Begin typing your search above and press return to search.

చైనాకు షాక్.. అమెరికాలో మేకిన్ ఇండియా ఫోన్లదే హవా..

స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో మన దేశం దూసుకువెళుతోంది. ఇప్పటివరకు ఈ రంగంలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న చైనాకు షాక్ తగిలింది.

By:  Tupaki Desk   |   30 July 2025 12:00 AM IST
చైనాకు షాక్.. అమెరికాలో మేకిన్ ఇండియా ఫోన్లదే హవా..
X

స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో మన దేశం దూసుకువెళుతోంది. ఇప్పటివరకు ఈ రంగంలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న చైనాకు షాక్ తగిలింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అమెరికాకు ఎగుమతి చేసిన ఫోన్లలో మన దేశం ఉత్పత్తులే ఎక్కువగా ఉండటం గమనార్హం. పీఎల్ఐ స్కీమ్ కారణంగా దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసుకునే స్థాయికి మన దేశం చేరిందని చెబుతున్నారు. అమెరికాకు మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఫోన్ల వల్ల ప్రతి ముగ్గురు అమెరికన్లలో ఒకరి వద్ద మేకిన్ ఇండియా స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ఈ ఏడాది తొలి ఐదు నెలల కాలానికి అమెరికా దిగుమతి చేసుకున్న స్మార్ట్ ఫోన్లలో మన వాటా 36 శాతానికి చేరింది. గత ఏడాది 11 శాతంగా ఉన్న మన వాటా ఒకేసారి 36 శాతానికి పెరగడం విశేషంగా చెబుతున్నారు.

ఇక ఇప్పటివరకు అమెరికాకు స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న చైనా వాటా గణనీయంగా తగ్గింది. గతంలో 82 శాతం మార్కెట్ ను ఆక్రమించిన చైనా స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు 49 శాతానికి పడిపోయినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో డ్రాగన్ ఆధిపత్యానికి గండి పడినట్లైందని చెబుతున్నారు. అమెరికా ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ లెక్కల ప్రకారం ఈ ఏడాది మే వరకు 21.3 మిలియన్ యూనిట్ల స్మార్ట్ ఫోన్లను భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంది. దాదాపు 9.35 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ ఫోన్లను భారత్ దేశం నుంచి అమెరికాకు ఎగుమతి చేసినట్లు చెబుతున్నారు. ఇక మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి చేసిన సరుకుల విలువలో ఎక్కువ మొత్తం స్మార్ట్ ఫోన్ రంగందే కావడం విశేషం.

స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో భారత్ దూసుకుపోతుండటంతో చైనాకు చెక్ చెప్పినట్లుగా భావిస్తున్నారు. ఆ దేశ ఎగుమతులు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి-మే మధ్య 29.4 మిలియన్ యూనిట్లను చైనా అమెరికాకు ఎగుమతి చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఎగుమతులు 27 శాతం తగ్గినట్లు విశ్లేషిస్తున్నారు. అమెరికాకు ఎగుమతి అవుతున్న స్మార్ట్ ఫోన్లలో అత్యధికం యాపిల్ ఉత్పత్తులుగానే చెబుతున్నారు. 2020 వరకు స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి విషయంలో చైనా పైనే అధికంగా ఆధారపడిన యాపిల్ ఆ తర్వాత తన పంథా మార్చుకుంది. భారత్ లో తయారీ పరిశ్రమను విస్తరించింది. ముఖ్యంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహాకాల పథకం (పీఎల్ఐ) గేమ్ ఛేంజర్ గా నిలిచింది. తొలుత కేవలం పాత మోడళ్లు మాత్రమే ఉత్పత్తి చేసే యాపిల్ ఇప్పుడు ప్రో మోడళ్ల తయారీనీ చేపడుతోంది.