Begin typing your search above and press return to search.

తాజా రిపోర్టు: పెరిగిన ఇళ్ల ధరలు.. హైదరాబాద్ ట్రెండ్ ఏంటి?

2024 ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో 1,20,335 ఇళ్లు/ఫ్లాట్లు అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది అదే సమయంలో 96,285 మాత్రమే అమ్ముడైనట్లుగా పేర్కొంది.

By:  Tupaki Desk   |   27 Jun 2025 8:00 PM IST
తాజా రిపోర్టు: పెరిగిన ఇళ్ల ధరలు.. హైదరాబాద్ ట్రెండ్ ఏంటి?
X

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు..అమ్మకాలపై తాజాగా ఒక రిపోర్టు విడుదలైంది. ఈ ఏడాది ఏప్రిల్ - జూన్ మధ్యన మూడు నెలల వ్యవధిలో ఎలాంటి ట్రెండ్ నడుస్తోందన్న విషయాన్ని ఈ రిపోర్టు వెల్లడించింది. స్థిరాస్తి కన్సల్టెంట్ అన్ రాక్ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగినట్లుగా స్పష్టం చేసింది. అదే సమయంలో ఇళ్ల అమ్మకాలు తగ్గినట్లుగా వెల్లడైంది. ఇందుకు తగ్గ గణాంకాల్ని ఉటంకించింది.

2024 ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో 1,20,335 ఇళ్లు/ఫ్లాట్లు అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది అదే సమయంలో 96,285 మాత్రమే అమ్ముడైనట్లుగా పేర్కొంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే..హైదరాబాద్.. ఢిల్లీ - ఎన్ సీఆర్.. ముంబయి..బెంగళూరు.. పుణే..కోల్ కతా నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గితే.. చెన్నైలో మాత్రం పెరిగినట్లుగా రిపోర్టు వెల్లడించింది.

పహల్గాం ఉగ్రదాడి.. ఆపరేషన్ సిందూర్.. భారత్ - పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కొనుగోలుదారుల సెంటిమెంట్ దెబ్బ తిన్నట్లుగా పేర్కొంది. గడిచిన రెండేళ్లలో ఇళ్ల ధరలు భారీగా పెరగటంతో కొనుగోళ్లు తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అదే కాలానికి ఇళ్ల అమ్మకాలు తగ్గిన మహానగరాల్లో హైదరాబాద్.. ఫుణెలు ఉన్నాయి. 2024లో ఏప్రిల్- జూన్ మధ్య కాలంలో హైదరాబాద్ లో 15,085 ఇళ్లులేదా ఫ్లాట్లు అమ్ముడు కాగా.. ఈ ఏడాది ఇదే సమయానికి కేవలం 11,040 యూనిట్లు మాత్రమే అమ్ముడైనట్లుగా తేల్చారు. అంటే.. గత ఏడాది కంటే ఈ ఏడాది 27 శాతం అమ్మకాలు తగ్గాయి. ఫుణె సైతం 27 శాతం అమ్మకాలు తగ్గాయి.

ముంబయి మహానగరంలో 25 శాతం తగ్గగా..కోల్ కతాలో ఇది 23 శాతంగా ఉంది. ఢిల్లీలో 14 శాతం.. బెంగళూరులో 8 శాతం మాత్రమే అమ్మకాలు తగ్గాయి. చెన్నై మాత్రం గత ఏడాది 5100 యూనిట్లు అమ్ముడు కాగా.. ఈ ఏడాది 5660 యూనిట్లు అమ్ముడైనట్లుగా రిపోర్టు వెల్లడించింది.