Begin typing your search above and press return to search.

రేషన్ కార్డు ఉంటే చాలు -బ్యాంక్ ఖాతాలో డబ్బులు

మీకు రేషన్ కార్డు ఉన్నట్లు అయితే చాలు. డబ్బులు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి.

By:  Satya P   |   7 Feb 2026 2:00 PM IST
రేషన్ కార్డు ఉంటే చాలు -బ్యాంక్ ఖాతాలో డబ్బులు
X

మీకు రేషన్ కార్డు ఉన్నట్లు అయితే చాలు. డబ్బులు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. బాగా ఉంది కదూ. ఇది పథకం కాదు, కానీ రేషన్ కార్డు దారులకు ఎంతగానో ఉపయోగపడే విధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వస్తోంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయి. అదే సమయంలో రేషన్ లబ్దిదారుడు సైతం నష్టపోకుండా ఉంటాడు, అలాగే దొంగ కార్డులకు చెక్ పడుతుంది. అక్రమ బియ్యం దందాలకు కూడా అడ్డు కట్ట పడుతుంది.

బియ్యం అమ్ముకుంటున్నారు :

ప్రస్తుతం చూస్తే ఏ రేషన్ దుకాణంలో అయిన పూర్తిగా బియ్యం తీసుకునే వారు చాలా తక్కువ. బియ్యానికి బదులు డబ్బులు తీసుకుంటున్నారు. దుకాణం దారుడు ఇచ్చే కిలో పది రూపాయలు లెక్కన తీసుకుని తమకు అదే పదివేలు అనుకుంటున్నారు. ఈ ఉచిత బియ్యానికి వచ్చిందే ఎక్కువ అన్నట్లుగా లబ్దిదారులకు ఉంది. కానీ పది రూపాయల బియ్యమే అక్రమంగా దేశం దాటేస్తూ ఇతర దేశాలకు కిలో డెబ్బై ఎనభై రూపాయలుగా పలుకుతోంది అన్నది కూడా ఉంది. ఇలా ఎన్ని రకాలుగా చూసినా ఈ రేషన్ అక్రమ బియ్యానికి ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. దాంతో కేంద్ర ప్రభుత్వమే దీని మీద ఒక సీరియస్ యాక్షన్ కి దిగుతోంది.

సమూలంగా మార్పులు :

దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఉచితంగా బియ్యాన్ని కేంద్రం రేషన్ దుకాణాల ద్వారా సరఫరా కోసం కేటాయిస్తోంది. ఇపుడు ఈ ఉచిత రేషన్ బియ్యం కానీ గోధుమలు ఇతర ఆహార పదార్థాల సరఫరా విషయంలో కానీ పెను మార్పులను తీసుకుని వస్తోంది. ఈ దిశగా దేశవ్యాప్తంగా కీలక అడుగులు పడుతున్నాయి.

నేరుగా బ్యాంక్ ఖాతాలోకే:

ఉచితంగా అందించే బియ్యం, గోధుమలకు సంబంధించి నగదుని నేరుగా ఆయా లబ్దిదారుడి ఖాతాలోకి నేరుగా కేంద్ర ప్రభుత్వమే జమ చేయనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహాయంతో ఈ రుపీ అనే డిజిటల్ ఓచర్ ని ఈ విధంగా అందుబాటులోకి కేంద్రం తీసుకుని రానుంది. ఈ ఓచర్ ద్వారా లబ్దిదారుల మొబైల్ నంబర్ కి ప్రతీ నెలా నగదు జమ పడుతుంది. ఈ మొబైల్ నంబర్ లో ఉన్న ఓచర్ ని రేషన్ దుకాణానికి చూపించి లబ్దిదారుడు తనకు అవసరం అయిన బియ్యం కానీ గోధుమలు కానీ ఇతర ఆహార పదార్ధాలను తీసుకోవచ్చు. అవసరమైన మేరకు తీసుకుంటే ఆ మిగిలిన ఓచర్ లోని మొత్తం బ్యాంక్ లో రీడీం చేసుకునే సదుపాయం లబ్దిదారునికి లభిస్తుంది.

నకిలీలకు బ్రేక్ :

ఈ విధంగా కేంద్రం చేయడం వల్ల బియ్యం అమ్ముకుని డబ్బులు తీసుకునే రాంగ్ రూట్ కి చెక్ పడుతుంది. అంతే కాదు ఎవరు ఎంత బియ్యం తీసుకుంటున్నారు అన్నది డిజిటల్ విధానం ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుంది. ఆ మిగిలిన మొత్తం నగదు కూడా వారి ఖాతాలో పడుతుంది కాబట్టి ఎవరూ నేరుగా రేషన్ వారికి అమ్ముకునే ప్రసక్తి ఉండదు అని భావిస్తున్నారు. అంతే కాకుండా నకిలీ రేషన్ కార్డులకు కూడా అడ్డు కట్ట పడుతుందని భావిస్తున్నారు.

ప్రయోగాత్మకంగా :

ఇక దేశమంతా ఒకేసారి ఈ విధానం అమలు చేయాలనుకున్న కేంద్రం అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్ట్ గ చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో అమలు చేసింది. దాంతో మంచి ఫలితాలు రావడమే కాదు, సక్సెస్ ఫుల్ గా ఈ విధానం సాగింది అని అంటున్నారు. దాంతో ఇపుడు దేశవ్యాప్తంగా ఇదే విధానం అమలులో పెట్టాలని చూస్తున్నారు. అదే కనుక అమలు అయితే ఇక అక్రమ రేషన్ బియ్యానికి అడ్డుకట్ట పడుతుంది అని భావిస్తున్నారు. అలాగే చాలా మటుకు దొంగ రేషన్ కార్డులు తగ్గిపోతాయని కూడా అంటున్నారు.