ఐఎంఎఫ్ బోర్డు నుంచి డాక్టర్ క్రిష్ణ మూర్తిని తొలగించిన భారత్
ఓవైపుఈ సంస్థ నుంచి దాయాది పాక్ కు నిధులు ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయొద్దంటూ భారత్ కోరిన టైంలోనే ఈ మార్పు చోటు చేసుకోవటం గమనార్హం
By: Tupaki Desk | 4 May 2025 10:06 AM ISTఅంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ.. సింపుల్ గా చెప్పాలంటే ఐఎంఎఫ్. ఈ బోర్డు నుంచి డాక్టర్ క్రిష్ణమూర్తి సుబ్రమణియన్ ను తొలగిస్తున్నట్లుగా భారతప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు ఈ సంస్థ నుంచి దాయాది పాక్ కు నిధులు ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయొద్దంటూ భారత్ కోరిన టైంలోనే ఈ మార్పు చోటు చేసుకోవటం గమనార్హం.
భారత ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఐఎంఎఫ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థానం ఖాళీ అయినట్లుగా ప్రకటించింది. నిజానికి ఈ పదవికి 2022 ఆగస్టులో క్రిష్ణమూర్తిని నియమించిన భారత ప్రభుత్వం ఇప్పుడు ఆయన్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన పదవీ కాలం ఈ ఏడాది నవంబరు వరకు ఉంది. ఈ లోపే ఆయన్ను తొలగించటం వెనుక బోలెడు కారణాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఐఎంఎప్ పని తీరు పైనా.. దాని డేటా మెకానిజం మీదా క్రిష్ణమూర్తి చేస్తున్న తీవ్ర విమర్శలు కూడా తాజా నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు. అంతేకాదు.. భారత్ ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయంటూ ఆయన చేస్తున్న విశ్లేషణలు.. ఆ వాదనకు బలం చేకూరేలా ఆయన ఇండియా @100 పుస్తకం కోసం ఆయన భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఈ అతి ప్రచారం కూడా ఆయనపై వేటు పడటానికి కారణమంటున్నారు.
మరోవైపు..ఈ స్థానాన్ని ప్రస్తుతం ఆర్థిక కార్యదర్శిగా ఉన్న అజయ్ సేత్ ను నియమిస్తారని చెబుతున్నారు. వచ్చే నెలలో జాతీయ ఆర్థిక కార్యదర్శిగా రిటైర్ అవుతున్న నేపథ్యంలో.. ఆయన్ను ఐఎంఎఫ్ లోకి తీసుకుంటారని చెబుతున్నారు. నిజానికి కొద్ది రోజుల క్రితమే పాక్ కు ఇవ్వబోయే ఆర్థిక సాయంపై భారత్ కీలక సూచన చేయటం తెలిసిందే. ఈ నెల 9న ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం జరగనుంది. ఇందులో పాకిస్తాన్ కు ఇవ్వబోయే ఆర్థిక సాయం గురించి చర్చించబోతున్నారు. అయితే.. ఈ ఫండింగ్ ఇవ్వొద్దని.. ఈ నిధుల్ని ఉగ్రవాదులకు తరలిస్తోందని భారత్ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఇలాంటి వేళలో భారత్ కు చెందిన డాక్టర్ క్రిష్ణమూర్తిని తొలగించటం ఆసక్తికరంగా మారింది.
