జనం చేతుల్లోకి పాలిమర్ కరెన్సీ
ఇక మీదట దేశంలోని జనం చేతిలో పాలిమర్ కరెన్సీని చూస్తారు అని అంటున్నారు. ఈ మేరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ భారీ స్థాయిలో కసరత్తు చేస్తోంది.
By: Satya P | 18 July 2026 8:45 AM ISTఇక మీదట దేశంలోని జనం చేతిలో పాలిమర్ కరెన్సీని చూస్తారు అని అంటున్నారు. ఈ మేరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ భారీ స్థాయిలో కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలామణీలో ఉన్నది కాగితం కరెన్సీ అన్నది తెలిసిందే. ఇది అలా చేతులు మారేసరికల్లా నలిగిపోయి చిరిగిపోయి నానా వంకరలూ తిరిగిపోతోంది. దాంతో విలువ ఎంత ఉన్నా చలామణి అవడం మాత్రం బహు కష్టంగా మారిపోతోంది. ఎన్ని కాగితం కరెన్సీని ముద్రించినా జనాల చేతుల్లో అవి తక్కువ సమయంలోనే పాడు అవుతున్నాయి. దాంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ సరికొత్తగా ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఉన్న కాగితపు కరెన్సీకి ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ లేదా పాలిమర్ సబ్‌స్ట్రేట్ షీట్లతో తయారు చేసిన పాలిమర్ కరెన్సీని దేశంలో ప్రవేశపెట్టేందుకు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది అని అంటున్నారు.
చిన్న నోట్లతోనే ప్రయోగం :
ఎక్కువగా జనం చేతుల్లో ఉండేవి చిన్న నోట్లే. పైగా చిల్లర సమస్య కూడా అక్కడే వస్తోంది. పెద్ద నోట్లకు యూపీఐ ఎటూ ఉంది. కాబట్టి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా ముందుగా రూ. 10, రూ. 20 విలువైన నోట్లతో ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ గా పాలిమర్ కరెన్సీ విధానాన్ని ప్రారంభించాలని చూస్తోంది అని అంటున్నారు. ఇక 2027 నాటికి పూర్తి స్థాయిలో పాలిమర్ కరెన్సీని అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఆర్బీఐ యోచిస్తోంది. పాలిమర్ కరెన్సీకి సంబంధించిన ముఖ్యమైన విశేషాలు చూస్తే కనుక ప్రయోజనాలు గరిష్టంగానే ఉన్నాయి. కాగితం కరెన్సీతో పోలిస్తే పాలిమర్ నోట్లు దాదాపుగా 2.5 నుంచి 5 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయని చెబుతున్నారు.
అన్ని విధాలుగా మేలు :
అంతే కాదు పాలిమర్ కరెన్సీ అన్నది వాటర్‌ప్రూఫ్ గా ఉంటాయి. ఇవి నీటిలో తడిసి కూడా ఏ మాత్రం పాడైపోవు. అలాగే మురికి కూడా ఎక్కడా వీటికి అంటుకోదు. పర్యావరణానికి హాని చేయకుండా రీసైకిల్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. అదే విధంగా భద్రత విషయంగా చూసినా వీటి ముద్రణలో పారదర్శక కిటికీలు వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉంటాయి. దీనివల్ల నకిలీ నోట్లను ముద్రించడం ఎవరికైనా దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు. అలాగే ఖర్చు విషయం తీసుకుంటే కాగితపు నోట్లు త్వరగా చిరిగిపోవడం వల్ల వాటిని పదే పదే ఆర్బీఐ ముద్రించాల్సి వస్తోంది. అదే పాలిమర్ నోట్లను చలామణీలోకి తెస్తే కనుక దీర్ఘకాలంలో ముద్రణా వ్యయం గణనీయంగానే తగ్గుతుంది అని అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కూడా :
ఇక ఇపుడు చూస్తే అనేక దేశాలలో పాలిమర్ కరెన్సీ వ్యాప్తిలో ఉంది. అలాగే ఇప్పటికే ఆస్ట్రేలియా 1988 లోనే తొలిసారిగా పాలిమర్ కరెన్సీ ప్రవేశపెట్టింది. ఇక కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్, సింగపూర్ వంటి 60కి పైగా దేశాలు పాలిమర్ కరెన్సీని ఈ రోజున విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. అందుకే వీటిని అధ్యయనం చేసిన మీదట భారత్‌లో కూడా ఈ విధానం అమలులోకి తేవాలని చూస్తున్నారు. ఈ పాలిమర్ నోట్లు వచ్చినప్పటికీ ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీని పూర్తిగా రద్దు చేయరు. రెండూ సమాంతరంగా చలామణిలో ఉంటాయని చెబుతున్నారు. మొత్తానికి రానున్న రోజులలో జనం చేతిలో పాలిమర్ కరెన్సీ కనిపిస్తాయి అన్న మాట. అయితే ఆర్బీఐ దీని మీద ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు. తొందరలో చేస్తుందని అంటున్నారు.
