రిపోర్టు: తాజాగా దేశ జనాభా 142.5 కోట్లు
ఓవైపు దేశ వ్యాప్తంగా జనాభా లెక్కల మిషన్ భారీ ఎత్తున సాగుతోంది. అదే సమయంలో.. భారతదేశంలో పురుషులు - మహిళలు 2025 పేరుతో ఒక రిపోర్టు విడుదలైంది.
By: Garuda Media | 30 April 2026 9:59 AM ISTఓవైపు దేశ వ్యాప్తంగా జనాభా లెక్కల మిషన్ భారీ ఎత్తున సాగుతోంది. అదే సమయంలో.. భారతదేశంలో పురుషులు - మహిళలు 2025 పేరుతో ఒక రిపోర్టు విడుదలైంది. ఈ నివేదికలో ఆసక్తికర అంశాలు బోలెడున్నాయి. ప్రస్తుత దేశ జనాబా మీద క్లారిటీతో పాటు.. రానున్న పదేళ్లలో పరిస్థితుల్లో మార్పులు ఎలా వస్తాయన్న దానిపైనా ఒక స్పష్టత ఇవ్వటం ఈ రిపోర్టు విశేషంగా చెప్పాలి. తాజాగా దేశ జనాభా 142.58 కోట్లు అయితే.. 2026 నాటికి మరో 10 కోట్లకు పైనే జనాభా పెరుగుతుందన్న అంచనా వేశారు.
2017-23 మధ్యలో దేశంలో ప్రతి వెయ్యి మంది బాలురుకు బాలికల సగటు 904 నుంచి 917కు పెరిగినట్లుగా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 914 కాగా.. పట్టణాల్లో 925 కావటం విశేషం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ లో బాలికల నిష్పత్తి సగటు అత్యధికంగా 1085 కాగా.. నాగాలాండ్ లో 1007.. గోవాలో 973తో తొలి మూడుస్థానాల్లో నిలిచాయి.
ఈ జాబితాలో చివర్లో నిలిచిన మూడు రాష్ట్రాల్లో తెలంగాణ (906), బిహార్ (900), జార్ఖండ్ (899)నిలవగా.. ఏపీలో 931 మంది ఉన్నట్లుగా పేర్కొన్నారు. జాబితాలో ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో నిలిచింది. దేశంలో అక్షరాస్యత 77.7 శాతంగా పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 2023 నాటికి అమ్మాయిల సగటు వయసు 22.4 ఏళ్లు కాగా.. యువకులది 24.3 ఏళ్లుగా లెక్కేశారు. ఇక.. భారతీయుల సగటు జీవితకాలం విషయానికి వస్తే 2026-30నాటికి పురుషుల్లో 70.4 ఏళ్లు అయితే.. మహిళల్లో 73.4 ఏళ్లుగా అంచనా వేశారు. 2036 నాటికి ఇది మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
పాఠశాల విద్య కోసం ఒక్కో విద్యార్థిపై ఏటా సగటున దేశంలో రూ.13051 ఖర్చు చేస్తున్నారు. అత్యధికంగా మణిపూర్ లో రూ.23,983 ఖర్చు చేస్తే.. పంజాబ్ లో రూ.22,338 ఖర్చు చేస్తున్నారు. తెలంగాణలో రూ.21,652, ఏపీలో రూ.19,334 ఖర్చు చేస్తున్నట్లుగా రిపోర్టులో పేరకొన్నారు. తెలంగాణ పట్టణ ప్రాంతంలో ఒక్కో విద్యార్థికి ఏటా ఖర్చు చేస్తున్నది రూ.31,633 అయితే.. ఏపీలో కేవలం రూ.26,784 మాత్రమే ఉండటం గమనార్హం. దేశంలోని పదహారు రాష్ట్రాల్లోని ఇళ్లల్లో 90 శాతం నిర్ణయాలు తీసుకోవటం తల్లి పాత్ర ఉంటున్నట్లుగా పేర్కొన్నారు.
ఏపీలో ఇది 84.1 శాతంగా ఉంటే.. తెలంగాణలో 87.2 శాతంగా పేర్కొన్నారు. అత్యధికంగా నాగాలాండ్ లో 99.2 శాతంగా ఉంటే.. మిజోరంలో 98.8 శాతం.. పుదుచ్చేరిలో 97.9 శాతంగా తల్లిదే నిర్ణయంగా పేర్కొన్నారు. ఇంటిపనుల్లో మహిళలు రోజుకు 289 నిమిషాలు కష్టపడుతుంటే.. పురుషులు 88 నిమిషాలే కష్టపడుతున్నట్లుగా నివేదిక వెల్లడించింది. కూలీలు..కార్మికులకు గత ఏడాది రోజుకు సగటు వేతన చెల్లింపు విషయంలో పశ్చిమ బెంగాల్.. హర్యానా రాష్ట్రాల్లో మహిళా కూలీలకు అగ్రస్థానం దక్కుతోంది. హర్యానా పట్టణ ప్రాంతాల్లో రోజు కూలి సగటు రూ.582 దక్కితే.. మహిళలకు రూ.600 ఇస్తున్నారు. అదే పశ్చిమ బెంగాల్ లో వరుసగా రూ.423, రూ.468గా ఉంది. కేరళలో అత్యధికంగా రూ.970 ఇస్తున్నారు. మహిళలకు మాత్రం కేవలం రూ.448 ఇవ్వటం గమనార్హం. తెలంగాణలో పురుషులకు రూ.703, ఏపీలో పురుషఉలకు రూ.636గా ఉంది. అదే మహిళలకు అయితే తెలంగాణలో రూ.347, ఏపీలో రూ.354గా ఉంది.
ఊబకాయంతో బాధ పడే మహిళలు 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారు 20 శాతం నుంచి 24శాతానికి పెరిగారు. తెలంగాణ మహిళల్లో 8.9 వాతం.. పురుషుల్లో 7.5 శాతం మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. అదే ఏపీలో ఇది 12 శాతం.. 6.3 శాతంగా ఉంది. తెలంగాణ జనాభాలో 15 ఏళ్లు దాటిన వారిలో పురుషులు 22.3 శాతం.. మహిళల్లో ఐదారుశాతం మంది పొగాకు ఉత్పత్తులు వాడుతుంటే ఏపీలో 22.6 శాతం పురుషుల్లో, 3.9 శాతం మహిళల్లో ఉండటం గమనార్హం.
భారత పార్లమెంట్ సభ్యుల్లో 13.65 శాతం.. కేంద్ర మంత్రుల్లో 9.86 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఎమ్మెల్యేల్లో ఏపీలో 13, తెలంగాణలో 8 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. జాతీయ సగటు 9.46 శాతంగా ఉంది. ఛత్తీస్ గఢ్ లో 21 వాతం మంది ఉన్నట్లుగా నివేదిక పేర్కొంది. సుప్రీంకోర్టులో 33 మంది న్యాయమూర్తుల పోస్టులు ఉంటే.. మహిళలు 3.03 శాతంగా ఉంది. మొత్తం హైకోర్టుల్లో14.3 శాతం మంది మహిళలు ఉండగా.. తెలంగాణ హైకోర్టులో 25 శాతం.. ఏపీ హైకోర్టులో 15.15 శాతం ఉన్నారు. సిక్కింలో అత్యధికంగా 33.3 శాతం మంది మహిళా న్యాయమూర్తులు ఉండటం ఆసక్తికరం.
