ప్రతి 3 నిమిషాలకు ఒక మరణం.. దేశంలో రోడ్డు ప్రమాదాల వెనుక భయానక నిజాలు!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించిన ఈ గణాంకాలు మన రోడ్ల భద్రత పై అనేక సందేహాలు, ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
By: Tupaki Desk | 22 April 2025 4:28 PM ISTనిత్యం ఏదో ఒక రోడ్డు ప్రమాదం గురించి వార్తల్లో వస్తూనే ఉంటుంది. లోయల్లో పడుతున్న బస్సులు, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలు తీస్తున్న డ్రైవర్లు, భారీ వాహనాల కింద నలిగిపోతున్న ద్విచక్రవాహనాలు వంటి హృదయ విదారక దృశ్యాలు కామన్ అయిపోయాయి. ఈ ప్రమాదాలు దేశంలో నిశ్శబ్ద సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. ఒక్క 2023లోనే దాదాపు లక్షా 72 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతి రోజు సగటున 474 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. అంతే ప్రతి మూడు నిమిషాలకు ఓ ప్రాణం గాల్లో కలిపిపోతుంది.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించిన ఈ గణాంకాలు మన రోడ్ల భద్రత పై అనేక సందేహాలు, ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. 2023లో 10 వేల మంది చిన్నారులు, స్కూళ్లు, కాలేజీల సమీపంలో జరిగిన ప్రమాదాల్లో మరో 10 వేల మంది విద్యార్థులు మరణించారు. రోడ్డు పక్కన నడిచి వెళ్లే పాదచారులు కూడా అనుకోకుండా ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఏకంగా 35 వేల మంది నడుచుకుంటూ వెళ్తుండగా జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల్లో ఎక్కువగా మరణిస్తుందని ద్విచక్ర వాహనదారులే. వీటన్నిటికీ ప్రధాన కారణం అతివేగం.
అంతేకాకుండా ప్రాథమిక భద్రతా చర్యలు తీసుకోకపోవడం కూడా ప్రమాదాల తీవ్రతను పెంచుతుంది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల సుమారు 54 వేల మంది మరణించారు. అలాగే సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల మరో 16వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాహనాల్లో పరిమితికి మించి బరువు (ఓవర్‌లోడింగ్) వేయడం కూడా ప్రమాదాలకు దారితీస్తోంది. దీని వల్ల 12 వేల మంది మరణించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం 34 వేల ప్రమాదాలకు కారణమైంది. 2021 గణాంకాల ప్రకారం.. 13 శాతం ప్రమాదాలు డ్రైవర్ల దగ్గర సరైన లైసెన్స్ లేకపోవడం వల్లే సంభవించాయి.
వాస్తవానికి మన రోడ్ల మీద తిరుగుతున్న అనేక వాహనాలు చాలా పాతవి. వాటిలో కనీస భద్రతా ప్రమాణాలు కూడా లేవు. దీనికి తోడు, భారతదేశంలో అస్తవ్యస్తంగా ఉండే ట్రాఫిక్ వ్యవస్థ కూడా ప్రమాదకరమైన పరిస్థితులకు కారణం అవుతుంది. పట్టణాల్లో వ్యాపారులు ఫుట్‌పాత్‌లను, రోడ్లను ఆక్రమించడంతో పాదచారులు తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపై నడవాల్సి వస్తోంది. ఇది ట్రాఫిక్‌ను మరింత క్లిష్టంగా మారుస్తుంది.
