ట్రంప్.. భారత్ కు అత్యంత ప్రమాదకారి? ఈ మాటలో నిజమెంత?
ఇలాంటి వేళలో.. భారత్ తనకు మంచి మిత్రుడనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఉద్రిక్తతల వేళ మాత్రం భారత్.. పాకిస్తాన్ రెండు దేశాల్ని ఒకే గాటున కట్టటం కనిపిస్తుంది.
By: Tupaki Desk | 13 May 2025 11:25 AM ISTపహల్గాం.. ఆపరేషన్ సిందూర్ పరిణామాల నేపథ్యంలో భారతీయులకు ఒక పెద్ద సందేహం వచ్చి పడింది. భారత్ లాంటి మితవాద దేశానికి.. అసలుసిసలైన స్నేహితుల్ని అన్వేషించుకోవాల్సిన అవసరం అసన్నమైంది. ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహాన్ని.. ఇరు దేశాల మధ్య మిత్రత్వాన్ని ఒకే కోణంలో కచ్ఛితంగా చూడలేం. రెండు దేశాల మధ్య స్నేహం కేవలం భావోద్వేగ అంశాలు మాత్రమే ఉండవు. దీనికి చరిత్రతో పాటు.. ఒకరికొకరి అవసరం కూడా కచ్ఛితంగా కీలక పాత్ర పోషిస్తుంది.
ఇలాంటి వేళలో.. భారత్ తనకు మంచి మిత్రుడనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఉద్రిక్తతల వేళ మాత్రం భారత్.. పాకిస్తాన్ రెండు దేశాల్ని ఒకే గాటున కట్టటం కనిపిస్తుంది. నిజానికి ఏ విధంగా చూసినా రెండు దేశాలు ఒకటి కావన్న విషయం ట్రంప్ కు కూడా తెలుసు. నిజానికి ఒక ప్రమాదకర వ్యవహారశైలి ఉండే ఒక పిల్లాడిని..ఒక బాధ్యతతో వ్యవహరించే పిల్లాడు ఒకటేనని.. ఇద్దరు తనకు సమానమని టీచర్ చెబితే ఎంత ఛండాలంగా ఉంటుందో ట్రంప్ మాటలు అలానే ఉంటాయి.
పాకిస్తాన్ ను ఎంత దువ్వినా ఆ దేశం ఏమీ అమెరికాకు నమ్మకస్తుడైన మిత్రుడిగా ఉండరన్నది వాస్తవం. అయినప్పటికీ అమెరికా పాక్ విషయంలో తనకు తాను మిత్రుడిగా చెప్పుకోవటం కనిపిస్తుంది. ఎందుకిలా? అంటే.. పాక్ కు చైనా లాంటి బలమైన మిత్రుడు ఉండటమే. నిజానికి పాకిస్తాన్ లాంటి దేశాన్ని ట్రంప్ లెక్క చేయకూడదు. విలువ ఇవ్వకూడదు. కానీ.. అందుకు భిన్నంగా భారత్ తో సమానంగా పాకిస్తాన్ ను ట్రంప్ చూడటం వెనుక.. వ్యూహాత్మక అంశాలతో పాటు.. చైనాతో ఆ దేశానికి ఉన్న బలమైన బంధమే అని చెప్పాలి.
తాజా పరిణామాలు కొన్ని అంశాల్ని స్పష్టం చేశాయి. ప్రపంచ దేశాలు ఏవైనా సరే.. బలంగా ఉన్నోళ్లతోనే స్నేహం చేయటానికి ఇష్టపడతారు. తాము ఆధారపడే దేశం వ్యవహార శైలితో ఆ దేశానికి సంబంధం ఉండదు. కేవలం.. తనకు లాభం కలుగుతుందా? అన్నదే తప్పించి.. తన మిత్ర దేశానికి జరిగే లాభం గురించి అస్సలు ఆలోచించటం కనిపించదు. ఇందుకు ట్రంప్ నిలువెత్తు నిదర్శనం.
తాజా పరిణామాల అనంతరం ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన సత్యం ఏమంటే.. అమెరికా కానీ దాని అధ్యక్షుడు ట్రంప్ కానీ భారత్ మీదా.. భారతీయుల మీదా ప్రత్యేకంగా ఎలాంటి ప్రేమాభిమానాలు లేవని. వారు మనల్ని.. మన దేశాన్ని వాణిజ్య వస్తువు కిందనే చూస్తున్నారు. అవసరమైతే.. వాణిజ్యాన్ని నిలిపేస్తామని బెదిరిస్తారు కూడా. ఇలాంటి వేళ.. భారతీయులు కళ్లు తెరవాల్సిన అవసరం ఉంది. భారతీయులు మరింతగా కష్టపడాల్సిన సమయం ఆసన్నమైంది. దేశాన్ని మరింత మెరుగ్గా మార్చేందుకు.. ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వ్యక్తిగత స్థాయిలో ఎవరికి వారు పని చేయాల్సిన అవసరం ఉంది.
అదే సమయంలో.. అగ్రరాజ్యం అమెరికా మీద ఆధారపడే తత్త్వాన్ని వీలైనంతగా తగ్గించుకోవాల్సిన అవసరం తాజా పరిణామాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. అనుకుంటాం కానీ.. అమెరికా భారత్ కు మిత్రదేశంగా కనిపిస్తారు కానీ వాస్తవంలో మాత్రం కాదు. ఎందుకంటే.. వారికి వారి వాణిజ్యాలు మాత్రమే ముఖ్యం. అలాంటప్పుడు అమెరికా విషయంలో భారతీయులు సైతం చొక్కాలు చించేసుకునే కన్నా.. మన అవసరం అగ్రరాజ్యానికి పడేలా మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.
అన్నింటికంటే ముఖ్యంగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను మిత్రుడిగా కంటే కూడా ప్రమాదకర మిత్రుడిగా చూడటం భారతదేశానికి.. భారత ప్రజలకు మేలు కలుగుతుంది. ప్రమాదకర మిత్రుడి విషయంలో ఎప్పుడు అప్రమత్తంగానే ఉంటామన్నది మర్చిపోకూడదు. చివరగా ఒక్కమాట.. "ప్రపంచంలో శాశ్వత శత్రువులు లేరు, శాశ్వత మిత్రులు లేరు. శాశ్వతంగా ఉండేది మన దేశ ప్రయోజనం మాత్రమే"
