రూపాయి రికార్డు పతనం: రూ.94కు చేరువలో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
అమెరికా-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ భారత రూపాయి విలువ చరిత్రలోనే అత్యల్ప స్థాయికి చేరి ఆందోళన కలిగిస్తోంది.
By: A.N.Kumar | 23 March 2026 4:26 PM ISTఅమెరికా-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ భారత రూపాయి విలువ చరిత్రలోనే అత్యల్ప స్థాయికి చేరి ఆందోళన కలిగిస్తోంది. గల్ప్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మళ్లిపోవడం.. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి పెరగడం వంటి కారణాలతో రూపాయి విలువ భారీగా క్షీణించింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.94కు చేరువ కావడం దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద హెచ్చరికగా భావిస్తున్నారు నిపుణులు. ఈ ఉదయం రూపాయి 93.83 స్థాయిని తాకగా గత రెండు రోజుల్లోనే సుమారు 65 పైసల మేర పడిపోవడం గమనార్హం. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే రూపాయి విలువ 87 నుంచి 94 వరకు పడిపోవడం, దాదాపు 10 శాతం క్షీణత నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ఇరాన్ దాడులతో గల్ప్ ప్రాంతం అస్థిరంగా మారడం ముఖ్యంగా సౌదీ అరేబియా, బహ్రెయిన్ వంటి దేశాల్లోని అమెరికన్ సైనిక స్థావరాలపై దాడులు పెరగడం అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో భయాందోళనలు రేకెత్తించాయి. దీంతో వారు భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకొని డాలర్ వంటి సురక్షిత కరెన్సీలలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ పరిణామం రూపాయి విలువను మరింత దిగజార్చుతోంది.
రూపాయి పతనం ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపైనా స్పష్టంగా కనిపిస్తోంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్.ఎస్.ఈ)లు నష్టాలతో ప్రారంభమవుతూ, సెన్సెక్స్ గణనీయంగా క్షీణిస్తోంది. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, పెరుగుతున్న ముడి చమురు ధరలు, దిగుమతుల ఖర్చు పెరగడం వంటి అంశాలు మార్కెట్‌ను ఒత్తిడికి గురిచేస్తున్నాయి.
ప్రస్తుతం భారతదేశం అంతర్జాతీయ లావాదేవీల్లో ప్రధానంగా డాలర్‌పై ఆధారపడుతున్న నేపథ్యంలో రూపాయి విలువ ఈ స్థాయికి పడిపోవడం దిగుమతుల వ్యయాన్ని పెంచి, ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చమురు దిగుమతులు ఖరీదయ్యే అవకాశం ఉండటంతో సామాన్య ప్రజలపై భారం పడే అవకాశముంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తక్షణ చర్యలు అవసరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. విదేశీ మారక నిల్వల వినియోగం, వడ్డీ రేట్ల సర్దుబాటు, మార్కెట్ జోక్యం వంటి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా రూపాయి క్షీణత దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక పరీక్షగా మారింది.
