Begin typing your search above and press return to search.

బీజేపీ చేతిలో ప్రాంతీయ పార్టీలు కుదేల్

దేశంలో బీజేపీ ఎదుగుతోంది. ఆ ఎదుగుదల కూడా శర వేగంగా ఉంది. 2014 ముందు వరకూ బీజేపీ చాలా సమస్యలు రాజకీయంగా ఎదుర్కొంది.

By:  Satya P   |   25 April 2026 9:13 AM IST
బీజేపీ చేతిలో ప్రాంతీయ పార్టీలు కుదేల్
X

దేశంలో బీజేపీ ఎదుగుతోంది. ఆ ఎదుగుదల కూడా శర వేగంగా ఉంది. 2014 ముందు వరకూ బీజేపీ చాలా సమస్యలు రాజకీయంగా ఎదుర్కొంది. అయితే 2014లో నరేంద్ర మోడీ వంటి చరిష్మా టిక్ లీడర్ అధికారంలోకి రావడంతో బీజేపీ జోరు పెరిగింది. నాటి నుంచి బీజేపీ దేశ రాజకీయాల్లో అత్యంత ప్రముఖ స్థానం అందుకుంటూ చాలా జోరుగా ఎగబాకుతోంది. మూడుసార్లు వరుసగా కేంద్రంలో అధికారంలోకి రావడం అంటే మామూలు విషయం కాదు. ఇక బీజేపీ కాంగ్రెస్ తో తన పోరుని మొదలెట్టి ఆ పార్టీని విపక్షానికే పరిమితం చేసింది. ఇక సిద్ధాంత బద్ధమైన వైరంతో ఉన్న వామపక్షాలు కూడా బీజేపీతో పోటీ పడలేక నీరసించి పోయాయి. బీజేపీ జాతీయ రాజకీయాల్లో వెలుగుతున్న వేళ పశ్చిమ బెంగాల్ త్రిపుర లలో అధికారం కామ్రేడ్స్ చేయి జారింది. ఇక కేరళలో కనుక అధికారం పోతే ఎర్రన్నల రాజకీయానికి పూర్తిగా రెడ్ సిగ్నల్ పడినట్లే అని అంటున్నారు.

ప్రాంతీయానికి షాక్ :

ఇదిలా ఉంటే దేశంలో మధ్యేవాద పార్టీలుగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇందులో కొన్ని జాతీయ పార్టీల నుంచి ముక్కగా బయటపడి ప్రాంతీయంగా శక్తిగా ఎదిగాయి. ఇవే దేశంలో జాతీయ పార్టీలకు పూర్తి మెజారిటీ కేంద్రంలో రాకుండా చేస్తూ ఎక్కడికక్కడ బలపడుతున్నాయి. దీంతో ఒకే దేశం బలమైన కేంద్రం బలమైన జాతీయ పార్టీ అన్న బీజేపీ సిద్ధాంతాలకు ఇక్కడే విఘాతం ఏర్పడింది. దాంతో బీజేపీ కాంగ్రెస్ తో యుద్ధం చేస్తూనే విపక్షంలో ఉన్న ప్రాంతీయ పార్టీల మీద ఫుల ఫోకస్ పెట్టింది. ఫలితంగా మహారాష్ట్రలో శివసేన రెండుగా చీలింది శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ రెండు ముక్కలు అయింది. యూపీలో మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ ఏమీ కాకుండా పోయింది. బీహార్ లో నితీష్ కుమార్ జేడీయూ బీజేపీతో అంటకాగి పూర్తిగా మమేకం అయిపోయింది. ఆర్జేడీ అయితే తుత్తునియలు అయింది దక్షిణాదిన చూస్తే దేవెగౌడ నాయకత్వంలోని జేడీఎస్ బీజేపీకి పక్క వాయిద్యం అయింది. ఏపీలో టీడీపీ జనసేన మిత్రులుగా ఉంటే వైసీపీ పరోక్షంగా సహకారం అందిస్తోంది. తమిళనాడులో అన్నా డీఎంకే బీజేపీ పొత్తుతో ముందుకు సాగుతోంది. ఇక ఢిల్లీలో ఆప్ ఉంది. జాతీయ పార్టీగ ఎదుగుతూ బీజేపీకి ఇబ్బంది పెడుతోంది. దాంతో ఒక్కసారిగా బీజేపీ ఇచ్చిన స్ట్రోక్ కి ఆప్ కి దిమ్మ దిరిగి బొమ్మ కనిపించినట్లు అయింది.

నిట్ట నిలువు చీలిక :

ఆప్ లో వచ్చిన నిట్ట నిలువు చీలికతో కేజ్రీవాల్ కి భారీ షాక్ తగిలినట్లే. ఇప్పటికే ఏడాది క్రితం అధికారం పోగొట్టుకుని మాజీ సీఎం అయిన కేజ్రీవాల్ కి ఏకంగా ఏడుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరడం కోలుకోలేని విషయం. జైలు జీవితం కూడా చూసిన ఆప్ కి ఇప్పట్లో రాజకీయ ఎదుగుదల అన్నది కూడా ఒక ప్రశ్నగా మారుతోంది అని అంటున్నారు. గుజరాత్ లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆప్ కి ఢిల్లీలో ఏదో విధంగా కూడదీసుకుందామని చూస్తున్న చీపురు పార్టీకి కమలం వేసిన దెబ్బ రీ సౌండ్ మాదిరిగా చెవుల్లో గింగుర్లు పెడుతోంది అని అంటున్నారు.

టార్గెట్లు ఉన్నాయి :

అయితే బీజేపీ ముందు ఇంకా కొన్ని టార్గెట్లు ఉన్నాయని అంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని ఓడించాలి. తమిళనాడులో డీఎంకే స్టాలిన్ ని మాజీని చేస్తే ప్రాంతీయ ప్రత్యర్ధి శేషం పూర్తి అవుతుందని అంటున్నారు. అదే విధంగా 2027లో యూపీలో పోటీ పడుతున్న ఎస్పీ సంగతి కూడా తేల్చాల్సి ఉంది. ఇవి కనుక పూర్తి అయితే దేశంలో ప్రాంతీయ పార్టీల శకం దాదాపుగా పూర్తి అవుతుంది అని అంటున్నారు. దేశంలో అపుడు ఏదైనా ప్రాంతీయ పార్టీ ఉంటే బీజేపీకి మిత్రుడిగా ఉండడమో లేదా విలీనం కావడం తప్ప శరణ్యం లేదని అంటున్నారు. 2029 తరువాత చాలా ప్రాంతీయ పార్టీలు దేశంలో కనుమరుగు అవడం ఖాయమని అంటున్నారు. అందులో తెలుగు నాట కూడా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.