మతులు పోగొట్టేలా భారత ఎగుమతులు.. 3 నెలల్లోనే 47 శాతం పెరుగుదుల
రెడీమేడ్ వస్త్రాల నుంచి ఆటోమొబైల్ వరకు.. సముద్ర ఎగుమతుల నుంచి.. ఎలక్ట్రానిక్స్ దాకా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత దేశ ఎగుమతులు దుమ్మురేపాయి.
By: Tupaki Desk | 22 July 2025 2:00 AM ISTరెడీమేడ్ వస్త్రాల నుంచి ఆటోమొబైల్ వరకు.. సముద్ర ఎగుమతుల నుంచి.. ఎలక్ట్రానిక్స్ దాకా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత దేశ ఎగుమతులు దుమ్మురేపాయి. ఎలక్ట్రానిక్స్ లోనే ఏకంగా 47 శాతం పెరిగాయి. 12.41 బిలియన్ డార్లకు చేరుకున్నాయి. అమెరికా, యూఏఈతో పాటు చైనా నుంచి కూడా బలమైన డిమాండ్లు రావడమే దీనికి కారణం కావడం విశేషం. మరీ ముఖ్యంగా రెడీమేడ్ వస్త్ర ఎగుమతులు పెరిగి.. మనకు అగ్ర మార్కెట్ గా అమెరికా నిలవడం గమనార్హం. ఉత్పత్తిలో వైవిధ్యంతో పాటు మెరుగైన లాజిస్టిక్స్ కారణంగా భారత్ ఈ మేరకు మూడు నెలల్లోనే అత్యంత భారీ స్థాయి ఎగుమతులు చేయగలిగింది.
మన ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో అమెరికా వాటానే 60.17 శాతం. యూఏఈ (8.09), చైనా (3.88 శాతం), నెదర్లాండ్స్ (2.68 శాతం), జర్మనీ (2.09 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఈ స్థాయి ఎగుమతుల పెరుగుదలను ప్రపంచ ఎలక్ట్రానిక్స్ చైన్ లో భారత దేశం ఆధిపత్యాన్ని చాటుతోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. అంతేకాదు.. ఆసియాలో విశ్వసనీయ ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ఆవిర్భవించిందని ఓ అధికారి వివరించారు. అంతేకాదు.. అధిక విలువైన ఎగుమతి మార్కెట్లతో భారత్ బంధాన్ని పటిష్ఠం చేస్తోందని తెలిపారు. మరికొన్ని కీలక రంగాల్లోనూ ఎగుమతులు అప్ అయినట్లు పేర్కొన్నారు.
రెడీమేడ్ వస్త్రాల ఎగుమతులు నిరుడు తొలి త్రైమాసికంలో 3.85 బిలియన్ డాలర్లు ఉంటే.. నేడు 4.19 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఎగుమతుల్లో 34.11 శాతం వాటాతో భారతీయ దుస్తులకు అమెరికా అతిపెద్ద మార్కెట్ గా మారింది. తర్వాత యూకే (8.81 శాతం), యూఏఈ (7.85 శాతం), జర్మనీ (5.51 శాతం), స్పెయిన్ (5.29 శాతం) ఉన్నాయి. తయారీలో నైపుణ్యం, ఉత్పత్తుల్లో వైవిధ్యం, నాణ్యత, ఆమోదం భారత రెడీమేడ్ గార్మెంట్స్ ఎగుమతుల విజయ రహస్యం.
సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 19.45 శాతం పెరిగి 1.95 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులోనూ 37.63 శాతం వాటా అమెరికాదే. ఇక చైనా (17.26 శాతం), వియత్నాం (6.63 శాతం), జపాన్ (4.47 శాతం), బెల్జియం (3.57 శాతం) తర్వాత ఉన్నాయి.
ఉత్పత్తుల్లో వైవిధ్యం, మెరుగైన కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ సముద్ర ఆహార ఎగుమతుల్లో భారత దేశ ప్రగతికి కారణమయ్యాయి. ఆటోమొబైల్ ఎగుమతులు తొలి క్వార్టర్ లో 22 శాతం పెరిగి 14.57 లక్షల యూనిట్లకు చేరాయి. ప్రయాణికుల వాహనాల ఎగుమతులు రికార్డు స్థాయిలో 2.04 లక్షల యూనిట్లకు చేరాయి. ఇందులో ప్రఖ్యాత మారుతి సుజుకీనే 96,181యూనిట్లు కావడం విశేషం.
