Begin typing your search above and press return to search.

దలైలామా వారసుడి ఎంపిక : చైనా కి ఝలక్ ఇచ్చిన భారత్

1950లో టిబెట్‌ను ఆక్రమించిన చైనా అప్పటి నుంచి అక్కడ తన నియంత్రణను బలపరిచే ప్రయత్నం చేస్తోంది.

By:  Tupaki Desk   |   4 July 2025 3:00 AM IST
దలైలామా వారసుడి ఎంపిక : చైనా కి ఝలక్ ఇచ్చిన భారత్
X

టిబెట్‌ బౌద్ధ మతానికి సంబంధించిన అత్యున్నత పదవి అయిన దలైలామా వారసుడి ఎంపికకు సంబంధించి చైనా చేసిన డిమాండ్‌పై భారత్‌ ఘాటుగా స్పందించింది. దలైలామా వారసుడిని ఎన్నుకునే అధికారం కేవలం ప్రస్తుత దలైలామాకే ఉంటుందని, ఆ నిర్ణయంలో ఇతర దేశాలకు జోక్యం చేసే హక్కు లేదని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. “దలైలామా వారసుడి ఎంపిక స్వతంత్రమైన బౌద్ధ మతపరమైన ప్రక్రియ. దానిపై చైనా వంటి దేశాలకు ఏ రకమైన అధికారం ఉండదు. ఈ అంశంపై తాము తేల్చి చెప్పాలనుకోవడం సరికాదు. ఇది మతస్వేచ్ఛను కించపరిచే ధోరణి” అని రిజిజు అన్నారు. బుధవారం ధర్మశాలలో జరిగిన దలైలామా 90వ పుట్టినరోజు ఉత్సవాలకు రిజిజు, జనతాదళ్‌ (యునైటెడ్‌) నేత లల్లన్‌ సింగ్‌లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దలైలామా తన వారసుడి ఎంపిక ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నదానిపై గాడెన్‌ ఫోడ్రాంగ్‌ ట్రస్ట్‌ నిర్ణయించబోతోందని స్పష్టంచేశారు. ఈ ప్రక్రియలో మరెవరికీ జోక్యం చేసుకునే అధికారం లేదని పేర్కొన్నారు. దలైలామా చేసిన ఈ ప్రకటనకు కొద్దిగంటల్లోనే చైనా స్పందించింది. తాము ధర్మగురువైన దలైలామా వారసుడి ఎంపికపై ఆమోదముద్ర వేయాల్సిందేనని చైనా పేర్కొంది.

- చైనా కుట్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి

1950లో టిబెట్‌ను ఆక్రమించిన చైనా అప్పటి నుంచి అక్కడ తన నియంత్రణను బలపరిచే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందిన దలైలామా టిబెట్‌ ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే నాయకుడిగా మారారు. చైనా ఎప్పటి నుంచో తన వశంలో ఉండే వారిని దలైలామా స్థానంలో కూర్చోబెట్టేందుకు కుట్రలు చేస్తోంది. కానీ ప్రస్తుతం ఉన్న దలైలామా వాటిని ముందుగానే గుర్తించి, తన వారసుడి ఎంపిక వ్యవస్థను పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

- భారత్‌ పక్షపాతం లేకుండా మతస్వేచ్ఛ

భారత ప్రభుత్వం ఈ విషయంలో మతస్వేచ్ఛకు మద్దతుగా నిలుస్తోంది. టిబెటన్‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దలైలామా ఎంపిక జరగాలనే దృక్కోణాన్ని భారత్‌ ప్రదర్శిస్తోంది. చైనా ఒత్తిడులను కాదని, మానవ హక్కులకు ప్రాధాన్యతనిచ్చే తీరు భారత్‌ను మిగతా ప్రపంచానికి మంచి ఉదాహరణగా నిలుపుతోంది.

ఈ నేపథ్యంలో చైనా తన వ్యూహాలను పునరాలోచించాల్సిన అవసరం ఉంది. బౌద్ధ మత గురువుల ఎంపిక రాజకీయ లాభాలకు ఉపయోగించుకునే అర్హత ఏ ప్రభుత్వానికీ ఉండదు. దలైలామా వారసత్వం బౌద్ధుల ఆధ్యాత్మిక భావోద్వేగానికి చెందినది.. అది రాజకీయ ఆదేశాలతో నడిచేది కాదు.