పాకిస్థాన్ కు మరో రెండు షాకులు సిద్ధం చేస్తున్న భారత్!
పహల్గాం దాడి అనంతరం భారత్ – పాక్ మధ్య తీవ్ర పరిణామాలు నెలకొంటున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 April 2025 4:00 PM ISTపహల్గాం దాడి అనంతరం భారత్ – పాక్ మధ్య తీవ్ర పరిణామాలు నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే దౌత్యపరంగా భారత్ పలు షాకులు ఇవ్వగా.. ఇస్లామాబాద్ తన గగనతలాన్ని న్యూఢిల్లీ కోసం నో ఫ్లై జోన్ గా మార్చింది. ఈ సమయంలో పాకిస్థాన్ కు మరో రెండు షాకులు సిద్ధం చేయాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అవును... పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ తన గగనతలాన్ని భారత్ విమానల కోసం మూసేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... దానికి ప్రతిచర్యగా పాకిస్థాన్ విమానయాన సంస్థలకు తమ గగనతలాన్ని మూసివేయాలని.. ఇదే సమయంలో.. పాక్ నౌకలు భారత్ పోర్టుల్లోకి వచ్చేందుకు నిషేధం విధించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా భారత్ తన గగనతలంలో పాకిస్థాన్ విమానాలకు నిషేదం విధించడం వల్ల ఆ దేశ విమానయాన సంస్థలు తమ విమానాలను చైనా లేదా శ్రీలంక మీదుగా కౌలాలంపూర్, సింగపూర్, థాయిలాండ్ వంటి ఆగ్నేయాసియా గమ్యస్థానాలకు చేరుకోవడానికి దారి మళ్లించాల్సి వస్తుంది. ఫలితంగా విమానాలు ఎక్కువదూరం ప్రయాణించాల్సి వస్తుంది.
అందువల్ల భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే.. పాకిస్థాన్ విమానయానసంస్థపై గణనీయమైన ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.
మరోపక్క పహల్గాం ఉగ్రదాడి అనంతరం తమపై భారత్ వైమానిక దాడులు చేయొచ్చని పాకిస్థాన్ భయపడుతోంది. ఈ నేపథ్యంలో ఆ దిశగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా.. నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ సమయంలో సియాల్ కోట్ ప్రాంతానికి పాక్ సైన్యం తన రాడార్ వ్యవస్థలను తరలిస్తున్నట్లు కథనాలొస్తున్నాయి.
వీటి ప్రకారం... ఇంటర్నేషనల్ బోర్డర్ (ఐబీ) కు 58 కి.మీ దురంలో ఉన్న ఖోర్ కంటోన్ మెంట్ వద్ద టీపీఎస్-77 రాడార్ సైట్ ను ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను గమనించేందుకు, ఎయిర్ ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఇది అత్యంత సామర్థ్యం గల రాడార్ వ్యవస్థ.
