Begin typing your search above and press return to search.

“నమ్మాలా.. వద్దా?” అని నోరెళ్లబెట్టిన నార్వే జర్నలిస్ట్.. భారత్ పంచ్‌లకు మైకులు మ్యూట్!

ప్రధాని నరేంద్ర మోదీ నార్వే పర్యటనలో కూడా సరిగ్గా ఇలాంటి సీన్ ఒకటి రిపీట్ అయింది. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది.

By:  A.N.Kumar   |   19 May 2026 11:00 PM IST
“నమ్మాలా.. వద్దా?” అని నోరెళ్లబెట్టిన నార్వే జర్నలిస్ట్.. భారత్ పంచ్‌లకు మైకులు మ్యూట్!
X

గ్లోబల్ మీడియాకు ఇదో అలవాటుగా మారిపోయింది. ఇండియా అనగానే ఏదో ‘బ్యాక్‌వర్డ్’ కంట్రీ అన్నట్టుగా చూడటం.. వీలైతే మానవ హక్కులు, ప్రజాస్వామ్యం లాంటి పెద్ద పెద్ద పదాలు వాడి కాస్త ఇరుకున పెట్టాలని ట్రై చేయడం చాలా కాలంగా చూస్తున్నదే. ప్రధాని నరేంద్ర మోదీ నార్వే పర్యటనలో కూడా సరిగ్గా ఇలాంటి సీన్ ఒకటి రిపీట్ అయింది. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. ప్రశ్నలతో షాక్ ఇద్దామని వచ్చిన సదరు నార్వే జర్నలిస్ట్‌కు భారత్ ఇచ్చిన సమాధానాలతో మైండ్ బ్లాక్ అయిపోయిందట!

ప్రశ్నల బాణాలు.. పేటెంట్ ఫీలింగులు!

ప్రెస్ మీట్ అనగానే మన విదేశీ జర్నలిస్టులు ఒక రకమైన ‘సుపీరియారిటీ కాంప్లెక్స్’తో మైక్ అందుకుంటారు. లోకంలో మానవ హక్కులన్నింటికీ తామే కాపలాదారుల అన్న రేంజ్‌లో ఓ నార్వే విలేకరి మైక్ పట్టుకుని “అసలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? మీ దేశంలో హక్కులు కాపాడబడుతున్నాయని గ్యారెంటీ ఏంటి?” అంటూ బిల్డప్ ఇచ్చారు. బహుశా ఆ జర్నలిస్ట్ మనవాళ్లు డిఫెన్స్‌లోకి వెళ్లి సర్దిచెప్పుకుంటారని ఆశించి ఉంటారు. కానీ, అక్కడున్నది ‘న్యూ ఇండియా’ ప్రతినిధులు కదా తగ్గడం అనే ముచ్చటే లేదు!

లాజిక్‌తో కొడితే.. రూట్ మారాల్సిందే!

భారత ప్రతినిధులు ఇచ్చిన కౌంటర్ చూస్తే సోషల్ మీడియాలో నెటిజన్లు ఎందుకు పండగ చేసుకుంటున్నారో అర్థమవుతుంది. “లక్షల్లో జనాభా ఉన్న దేశాలు కూర్చుని వందల కోట్ల జనాభా ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి క్లాసులు పీకడం ఏంటి?” అన్నట్టుగా సమాధానాలు షురూ అయ్యాయి.

“భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు పూర్తి స్వేచ్ఛతో తమ ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నారు. చాలా పాశ్చాత్య దేశాలు మహిళలకు ఓటు హక్కు ఇవ్వడానికి ముందే.. స్వతంత్ర భారతంలో మహిళలకు సమాన ఓటు హక్కు కల్పించాం. మానవ హక్కులంటే కేవలం పత్రికల్లో హెడ్డింగ్‌లు రాయడం కాదు.. ప్రతి పౌరుడికీ అభిప్రాయ స్వేచ్ఛను, ఎన్నుకునే అధికారాన్ని ఇవ్వడం” అంటూ స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు.

ఈ దెబ్బతో హాల్‌లో ఉన్న విదేశీ మీడియా ప్రతినిధులంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారట. ఒక ప్రశ్న అడిగి సమాధానం వస్తున్నప్పుడు మధ్యలో అడ్డుపడదామని చూసిన జర్నలిస్టులకు.. భారత్ వైపు నుంచి లాజిక్‌లతో కూడిన గణాంకాలు ఎదురయ్యేసరికి ఏం మాట్లాడాలో తెలియక డిఫెన్స్‌లో పడిపోయారు.

నెటిజన్ల సెటైర్లు.. సోషల్ మీడియా హల్‌చల్

ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్ల వర్షం కురుస్తోంది. “ఒకప్పుడు కాలనీల పాలనతో ప్రపంచాన్ని దోచుకున్న దేశాలు.. ఇప్పుడు కూర్చుని భారత్‌కు మానవ హక్కుల పాఠాలు చెబుతున్నాయా?” అంటూ కొందరు నెటిజన్లు కడిగిపారేస్తున్నారు. మరికొందరైతే.. “ఇండియాను ప్రశ్నించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది.. తీరా సమాధానం విన్నాక మైకులు మ్యూట్ చేసుకోవడం అలవాటైపోయింది” అంటూ సెటైర్లు వేస్తున్నారు.

మారుతున్న భారత దౌత్యం

రాజకీయ విశ్లేషకులు కూడా ఈ ఘటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రెస్ మీట్ సంభాషణ మాత్రమే కాదని, గ్లోబల్ స్టేజ్ మీద భారత్ తన వాయిస్‌ను ఎంత బలంగా వినిపిస్తోందో చెప్పడానికి ఇదో నిదర్శనమని అంటున్నారు. పాత ‘సైలెంట్ డిప్లొమసీ’ రోజులు ఎప్పుడో పోయాయని, ఇప్పుడు ‘ఈక్వల్ టు ఈక్వల్’ బేసిస్‌లోనే సమాధానాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.

మొత్తానికి “ఎందుకు నమ్మాలి?” అంటూ గంభీరంగా మొదలైన నార్వే జర్నలిస్ట్ ప్రహసనం చివరకు భారత్ ఇచ్చిన షాక్‌తో “ఇంకేం అడగాలి బాబోయ్!” అనే రేంజ్‌లో ముగిసింది. ఏది ఏమైనా గ్లోబల్ మీడియాకు సరైన టైంలో సరైన రీతిలో బుద్ధి చెప్పడం అంటే ఇదే మరి!