బాయ్ కాట్ టర్కీ : చావుదెబ్బ కొడతున్న భారతీయులు
టర్కీ ప్రస్తతం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలోనే తమ దేశానికి వచ్చి పర్యాటకాన్ని ఎంజాయ్ చేయాలంటూ భారతీయులను వేడుకుంటోంది.
By: Tupaki Desk | 13 May 2025 5:09 PM ISTభారత్, పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచిన టర్కీ, అజర్‌బైజాన్‌లకు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. ఈ రెండు దేశాలకు ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు కొత్త బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇది ఆ రెండు దేశాలకు ఆర్థికంగా గణనీయమైన ఎదురుదెబ్బగా మారనుంది.
టర్కీ ప్రస్తతం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలోనే తమ దేశానికి వచ్చి పర్యాటకాన్ని ఎంజాయ్ చేయాలంటూ భారతీయులను వేడుకుంటోంది. అక్కడ ఎలాంటి భయాందోళన పరిస్థితులు లేవని.. స్వేచ్ఛగా తిరగొచ్చంటూ ఆహ్వానిస్తోంది. అయితే ఇదంతా పాకిస్తాన్ కు సపోర్టు చేయకముందు ఉండాల్సిందని.. భారతీయులు అక్కడికి వచ్చేది లేదంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు
తాజాగా జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు కూడా చాలా దేశాలు మద్దతు తెలిపాయి. పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ చేపట్టిన ఈ చర్యలను పలు దేశాలు ప్రశంసించాయి. అయితే, టర్కీ, అజర్‌బైజాన్ మాత్రం ఈ విషయంలో పాకిస్తాన్‌కు బాసటగా నిలిచాయి. భారత్ చర్యలను ఖండించాయి. ఈ రెండు దేశాల వైఖరి అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలోనే, అంతర్జాతీయ ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు భారతీయ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పాకిస్తాన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్న టర్కీ, అజర్‌బైజాన్‌లకు ఇప్పటి నుంచి కొత్త బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. అంతేకాకుండా, ఈ రెండు దేశాలకు అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని భారతీయ పర్యాటకులకు సూచించాయి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే, అక్కడి సున్నితమైన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి.
ప్రముఖ టూరిస్ట్ సర్వీసెస్ సంస్థ 'కాక్స్ అండ్ కింగ్స్' టర్కీ, అజర్‌బైజాన్, ఉజ్బెకిస్తాన్‌లకు కొత్త బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అనవసర ప్రయాణాలను ప్రస్తుతం విరమించుకోవాలని సంస్థ డైరెక్టర్ కరణ్ అగర్వాల్ సూచించారు.
మరో ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ ఈజ్ మై ట్రిప్ కూడా ఇదే విధమైన సూచనలు చేసింది. పహల్గామ్ దాడి తదనంతర పరిణామాల నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులుంటే తప్ప టర్కీ, అజర్‌బైజాన్‌లను సందర్శించవద్దని కోరింది. ప్రయాణ ప్రణాళికలు చేసుకునే ముందు తాజా ట్రావెల్ అడ్వైజరీలను పరిగణనలోకి తీసుకోవాలని ఈజ్ మై ట్రిప్ ఫౌండర్ నిషాంత్ ట్వీట్ చేశారు.
ట్రావోమింట్ అనే మరో ట్రావెల్ ప్లాట్‌ఫామ్ కూడా టర్కీ, అజర్‌బైజాన్‌లకు సంబంధించిన అన్ని రకాల ప్రయాణ ప్యాకేజీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చేసుకున్న బుకింగ్‌లు రద్దు చేసుకుంటే ఎలాంటి క్యాన్సలేషన్ ఫీజులు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. అయితే, అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఫ్లైట్ బుకింగ్‌లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
మరోవైపు, పాకిస్తాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌లో కూడా దేశీయ పర్యాటకంపై ప్రభావం పడుతోంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లోని హోటల్ బుకింగ్‌లు భారీగా రద్దవుతున్నట్లు హోటల్ ప్రతినిధులు తెలిపారు. భద్రతాపరమైన ఆందోళనలతో పర్యాటకులు ఈ ప్రాంతాలకు వెళ్లేందుకు వెనుకాడుతున్నారని పేర్కొన్నారు.
భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ప్రభావం చూపుతున్నాయని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు మద్దతిచ్చిన దేశాలకు ట్రావెల్ సంస్థలు బుకింగ్‌లు నిలిపివేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది టర్కీ మరియు అజర్‌బైజాన్‌ల పర్యాటక రంగానికి కొంత మేర నష్టం కలిగించే అవకాశం ఉంది. అందుకే మా దేశానికి రావాలంటూ టర్కీ భారతీయులను వేడుకుంటున్న వైనం చర్చనీయాంశమైంది.
- ఊపందుకున్న ‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం!
పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో తుర్కియే పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరించడంతో ఈ నిరసనలు తీవ్రతరం అయ్యాయి. ఎర్డోగాన్ ప్రభుత్వం తీరుపై మన దేశంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తొలుత సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ తుర్కియే’ పేరుతో విస్తృత ప్రచారం జరిగింది. తాజాగా ఈ నిరసనలు వ్యాపార వర్గాలకు కూడా విస్తరించాయి. 'బ్యాన్ తుర్కియే' అంటూ పలువురు వ్యాపారులు ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులను విక్రయించడానికి నిరాకరిస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా పుణెలోని వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తుర్కియే నుంచి దిగుమతి అయ్యే యాపిల్స్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో స్థానిక మార్కెట్‌లో అవి కనిపించకుండా పోతున్నాయి. స్థానికులు కూడా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యే పండ్లను కొనుగోలు చేస్తున్నారు.
పుణె మార్కెట్‌లో తుర్కియే యాపిల్స్ సీజన్ టర్నోవర్ సుమారు రూ.1000 నుంచి 1200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. వ్యాపారుల తాజా నిర్ణయం పండ్ల మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. అయినప్పటికీ వర్తకులు దీన్ని కేవలం ఆర్థిక నిర్ణయంగా కాకుండా, ప్రభుత్వానికి, సాయుధ బలగాలకు సంఘీభావంగా చూస్తున్నామని పేర్కొంటున్నారు. యాపిల్స్‌ను తుర్కియే నుంచి దిగుమతి చేసుకునే బదులు హిమాచల్, ఉత్తరాఖండ్, ఇరాన్, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత కుల్దీప్ సింగ్ రాథోడ్ కూడా తుర్కియే వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2023లో భీకర భూకంపం సంభవించినప్పుడు ‘ఆపరేషన్ దోస్త్’ ద్వారా భారత్ ఆ దేశానికి ఎనలేని సాయం చేసిందని, అయినప్పటికీ తుర్కియే దౌత్య ద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు. ఈ సందర్భంగా తుర్కియే దిగుమతులపై నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
