పాలలో మాంసకృత్తులు.. పాలే మాంసం.. అమెరికాతో నాన్ వెజ్ మిల్క్ లొల్లి!
కానీ, ఇప్పుడు పాలు ’నాన్ వెజ్’ అయ్యాయి.. భారత్-అమెరికా వంటి రెండు పెద్ద దేశాల మధ్య వివాదానికి దారితీశాయి.. అసలు నాన్ వెజ్ మిల్క్ ఉంటాయా? అని కొందరు నోరెళ్లబెడుతున్నారు.
By: Tupaki Desk | 20 July 2025 12:00 AM ISTపాలలో మాంసకృత్తులు ఉండును.. పాలు చక్కటి పౌష్టికాహరం... శాకాహారము.. ప్రతి రోజూ పాలు తాగవలెను.. అని మనం చిన్నప్పుడు స్కూల్ బుక్స్ లో చదువుకున్నాం... కానీ, ఇప్పుడు పాలు ’నాన్ వెజ్’ అయ్యాయి.. భారత్-అమెరికా వంటి రెండు పెద్ద దేశాల మధ్య వివాదానికి దారితీశాయి.. అసలు నాన్ వెజ్ మిల్క్ ఉంటాయా? అని కొందరు నోరెళ్లబెడుతున్నారు.
భారతీయులు పొందే పాలు గేదెలు, ఆవుల నుంచి. పూర్తి శాకాహారులైన ఈ జంతువుల నుంచి పొందే పాలు కూడా శాకాహారమే అని చెప్పాల్సిన పనిలేదు. మరి ఇంకేవిధంగా ’నాన్ వెజ్ మిల్క్’ వస్తాయి? అనేదే కదా మీ సందేహం..?
భారతీయ పాడి రైతులు సహజంగా గేదెలు, ఆవులకు దాణా కింద వేసేది ఏమిటి...? గడ్డి, తౌడు, వీలైతే పప్పులు.. కానీ, అమెరికాలో మాత్రం కొన్ని ఫామ్ లలో ఆవులకు మాంసం, చేపలు, కోళ్ల ఈకలు, జంతు వ్యర్థాలను కలిపిన దాణా పెడుతున్నారంట. దీంతో ఆవులు పాలు ఎక్కువగా ఇస్తాయని, బలంగానూ ఉంటాయని అమెరికా రైతులు భావిస్తున్నారు. ఆ మేరకు దాణా పెడుతుండడంతో వాటి నుంచి వచ్చే పాలను నాన్ వెజ్ మిల్క్ అని పిలుస్తున్నారు.
అయితే, అమెరికన్లకు, ఇతర పాశ్చాత్య దేశాల వారికి ఆవు ఓ సాధారణ జంతువే. కానీ, భారతీయులకు మాత్రం గోవు పరమ పవిత్రం. ఈ నేపథ్యంలోనే నాన్ వెజ్ మిల్క్ అంశం వివాదానికి దారితీసింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్ తో కుదుర్చుకోవాలని చూస్తున్న బిజినెస్ డీల్ కు కూడా నాన్ వెజ్ మిల్క్ గొంతులో వెలక్కాయలా అడ్డుపడింది. ఈ ప్రతిష్ఠంభన తొలగింపునకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
పాడి పరిశ్రమ-ఉత్పత్తుల పరంగా అమెరికా అతిపెద్ద ఎగుమతిదారు. గత ఏడాది రూ.60 వేల కోట్ల విలువైన పాడి ఉత్పత్తులను ఎగుమతి చేశారు. తాజాగా అతి పెద్దదైన భారత డెయిరీ మార్కెట్ పై కన్నేశారు. అమెరికా ఏడాది ఎగుమతుల కంటే రెట్టింపు మార్కెట్ భారత్ సొంతం. అసలే బిజినెస్ మన్ అయిన ట్రంప్... కన్ను భారత మార్కెట్ పై పడింది. నాన్ వెజ్ మిల్క్ తో పాటు దాని ఉత్పత్తులైన చీజ్, వెన్న, ఐస్ క్రీమ్ కూడా భారత్ లోకి ప్రవేశపెట్టాలని చూస్తున్నారు.
ఇతర దేశాలపై ఎడాపెడా సుంకాలు విధిస్తూ పోతున్న ట్రంప్... భారత్ ను మాత్రం నాన్ వెజ్ మిల్క్ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని, దిగుమతులు సాఫీగా సాగేలా చూడాలని కోరుతున్నారు. ఐదేళ్లలోనే భారత్ తో వాణిజ్యాన్ని రూ.3.5 లక్షల కోట్లకు పెంచడం అమెరికా లక్ష్యం. ఇందులో భాగమే నాన్ వెజ్ మిల్క్ అమ్మకాలు. కానీ, ట్రంప్ పాచికలు పారేలా లేవు.
ఇప్పటికే నాన్ వెజ్ మిల్క్ పై ఆ పా‘పాలు‘ మాకు వద్దంటూ దేశంలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రోజును పూజలు, హోమాలు, నైవేద్యాలతో మొదలుపెట్టే భారతీయులు.. పాలు, పెరుగు, నెయ్యి లేనిదే ముద్ద దిగని భారతీయులు నాన్ వెజ్ మిల్క్ పై మండిపడుతున్నారు.
మన కల్చర్ లో దేవాలయాల్లో పాలాభిషేకాలు, నెయ్యితో దీపాలు, నైవేద్యాలు భాగం. శాకాహారుల జనాభా 30 శాతం. ఈ నేపథ్యంలోనే నాన్ వెజ్ మిల్క్ కు నో చెప్పేసింది భారత్. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే పాల విషయంలోనూ కఠినమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని నిర్ణయించింది.
అయినా.. ప్రపంచంలో నంబర్ వన్ పాల ఉత్పత్తిదారు భారత్. రెండేళ్ల కిందటే 23 కోట్ల టన్నుల పాలను ఉత్పత్తి చేసింది. ఇది ప్రపంచ ఉత్పత్తిలో 25 శాతం. 8 కోట్లమంది చిన్న, సన్నకారు రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇలాంటప్పుడు మన కల్చర్ ను, మన కోట్లాది రైతులను, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే, లా అమెరికా నుంచి ఆ నాన్ వెజ్ మిల్క్ అవసరమా? అనేది ప్రశ్న.
మన మార్కెట్ ను చూసి ఆ ట్రంప్ విసిరే వలలో పడడం అవసరమా? అనేది ఆలోచించాల్సిన విషయం.
అమెరికా ఉత్పత్తులపై 5-8 శాతం, భారత ఉత్పత్తులపై 10-12 శాతం సుంకాలు విధించేలా వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైంది. కానీ, నాన్ వెజ్ మిల్క్ దగ్గర భారత్ ససేమిరా అని తేల్చి చెప్పింది. జంతు ఆహారంగా తీసుకోని ఆవుల పాలను మాత్రమే పంపాలని తేల్చి చెప్పింది. ప్రతి లీటర్ పాలకు సర్టిఫికెట్ ఇవ్వాలని షరతు విధించింది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత్ పై అమెరికా ఫిర్యాదు చేసింది. అయినా, భారత్ తన వాదనకు నిలబడింది.
