భారత్ ''అస్త్ర'' క్షిపణి పరీక్ష సక్సెస్... ప్రత్యేకత ఇదే!
అవును... ఇటీవల ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ - పాక్ మధ్య జరిగిన యుద్ధం తర్వాత భారత స్వదేశీ ఆయుధాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 July 2025 11:30 AM ISTరక్షణ పరిశోధన & అభివృద్ధి సంస్థ (డీ.ఆర్.డీ.ఓ), భారత వైమానిక దళం (ఐఏఎఫ్) జూలై 11, 2025న ఒడిశా తీరానికి చేరువలో బియాండ్ విజువల్ రేంజ్ లక్ష్యాలను ఛేదించే "అస్త్ర" క్షిపణిని విజయవంతంగా పరీక్షించాయి. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను (ఎయిర్ టు ఎయిర్) ధ్వంసం చేయగల ఈ అస్త్రాన్ని సుఖోయ్-ఎంకేఐ యుద్ధవిమానం నుంచి ప్రయోగించారు.
అవును... ఇటీవల ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ - పాక్ మధ్య జరిగిన యుద్ధం తర్వాత భారత స్వదేశీ ఆయుధాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అటు క్షిపణులను సక్సెస్ ఫుల్ గా ప్రయోగిస్తూ.. ఇటు శత్రువు ప్రయోగించిన వాటిని విజయవంతంగా నిర్వీర్యం చేస్తూ భారత్ ప్రపంచం దృష్టిని మరోసారి ఆకర్షించింది.
దీంతో.. భారత స్వదేశీ పరిజ్ఞానంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘అస్త్ర’ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఇది వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంది. ఇందులో అధునాతన గైడెన్స్, నేవిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి. ఈ సందర్భంగా స్పందించిన రక్షణ శాఖ... ఈ అస్త్రంలో స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ఉన్నట్లు తెలిపింది.
ఇందులో మొత్తం రెండు పరీక్షలు నిర్వహించామని, అందులో భిన్న ఎత్తుల్లోని డ్రోన్లను లక్ష్యాలుగా చేసుకున్నట్లు వివరించింది. ఇదే సమయంలో... ఈ పరీక్షల్లో అన్ని వ్యవస్థలూ అంచనాలకు తగ్గట్టు పనిచేశాయని డీ.ఆర్.డీ.వో తెలిపింది. డీ.ఆర్.డీ.ఓ తో పాటు హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో సహా 50కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలు దీని అభివృద్ధికి దోహదపడ్డాయి.
ఈ సందర్భంగా స్పందించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసల జల్లులు కురిపించారు. ఇందులో భాగంగా.. రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ రూపకల్పన, అభివృద్ధిలో పాల్గొన్న డీ.ఆర్.డీ.ఓ, ఐఏఎఫ్, ఇతర పరిశ్రమ భాగస్వాములను ఆయన ప్రశంసించారు. స్వదేశీ సీకర్ తో క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం రక్షణ సాంకేతిక పరిజ్ఞానంలో ఒక ప్రధాన మైలురాయి అని అన్నారు.
