భారత్ కి షాక్...రష్యాతో పాక్
రెండు కత్తులు ఒక ఒరలో ఇమడవు అని సామెత ఉంది. ఇపుడు అమెరికా ఒక వైపు రష్యా మరో వైపు మధ్యలో భారత్ ఉంది.
By: Satya P | 9 Feb 2026 9:30 AM ISTరెండు కత్తులు ఒక ఒరలో ఇమడవు అని సామెత ఉంది. ఇపుడు అమెరికా ఒక వైపు రష్యా మరో వైపు మధ్యలో భారత్ ఉంది. బ్యాలెన్స్ చేసేందుకు భారత్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ అమెరికా పట్టుదల ముందు భారత్ మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సిద్ధపడాల్సి వచ్చింది. ఆ విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ విషయంలో విజయం సాధించారని అంటున్నారు. అలాగే రష్యాతో భారత్ ఇంధనం కొనుగోళ్ళు లేకుండా కూడా చేస్తున్నారు అని అంటున్నారు. ఈ విషయంలో భారత్ అయితే అధికారికంగా తన స్పందనను ఎక్కడా తెలియచేయలేదు. కానీ రష్యా నుంచి ఇంధన కొనుగోళ్ళు భారత్ ఆపేస్తే మాత్రం రెండు దేశాల మధ్య గ్యాప్ అయితే కచ్చితంగా పెరిగిపోతుంది అని అంటున్నారు.
మారుతున్న పరిస్థితులు :
భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కాదు కానీ రష్యాకి భారత్ దూరం అవుతోందా అన్న చర్చ మొదలైంది. నిజానికి చూస్తే భారత్ రష్యాల మధ్య సంబంధాలకు ఆరున్నర దశాబ్దాల చరిత్ర ఉంది. ఎప్పటికీ భారత్ కి నమ్మదగిన మిత్రుడిగా రష్యా ఉంది. అదే సమయంలో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం సమయంలో అంతర్జాతీయ సమాజం రష్యాను ఒంటరిని చేస్తే భారత్ అండగా నిలిచింది. ఇంధన కొనుగోళ్ళ ద్వారా రష్యాకు కొత్త బలం ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా రెండు దేశాధినేతలు తమ దేశాల మధ్య స్నేహం గురించి గొప్పగా చెప్పుకున్నారు. మరి అంతలోనే ఇంత మార్పు అన్నట్లుగా అమెరికా డీల్ వచ్చింది అని అంటున్నారు.
పాక్ కి అండగా :
ఈ క్రమంలో రష్యా చూపు పాక్ మీద పడింది అని అంటున్నారు. తాజాగా పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో లో బాంబు పేలుడు సంభవించి 36 మంది మరణించారు. ఈ ఘటనకు స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ పాక్ అధ్యక్షుడు జర్దారీకి, అలాగే ప్రధాని షరీఫ్ కి స్వయంగా మేసెజ్ పంపించారు. జరిగిన బాంబు దాడి పట్ల సంతాపం తెలియచేస్తూనే తాము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగే పోరులో పాక్ కి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో అంతర్జాతీయంగా కొత్త బంధానికి అవకాశం ఏర్పడుతుందా అన్న చర్చకు తెర లేస్తోంది.
ఈ ముగ్గురూ కలిస్తే :
ఇక చైనా రష్యాల మైత్రి చెప్పాల్సింది లేదు. చైనా భారత్ కి పక్కలో బల్లెంగా ఉంటూ వస్తోంది. అయితే రష్యా భారత్ కి మిత్రుడు కాబట్టి ఆ ప్రభావం కూడా చైనా మీద ఎంతో కొంత ఉందని అందుకే అంతగా దూకుడు చేసేది ఉండదని అంటారు. ఇక పాక్ చైనా మంచి మిత్రులు అన్నది తెలిసిందే. ఇపుడు ఈ మూడు దేశాలు చేతులు కలిస్తే భారత్ కి ఏమైనా ఇబ్బందులు కొత్తగా వస్తాయా అన్న చర్చ సాగుతోంది. అయితే ఇక్కడ మరో విషయం ఉంది. భారత్ ఏ నాటికీ రష్యా బంధాన్ని వదులుకోదు, అదే సమయంలో రష్యా కూడా భారత్ చెలిమి విషయంలో దూరం పెంచుకోదని అంటున్నారు. ఇదంతా కూడా తొందరలోనే సమసిపోతుందని భారత్ దౌత్య నీతి ఎపుడూ అందరికీ మిత్రుడు అన్న విధానంలోనే ఉంటుందని దౌత్య నిపుణులు అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
