ఇరాన్ కి వ్యతిరేకంగా భారత్...తటస్థం వీడి స్పష్టత
ఇరాన్ కి భారత్ దగ్గరా దూరమా అన్న చర్చ ఒకటి దేశంలో నడుస్తోంది. అంతే కాదు భారత్ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం విషయంలో ఏ వైపున ఉంది అన్న ప్రశ్నలు కూడా పుట్టుకుని వచ్చాయి.
By: Satya P | 12 March 2026 11:15 PM ISTఇరాన్ కి భారత్ దగ్గరా దూరమా అన్న చర్చ ఒకటి దేశంలో నడుస్తోంది. అంతే కాదు భారత్ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం విషయంలో ఏ వైపున ఉంది అన్న ప్రశ్నలు కూడా పుట్టుకుని వచ్చాయి. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దాడులలో హతమార్చాయి. దాని మీద కూడా భారత్ అయిదు రోజులు మౌనం పాటించింది అన్న విమర్శలు వచ్చాయి. మార్చి 5న భారత్ లోని ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్ళి భారత దౌత్య అధికారి సంతాపం వ్యక్తం చేస్తూ సంతకం పెట్టారు. ఇక దేశంలోని విపక్షాలు అన్నీ ఇరాన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ఏమిటి ప్రశ్నిస్తూ వచ్చాయి. అయితే ఈ యుద్ధంలో భారత్ ది న్యూట్రల్ విధానం అని ఎంత అనుకున్నా అది కుదిరేలా లేదు. ఎందుకంటే యుద్ధంలో చాలా శక్తులు ప్రత్యక్ష పరోక్ష పాత్ర పోషిస్తున్నాయి. భారత్ పరంగా చూసినపుడు తటస్థ విధానాన్ని తొలి సారి తొలగించేలా ఈ యుద్ధం ఉందని కూడా విశ్లేషణలు ఉన్నాయి.
ఓటేసిన భారత్ :
ఈ నేపధ్యంలో ఎట్టకేలకు ఒక విషయంలో మాత్రం ఇరాన్ కి వ్యతిరేకంగా భారత్ ఓటేసింది. అలా ఓటేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అది అనివార్యం అని కూడా అంటున్నారు. ఇక చూస్తే ఇరాన్ లక్ష్యాలపై అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేసిన నేపధ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. ఆ నేపధ్యంలో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి ఇరాన్‌కు సంబంధించిన విషయంలో సీరియస్ అయింది. ఇరాన్ గల్ఫ్ దేశాల మీద విరుచుకుపడుతున్న తీరుని భద్రతా మండలి తీవ్రంగా తప్పు పట్టింది. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటేసింది. అంటే ఇరాన్ కి అది వ్యతిరేకం అన్న మాట.
ఇరాన్ దాడులను ఖండిస్తూ :
ఇక గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఐ, జోర్డాన్‌లపై ఇరాన్ చేస్తున్న్న అతి దారుణమైన దాడులను ఖండిస్తూ ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి ఒక తీర్మానాన్ని తాజాగా ఆమోదించింది. బహ్రెయిన్ తీసుకుని వచ్చిన ఈ తీర్మానానికి మద్దతుగా 130 దేశాలు నిలిచాయి. అవనీ కో స్పాన్సర్లుగా ఉన్నాయి. అందులో భారత్ కూడా ఉంది. అలా భారత్ ఇరాన్ చర్యలను తప్పు పట్టింది. అంతే కాదు హార్ముజ్ జలసంధి బాబ్ అల్ మందాబ్‌లో సముద్ర భద్రతకు ముప్పు తెచ్చే విధంగా ఉన్న ఇరాన్ చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసింది.
అంతా అనుకూలమే :
ఇక ఈ తీర్మానానికి ఎవరూ వ్యతిరేకంగా ఓటు వేయకపోవడం విశేషం. భద్రతా మండలిలో మొత్తం 15 దేశాలు ఉంటే 13 దేశాలు ఈ తీర్మానానికి మద్దతుగా నిలిచాయి. అయితే ఇరాన్ మిత్ర దేశాలు అయిన రష్యా చైనా మాత్రం తీర్మానానికి దూరంగా ఉండిపోయాయి. ఇక హర్మూజ్ జల సంధి వద్ద ఇరాన్ చర్యలను సైతం భద్రతా మండలి ఖండించింది.
రష్యా చైనా విమర్శలు :
మరో వైపు చూస్తే ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి ఇరాన్ గల్ఫ్ దేశాల మీద చేస్తున్న దాడులను తప్పు పడుతూ తీర్మానం ఆమోదించడానికి దూరంగా ఉన్న రష్యా చైనా అదే సమయంలో మరో విషయంలో తప్పు పడుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ని ఆయన కుటుంబ సభ్యులను అమెరికా ఇజ్రాయెల్ దాడులలో హతమార్చారని గుర్తు చేస్తోంది. తాజాగా ప్రవేశపెట్టిన తీర్మానంలో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి ఈ విషయాని ప్రస్తావించకపోవడాన్ని ఈ రెండు దేశాలు తప్పు పట్టాయి. మొత్తానికి భారత్ ఇరాన్ విషయంలో కొంత మేరకు తన ఉద్దేశ్యాలు చెప్పినట్లు అయింది. అంత మాత్రాన భారత్ ఎవరికీ దూరం కానీ దగ్గర కానీ కాదని ఆయా సందర్భానుసారం తీసుకునే నిర్ణయాలు అని అంటున్నారు దౌత్య నిపుణులు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
