Begin typing your search above and press return to search.

జయహో భారత్.. ఐఎంఓ పోటీల్లో 7వ ర్యాంక్

IMO చరిత్రలో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు లభించడం ఇది రెండోసారి కావడం విశేషం. ఇంతకుముందు 1998లో మొదటిసారి ఈ ఘనతను సాధించింది.

By:  Tupaki Desk   |   21 July 2025 5:36 PM IST
జయహో భారత్.. ఐఎంఓ పోటీల్లో 7వ ర్యాంక్
X

ఆస్ట్రేలియాలోని సన్స్టీన్ కోస్ట్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 66వ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌ (IMO)లో భారతదేశం అద్భుతమైన ప్రదర్శనతో సత్తా చాటింది. మొత్తం 110 దేశాలు పాల్గొన్న ఈ గణిత మహాసంగ్రామంలో భారత్ 7వ స్థానం దక్కించుకుని, ప్రపంచ గణిత రంగంలో తన మేధస్సును మరోసారి నిరూపించుకుంది.

ఆరుగురు ప్రతిభావంతులైన విద్యార్థులతో కూడిన భారత జట్టు మొత్తం 6 పతకాలను సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చింది. వీరిలో ముగ్గురు విద్యార్థులు స్వర్ణ పతకాలు , ఇద్దరు విద్యార్థులు రజత పతకాలు , ఒకరు కాంస్య పతకం సాధించారు. భారత్‌కు కేటాయించిన గరిష్ట స్కోరు 252లో, మన విద్యార్థులు 193 స్కోర్‌తో ఆకట్టుకున్నారు.

IMO చరిత్రలో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు లభించడం ఇది రెండోసారి కావడం విశేషం. ఇంతకుముందు 1998లో మొదటిసారి ఈ ఘనతను సాధించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ఫీట్‌ను మళ్లీ సాధించడం భారత గణిత విద్యార్థుల నిరంతర కృషికి, అంకితభావానికి నిదర్శనం.

ఈ అద్భుతమైన విజయం వెనుక విద్యార్థుల అవిశ్రాంత కృషి, టీచర్ల చక్కటి మార్గనిర్దేశం, తల్లిదండ్రుల నిరంతర మద్దతు ఉన్నాయని జాతీయ స్థాయి అకాడమీలు ప్రశంసించాయి. ఈ విజయం భారత యువతలో గణితం పట్ల ఆసక్తిని మరింత పెంచుతుందని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలకు మార్గం సుగమం చేస్తుందని ఆశిస్తున్నారు.

ప్రపంచ గణిత రంగంలో భారత మేధో సంపత్తికి మరోసారి గుర్తింపు తెచ్చిన ఈ యువ మేధావులకు యావత్ దేశం తరపున శుభాకాంక్షలు! వారి భవిష్యత్తు మరింత వెలుగులు చిందించాలని ప్రతి భారతీయుడూ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాడు.