ట్రంప్ కి షాకిచ్చేలా మరోసారి భారత్ తో రష్యా
ఇక గతంలో అయితే రష్యా నుంచి భారత్ ఎక్కువగా ముడి చమురుని దిగుమతి చేసుకుంటూ వచ్చేది.
By: Satya P | 4 April 2026 9:37 AM ISTగత ఏడాది డిసెంబర్ లో రష్యా అధినేత పుతిన్ భారత్ పర్యటనకు వచ్చారు. ఆ రోజు ప్రపంచం అంతా భారత్ వైపే చూసింది. ఏకంగా భారత్ మీదనే తమ కెమెరా కళ్ళను నిఘా నేత్రాలు ఉంచి మరీ ఏమి జరుగుతోందో తెలుసుకోవాలని తెగ ఆరాటపడింది. ఇక అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విషయం చూస్తే ఆయన ఆగం ఆగం అయ్యారని సెటైర్లు పెద్ద ఎత్తున వచ్చాయి కూడా. ఇపుడు ట్రంప్ ఇరాన్ మీద యుద్ధంతో తెగ బిజీగా ఉన్నారు. ఈ నేపధ్యంలో రష్యాతో భారత్ మరింత దగ్గర అవుతోంది. నాడు రష్యా ప్రెసిడెంట్ వస్తే ఇపుడు రష్యా మొదటి ఉప ప్రధాని భారత్ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ నుంచి విదేశాంగ మంత్రి జై శంకర్ సహా కీలక నేతలందరితో ఆయన వేసిన భేటీలు జరిపిన చర్చలూ మరోసారి అంతర్జాతీయంగా చర్చకు తావిస్తున్నాయి.
మేమున్నామంటూ :
ఈ రోజున చూస్తే పశ్చిమాసియాలో పెను సంక్షోభం నెలకొంది. దాంతో ఇంధనం విషయంలో ఇబ్బందులు అన్ని దేశాలూ ఎదుర్కొంటున్నాయి. భారత్ విషయం తీసుకుంటే జాగ్రత్తగా వ్యవహరిస్తోంది కానీ యుద్ధం ముదిరితే మాత్రం ఇరకాటమే అన్నట్లుగా వాతావరణం ఉంది. ఈ నేపధ్యంలో రష్యా మేమున్నామని అంటూ అభయహస్తం ఇచ్చింది భారత్ అవసరాలకు సరిపడా ముడి చమురుని తాము ఇస్తామని హామీ ఇచ్చింది. అంతే కాదు ఎల్ ఎన్ జీని కూడా పెద్ద ఎత్తున సరఫరా చేస్తామని కూడా హామీ ఇచ్చింది ప్రస్తుతం భారత దేశ పర్యటనలో ఉన్న రష్యా మొదటి ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ భారత్ కి ఈ విధంగా హామీ ఇచ్చారని తెలుస్తోంది.
బిజీ బిజీగా :
రష్యా ప్రథమ ఉప ప్రధాని అయిన డెనిస్ మంటురోవ్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమై అనేక అంశాలను చర్చించారు. ఇక్కడే ఇంధన అంశం అతి ముఖ్యమైన అంశంగా ముందుకు వచ్చింది. భారత్ కి తాము పెద్ద ఎత్తున అవసరమైనంత ముడి చమురుని అందిస్తామని డెనిస్ మంటురోవ్ స్పష్టం చేశారు. ఆ విధంగా ఎంత కావాల్సి వస్తే అంత ఇచ్చేందుకు తమ దేశానికి చెందిన కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ మేరకు రష్యా అధికారికంగా కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.
రష్యా తోడుగా :
ఇక గతంలో అయితే రష్యా నుంచి భారత్ ఎక్కువగా ముడి చమురుని దిగుమతి చేసుకుంటూ వచ్చేది. అయితే ఈ ఏడాది జనవరి తర్వాత భారత్ దానిని తగ్గించేసింది. పశ్చిమాసియా యుద్ధం తరువాత మళ్లీ భారత్ రష్యా నుంచి చమురు కొనొగోళ్ళను అధికం చేసింది. ఈ క్రమంలో రష్యా ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ ఎంత మీకు అవసరం అయితే అంతా ఇస్తామని ప్రతిపాదించడం విశేషం. దాంతో భారత్ కి కొండంత ఊరటగా ఉంది అని అంటున్నారు. రష్యా నుంచి ఈ రకమైన హామీతో పాటు తోడ్పాటు ఉండడంతో భారత్ కి గట్టి భరోసా ఏర్పడింది అని అంటున్నారు.
కీలకమైన చర్చలు :
మరో వైపు చూస్తే రష్యా ప్రథమ ఉప ప్రధాన మంత్రి డెనిస్ మాంటురోవ్ న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్‌తో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాణిజ్యం, పరిశ్రమ, ఇంధనం, ఎరువులు, కనెక్టివిటీ మొబిలిటీతో పాటు టెక్నాలజీ, ఆవిష్కరణలు కీలక ఖనిజాలలో కొత్త అవకాశాలపై ఇరువురు నాయకులు విస్తృత స్థాయి చర్చలు జరిపినట్లుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో చరించిన వివిధ అంశాలకు సంబంధించిన అమలు పురోగతిని కూడా ఇరుపక్షాలు సమీక్షించాయి. పశ్చిమ ఆసియాలోని సంఘర్షణతో సహా ప్రాంతీయ ప్రపంచ పరిణామాలపైన కూడా ఇరుపక్షాలు అభిప్రాయాలను పంచుకున్నాయి. ఇక ఈ తాజా పర్యటనతో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింతగా బలపడ్డాయని అంటున్నారు.
