రవాదులు బైసరన్ లోయలో కాల్పులు జరిపారు. ఈ భీకర దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో పాకిస్థాన్ తన జుగులార్ నరంగా పిలిచే కశ్మీర్, ఆ ప్రాంతం గుండా ప్రవహించే ఆ దేశానికి ప్రాణదాత నీరును నొక్కి పట్టింది.
ఇందులో భాగంగా... సింధు జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసింది. దీంతో.. ఆ దేశంలో సుమారు 23.7 కోట్ల మంది ప్రజలు తాగునీటి అవసరాలకు స్ట్రోక్ ఇచ్చినట్లయ్యింది. పాకిస్థాన్ లో ప్రధానంగా లాహోర్, కరాచీ, ముల్తాన్ నగరాలు నేరుగా ఈ నీటినే ప్రజలకు అందిస్తున్నాయి.
ఇక పాకిస్థాన్లో సుమారు 16 లక్షల హెక్టార్లలో వ్యవసాయం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అందుకు వాడే నీటిలో సుమారు 80శాతం ఈ సింధూ జలాల ఒప్పందం నుంచే లభిస్తోంది. ఈ నదుల నుంచి వచ్చే నీరే... పంజాబ్ ప్రావిన్స్ కు జీవనాడి. మరోపక్క గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 68 శాతం ప్రజలు ఈ నదీ జలాలపైనే ఆధారపడి బ్రతుకుతున్న పరిస్థితి.
విద్యుత్ విషయానికొస్తే... సింధూ నదిపై నిర్మించిన తర్బెల డ్యామ్.. పాక్ వినియోగంలో 16శాతానికి సమానమైన కరెంట్ ను తయారు చేస్తుంది. అదే విధంగా... జీలం నదిపై ఉన్న మంగల డ్యామ్ ఏటా ఆ దేశ విద్యుత్ ఉత్పత్తిలో 8 శాతం అందిస్తుంది. అంటే... భారత్ తాజా నిర్ణయంతో సుమారు 24% విద్యుత్ పై ప్రతికూల ప్రభావం పడనుందన్నమాట.
ఇలా పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ యొక్క ఈ నరాన్ని నొక్కిన భారత్... 1960 నాటి సింధు జల ఒప్పందాన్ని నిలిపేసింది. భారతదేశం తీసుకున్న ఈ చర్య తర్వాత.. 40 డిగ్రీల ఉష్ణోగ్రతను ఎదుర్కోంటున్న పాకిస్థాన్ గొంతు ఎండగొట్టడం త్వరలో ప్రారంభించే అవకాశాలున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
