Begin typing your search above and press return to search.

'తుల్ బుల్' కు భారత్ సై... ఇక పాక్ కు దబిడి దిబిడే!

చినాబ్ ను రవి - బియాస్ – సట్లేజ్ వ్యవస్థతో అనుసంధానించే కాలువ నిర్మాణ పనులు రాబోయే మూడేళ్లలో పూర్తవుతాయని భావిస్తున్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   27 Jun 2025 12:38 AM IST
తుల్  బుల్ కు భారత్  సై... ఇక పాక్  కు దబిడి దిబిడే!
X

పహల్గాం దాడి అనంతరం పాక్ కు భారత్ పలు షాకులిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ప్రధానంగా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో.. పాక్ కు నీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వచ్చే వేసవి నాటికి పాకిస్థాన్ పరిస్థితి మరింత దిగజారే అవకాశాలున్నాని అంటున్నారు. ఈ సమయంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... పహల్గాం ఉగ్రదాడి అనంతరం సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ పాకిస్థాన్‌ కు భారత్‌ బిగ్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పశ్చిమ నదుల నుంచి నీటిని మరింత సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్న భారత్‌.. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన తుల్‌ బుల్‌ నావిగేషన్‌ ప్రాజెక్టు పునరుద్ధరణపై దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఈ సందర్భంగా... ఈ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేందుకు చర్చలు తుది దశలో ఉన్నాయని.. దీనికి సంబంధించిన డీపీఆర్‌ సిద్ధమవుతోందని.. ఏడాదిలోగా పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా.. పడమరవైపు ప్రవహించే నదుల్లో ఒకదాని నుంచి పంజాబ్‌, హర్యానాకు నీటిని మళ్లించే అవకాశం కూడా పరిశీలనలో ఉందన్నారు.

కాగా... సింధు నదీ జల వ్యవస్థలోని మూడు పశ్చిమ నదుల నుండి మిగులు ప్రవాహాన్ని హర్యానా, పంజాబ్, రాజస్థాన్‌ రాష్ట్రాలకు మళ్లించడానికి.. 113 కి.మీ పొడవైన కాలువను నిర్మించడానికి భారత్ ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనాన్ని నిర్వహిస్తోందని తెలుస్తోంది.

చినాబ్ ను రవి - బియాస్ – సట్లేజ్ వ్యవస్థతో అనుసంధానించే కాలువ నిర్మాణ పనులు రాబోయే మూడేళ్లలో పూర్తవుతాయని భావిస్తున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన హోంమంత్రి అమిత్ షా... మూడేళ్ల లోపు సింధూ జలాలను కాలువల ద్వారా రాజస్థాన్ లోని గంగానగర్ కు తీసుకెళ్తామని తెలిపారు. దీనిని యమునా నదికి అనుసంధానించే ప్రతిపాదనా ఉందని అన్నారు.

ఇక... సింధూ జలాల ఒప్పందం ప్రకారం.. పశ్చిమదిశగా పాకిస్థాన్‌ వైపు ప్రవహించే సింధూతోపాటు జీలం, చీనాబ్‌ వంటి ప్రధాన ఉప నదులపై భారత్‌ కు పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో... భారత్, పాక్‌ మధ్య 1960 - సెప్టెంబరు 19న జరిగిన ఒప్పందం ప్రకారం ఈ నదీవ్యవస్థ మొత్తం నీటిలో 20% భారతదేశం, 80% పాకిస్థాన్‌ వినియోగించుకోవాలి.