భారత్ చర్యలకు తోకముడిచిన ఉగ్రవాదులు.. ఖాళీ అవుతున్న శిక్షణా శిబిరాలు
పహల్గామ్‌లో అమాయకులైన పర్యాటకులను చంపి పాక్ ఉగ్రవాదులు పెద్ద తప్పే చేశారు.
By: Tupaki Desk | 24 April 2025 12:46 PM ISTపహల్గామ్‌లో అమాయకులైన పర్యాటకులను చంపి పాక్ ఉగ్రవాదులు పెద్ద తప్పే చేశారు. ప్రస్తుతం వారి పరిస్థితి అధ్వాన్నంగా మారింది. భారత ప్రభుత్వం ఈ దాడికి దీటైన సమాధానం ఇచ్చేందుకు రెడీ అవుతుందన్న వార్త మన సరిహద్దులు దాటి పాకిస్తాన్‌కు చేరింది. దీంతో పాకిస్తాన్ ఆర్మీతో పాటు ఉగ్రవాదుల్లో కూడా భయాందోళనలు మొదలయ్యాయి. చాలామంది ఉగ్రవాదులు భారత సరిహద్దులు దాటి పారిపోతున్నారు.
నివేదికల ప్రకారం.. లాంచ్ ప్యాడ్‌లతో పాటు జైషే మహమ్మద్ ప్రధాన శిక్షణ శిబిరం, ప్రధాన కార్యాలయం కూడా ఖాళీ అయ్యాయి. ఒకవేళ భారత్ వైపు నుంచి లాంచ్ ప్యాడ్ ల మీద వైమానిక దాడులు జరిగితే వాటిని కాపాడుకోవడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు. జైషే ఇప్పటికే తన ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేసింది. ఇది మామూలు కార్యాలయం కాదు.. సుమారు18 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఒక పెద్ద స్థావరం. ఇక్కడ వేలాది మంది ఉగ్రవాదులు ఒకేసారి శిక్షణ పొందొచ్చు.
పహల్గామ్ దాడి జరిగి 24 గంటలు గడవకముందే, భారత్ పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. సరిహద్దులను మూసేసింది. ఈ చర్యలన్నింటినీ చూస్తుంటే, ఎప్పుడైనా భారత్ తమపై దాడి చేయవచ్చని ఉగ్రవాదులు భయపడుతున్నారు. అందుకే 24 గంటల్లో ప్రధాన కార్యాలయంలోని అనేక భవనాలు ఖాళీ అయ్యాయి.
జైషే కమాండర్లను కూడా వేర్వేరు సురక్షిత గృహాలకు తరలించారు. కేవలం బహావల్‌పూర్‌లోనే కాకుండా, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, పీఓకే నుంచి కూడా స్థావరాలు ఖాళీ అయ్యాయి. ఉగ్రదాడి జరిగినప్పటి నుండి సైన్యం, పోలీసులు నిరంతరం గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. సైన్యం అనేక బృందాలను ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. జమ్మూ పోలీసులు కూడా సెర్చింగులో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
