భారత్ దెబ్బకు బెదిరిన ఆర్మీ చీఫ్... పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు!
తాజాగా ఈ విషయాలపై స్పందించిన పాక్ ప్రధాని షరీఫ్.. తమపై భారత్ చేస్తోన్న దాడులను బలంగా దిప్పికొట్టాలని మే 9వ తేదీ రాత్రి నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
By: Tupaki Desk | 29 May 2025 11:00 PM ISTజమ్మూకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా తొలుత ఉగ్రశిబిరాలపై దాడులు చేసి, సుమారు 100 మంది ఉగ్రమూకలను మట్టుబెట్టిన భారత్ సైన్యం.. తదనంతర పరిణామాల నేపథ్యంలో పాక్ సైన్యానికి తమ దెబ్బ రుచి చూపించాల్సి వచ్చింది. ఈ దెబ్బ అటు పాక్ సర్కార్ కి, ఇటు పాక్ అసలు అధిపతి సైన్యానికి కూడా బలంగా తగిలింది.
తొలుత పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్ర శిబిరాలనే టార్గెట్ చేసిన భారత సైన్యం.. అనంతరం పాక్ సైన్యం తోక జాడించే సరికి వారికీ ఓ కోటా ఇచ్చేసింది. దీంతో.. పాక్ ఎయిర్ బేస్ లు బలంగా దెబ్బతిన్నాయి. ఈ సమయంలో కొన్ని ఎయిర్ బేస్ లు ఐసీయూలో ఉన్నాయని చెబుతున్నారు. ఈ సమయంలో పాక్ పీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఉగ్ర శిబిరాలతో పాటు సైనిక స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈ దాడులు జరిగిన విషయాన్ని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ మెరుపు దాడులను గుర్తుచేసుకుని, అంగీకరించారు.
తాజాగా ఈ విషయాలపై స్పందించిన పాక్ ప్రధాని షరీఫ్.. తమపై భారత్ చేస్తోన్న దాడులను బలంగా దిప్పికొట్టాలని మే 9వ తేదీ రాత్రి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సమయంలో 10వ తేదీ తెల్లవారుజామున ప్రార్థనలు ముగిసిన వెంటనే 4:30 గంటలకు దాడులు చేసేందుకు తమ సైన్యం సిద్ధమైనట్లు తెలిపారు.
అయితే... తమ ప్లాన్ కంటే కొన్ని గంటలముందే బ్రహ్మోస్ క్షిపణులతో భారత సైన్యం విరుచుకుపడిందని.. ఈ క్రమంలో రావల్పిండి ఎయిర్ పోర్టు సహా అనేక కీలకప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేసిందని ప్రధాని షరీఫ్ పేర్కొన్నారు. తాజాగా అజర్ బైజాన్ పర్యటనలో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయం వెల్లడించారు పాక్ ప్రధాని. ఇందులో భాగంగా కాల్పుల విరమణకు ఆర్మీ చీఫ్ మునీర్ తొలుత సలహా ఇచ్చారని తెలిపారు. అయితే, ఈ ఘర్షణ మరింత ముదరకూడదనే ఉద్దేశంతోనే తాను కూడా అందుకు అంగీకరించానని చెప్పారు. పాకిస్థాన్ వైమానిక స్థావరాలతోపాటు ఇతర ప్రావిన్సుల్లోనూ భారత్ దాడులు చేసిందని పేర్కొన్నారు.
ఇలా.. సింధూ నదిలో పారేది నీరు కాదు నెత్తురు అంటూ మైకుల ముందు సినిమా డైలాగులు చెప్పే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్... భారత సైన్యం దెబ్బకు బెదిరిపోయి, కాల్పుల విరమణ అంటూ ఆ దేశ ప్రధానికి సూచించడం అంటే.. అది ఖచ్చితంగా భారత సైన్యం సూపర్ సక్సెస్ అని పాక్ ప్రధాని ఒప్పుకున్నట్లే అని అంటున్నారు పరిశీలకులు!
