Begin typing your search above and press return to search.

అద్దంలో తన ముఖం చూసుకోలేని పాకిస్థాన్!

బలోచిస్థాన్‌లో అశాంతికి భారతే కారణమంటూ పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలు 'పాత సీసాలో పాత మద్యం' లాంటివే.

By:  A.N.Kumar   |   2 Feb 2026 12:05 AM IST
అద్దంలో తన ముఖం చూసుకోలేని పాకిస్థాన్!
X

బలోచిస్థాన్‌లో అశాంతికి భారతే కారణమంటూ పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలు 'పాత సీసాలో పాత మద్యం' లాంటివే. దశాబ్దాలుగా తన సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పొరుగు దేశంపై వేలెత్తి చూపడం పాక్‌కు అలవాటుగా మారింది. అయితే తాజాగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్ ఇచ్చిన ఘాటు స్పందన పాకిస్థాన్ ద్వంద్వ నీతిని అంతర్జాతీయ సమాజం ముందు మరోసారి నగ్నంగా నిలబెట్టింది.

వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే వ్యూహం

బలోచిస్థాన్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు, అక్కడ పాక్ సైన్యం జరిపిన ఆపరేషన్లలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరగడం ఆ దేశ అంతర్గత సంక్షోభానికి నిదర్శనం. ఆర్థికంగా దివాళా తీసి, రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికి 'భారత్' అనే సాకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కానీ ప్రతిసారీ నిందలు వేయడం ద్వారా సమస్య పరిష్కారం కాదని భారత్ స్పష్టం చేసింది.

అసలు సమస్య ఎక్కడ?

బలోచిస్థాన్‌ సంక్షోభానికి కారణం విదేశీ కుట్రలు కాదు.. దశాబ్దాలుగా అక్కడి ప్రజలపై జరుగుతున్న "అణచివేత, క్రూరత్వం, మానవ హక్కుల ఉల్లంఘనలే.. బలోచిస్థాన్ సహజ వనరులతో సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆ ప్రాంతం అత్యంత పేదరికంలో మగ్గుతోంది. పాక్ పాలకులు ఆ ప్రాంత అభివృద్ధిని విస్మరించి కేవలం సైనిక బలంతో అణచివేయాలని చూడటం అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. బలవంతపు అదృశ్యాలు, ప్రశ్నించే గొంతులను నొక్కేయడం వంటి చర్యలతో పాక్ పరువు అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికే గంగలో కలిసింది.

భారత్ ఇచ్చిన 'నైతిక' చురక

"ఆ ప్రాంత ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించడంపై దృష్టి సారించండి" అని భారత్ చెప్పిన మాటలో ఒక గొప్ప దౌత్యపరమైన సూచన ఉంది. ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తూ సొంత ప్రజలపై యుద్ధం ప్రకటించే దేశం.. పక్క దేశంపై విమర్శలు చేయడం హాస్యాస్పదం. భారత్ తన ప్రతిస్పందన ద్వారా కేవలం పాక్ ఆరోపణలను ఖండించడమే కాకుండా బలోచిస్థాన్ ప్రజల హక్కుల గురించి ప్రపంచం దృష్టిని ఆకర్షించడంలో విజయం సాధించింది.

ఇకనైనా పాకిస్థాన్ తన గతాన్ని వర్తమానాన్ని సమీక్షించుకోవాలి. అబద్ధపు ఆరోపణలతో అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించలేమని గ్రహించాలి. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ శాంతి గురించి మాట్లాడటం పాక్ ద్వంద్వ వైఖరికి పరాకాష్ట. భారత్ ఇచ్చిన ఈ ఘాటు సమాధానం కేవలం ఒక ఖండన మాత్రమే కాదు.. అద్దంలో తనను తాను చూసుకోమని పాకిస్థాన్‌కు ఇచ్చిన గట్టి హెచ్చరిక.