మోడీ వ్యతిరేకులకు నచ్చని ర్యాంక్.. పత్రికా స్వేచ్ఛలో ఏడాదిలో పైకి
అవును.. ఇప్పుడు ప్రతిదీ రాజకీయమే. రాజకీయ వైరం ఉన్నప్పటికి మంచిని మంచిగా.. చెడును చెడుగా చూపించేవాళ్లు.
By: Tupaki Desk | 17 May 2025 11:00 AM ISTఅవును.. ఇప్పుడు ప్రతిదీ రాజకీయమే. రాజకీయ వైరం ఉన్నప్పటికి మంచిని మంచిగా.. చెడును చెడుగా చూపించేవాళ్లు. ఈ విషయంలో పత్రికలు కాస్త మెరుగైన వ్యవహారశైలిని ప్రదర్శించేవి. కానీ.. కొన్నేళ్లుగా ఆ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. దేశ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉండే మీడియా.. తామరాకు మీద నీటి బొట్టులా వ్యవహరించేది. ఇలా అందరూ కాకున్నా.. మెజార్టీ ఇలాంటి తీరును ప్రదర్శించేది. కొన్నేళ్లుగా పాత్రికేయం కూడా రాజకీయంగా ఒక భాగంగా మారిపోవటం.. వారి రాజకీయ ప్రయోజనాలు తమ ప్రయోజనాలుగా భావించే కొత్త కల్చర్ వచ్చింది. దీంతో.. పరిస్థితులు మారాయి.
మంచి జరిగినా.. అందులో ఏదో ఒక నెగిటివ్ అంశాన్ని ఎత్తి చూపే ధోరణి ఎక్కువైంది. ఇదంతా ఎందుకంటే ప్రపంచ పత్రికా స్వేచ్ఛకు సంబంధించి భారత దేశం గత ఏడాది కంటే తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఇలాంటి అంశాల విషయంలో మోడీ రాజకీయ విధానానికి వ్యతిరేకంగా వ్యవహరించే మీడియా సంస్థలకు అస్సలు నచ్చనిదిగా మారుతుంది. మొత్తం 180 దేశాలకు సంబంధించి చేపట్టిన సర్వేలో భారత్ 151వ స్థానంలో నిలిచింది. రిపోర్టర్స్ విదౌట్ బోర్డర్స్ సంస్థ ఈ నివేదికను సిద్ధం చేసింది. గత ఏడాది భారత్ కు 159వ స్థానం దక్కితే.. ఈ ఏడాది ఎనిమిది స్థానాల్ని మెరుగుపర్చుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా 5 వేల మందికి పైగా వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారంతో ఈ ర్యాంకుల్ని ఖరారు చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో విధాన నిర్ణేతలు.. పాత్రికేయులు.. విభిన్న సైద్ధాంతిక భావజాలంతో పాటు.. వివిధ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో ఫిన్లాండ్.. ఎస్తోనియా.. నెదర్లాండ్స్.. తొలి మూడు స్థానాల్లో నిలవగా.. అమెరికా గత ఏడాది కంటే రెండు స్థానాలు కిందకు వెళ్లి 57వ ర్యాంకులో నిలిచింది. కెనడా 10వ ర్యాంకులో నిలిస్తే.. ఆస్ట్రేలియా 29 ర్యాంకులో నిలిచింది.
భారత్ లో సుమారు 900 ప్రైవేటు టీవీ చానళ్లు ఉండగా.. వాటిలో సగం న్యూస్ చానళ్లుగా పేర్కొంది. 20కు పైగా భాషల్లో 1.40 లక్షల ప్రచురణలు వెలువడుతన్నాయని.. వీటిల్లో 20 వేల దినపత్రికలకు నిత్యం 39 కోట్లకు పైగా సర్క్యేటేషన్ ఉన్నట్లు తెలిపింది. లాభాల్ని ఆశించని ఈ ప్రభుత్వేతర సంస్థకు పారిస్ లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. మోడీ సర్కారులో పత్రికా స్వేచ్ఛ లేదని తరచూ విమర్శించే వారికి.. తాజా ర్యాంకింగ్ మింగుడుపడనిదిగా ఉంటుందని చెప్పక తప్పదు.
