గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ షాక్.. భారత్‌లో మాత్రం 'స్టేబుల్'.. అసలు రహస్యం ఇదే!
పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం భీకర రూపం దాల్చడంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ మంటలు రేగుతున్నాయి.
By: Tupaki Political Desk | 14 March 2026 11:37 AM ISTపశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం భీకర రూపం దాల్చడంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ మంటలు రేగుతున్నాయి. ముఖ్యంగా జీ20 (G20) దేశాల్లో చాలా చోట్ల పెట్రోల్ ధరలు 20 శాతానికి పైగా పెరిగి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అమెరికాలోనూ ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, భారతీయ వంటిళ్లలో, వాహనాల ట్యాంకుల్లో మాత్రం ధరల స్థిరత్వం కనిపిస్తోంది. హర్మూజ్ జలసంధి ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, గ్లోబల్ మార్కెట్లు అనిశ్చితిలో ఉన్నా భారత్ ఏమాత్రం చలించకపోవడానికి కారణం.. కేంద్ర ప్రభుత్వం కొన్ని ఏళ్లుగా అమలు చేస్తున్న 'దూరదృష్టి' గల ఇంధన వ్యూహమే. భౌగోళిక రాజకీయ గందరగోళం నుంచి ప్రతి భారతీయుడిని కాపాడడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రణాళిక ఇప్పుడు ప్రపంచానికే ఒక పాఠంలా మారింది.
స్థిరంగా ఉండేందుకు కారణాలు వ్యూహాత్మక నిల్వలే..
భారతదేశం అత్యవసర పరిస్థితుల కోసం తన వద్ద రికార్డు స్థాయిలో చమురు నిల్వలను సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం మన దేశంలో 74 రోజులకు సరిపడా (సుమారు 7-8 వారాలు) ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
ఎస్‌పీఆర్ (SPR) సౌకర్యాలు.. విశాఖపట్నం, మంగళూరు, పడూరులలో ఉన్న అండర్ గ్రౌండ్ స్టోరేజ్ కావెర్న్స్ లో దాదాపు 9.5 రోజులకు సరిపడా ముడి చమురు సిద్ధంగా ఉంది.
ఓఎంసీ (OMC) నిల్వలు.. చమురు మార్కెటింగ్ కంపెనీల వద్ద మరో 64.5 రోజులకు సరిపడా స్టాక్ ఉంది. ఈ భారీ నిల్వల వల్లే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా లేదా సరఫరా ఆగినా, ఆ భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వం నియంత్రించగలుగుతోంది.
హర్మూజ్ జలసంధిపై ఆధారపడడం తగ్గించిన భారత్..
ఒకప్పుడు భారత్ తన చమురు అవసరాల కోసం కేవలం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడేది. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. హర్మూజ్ జలసంధి ద్వారా వచ్చే చమురు శాతం ఇప్పుడు 40 శాతానికి పడిపోయింది. రష్యా, పశ్చిమ ఆఫ్రికా, అమెరికా, మధ్య ఆసియా వంటి సుమారు 40 దేశాల నుంచి మనం ఇప్పుడు ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాం. ఈ వైవిధ్యీకరణ వల్ల ఒక ప్రాంతంలో యుద్ధం జరిగినా, ఇతర మార్గాల ద్వారా మనకు చమురు అందుతోంది. ముఖ్యంగా రష్యా నుంచి వస్తున్న రాయితీ చమురు మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతం ఇస్తోంది.
తెలివైన దౌత్యం
అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 100 డాలర్లు దాటినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ భరోసా ఇచ్చారు. ఆయిల్ కంపెనీలు కొన్నేళ్లుగా మంచి లాభాలను ఆర్జించాయని, ఇప్పుడు పెరిగిన ఖర్చులను ఆ కంపెనీలే భరిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదనంగా, అమెరికా నుంచి 30 రోజుల పాటు రష్యా చమురు కొనుగోలుపై మినహాయింపులు పొందడం భారత్ యొక్క 'తెలివైన దౌత్యం'కు నిదర్శనం.
సామాన్యుడి రక్షణే లక్ష్యం!
ఈ ధరల స్థిరత్వం అనేది కేవలం యాదృచ్చికం కాదు, ఇది 'వికసిత్ భారత్' ప్రణాళికలో ఒక భాగం. యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ కొరత ఏర్పడకుండా ఇండక్షన్ కుక్కర్ల వంటి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం, ఎలక్ట్రిక్ వాహనాల (EV) వాడకాన్ని పెంచడం ద్వారా మనం దీర్ఘకాలిక ఇంధన భద్రత వైపు అడుగులు వేస్తున్నాము. ఏ దేశంలోనైనా ఆర్థిక స్థిరత్వానికి ఇంధన ధరలే పునాది. ఆ పునాది కదలకుండా మోదీ ప్రభుత్వం చేస్తున్న ఈ కృషి ప్రతి భారతీయుడికి ఒక గర్వకారణం.
ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా, భారత్ ఒక ధీరవనితలా నిలబడటానికి కారణం ముందస్తు ప్రణాళికే. 7-8 వారాల నిల్వలు, 40 దేశాలతో వాణిజ్యం, ప్రజలను కాపాడాలనే సంకల్పం వెరసి ఈ రోజు మనం సురక్షితంగా ఉన్నాం. గందరగోళ పరిస్థితుల్లోనూ దేశాన్ని ప్రశాంతంగా ఉంచగలిగే నాయకత్వం ఉండడం మన అదృష్టం. ఈ యుద్ధం ముగిసిన తర్వాత భారత్ మరింత శక్తివంతమైన ఇంధన కేంద్రంగా నిలుస్తుందని ప్రపంచంలోని చాలా మంది నిపుణులు విశ్లేషిస్తున్నారు.
