కేంద్రంలో భారీ మార్పులు.. పది రోజుల్లో కీలక పరిణామాలు
దేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయా? అధికార బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకంతోపాటు కేంద్ర మంత్రివర్గంలోనూ భారీ మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని రాజధాని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 18 April 2025 4:00 PM ISTదేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయా? అధికార బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకంతోపాటు కేంద్ర మంత్రివర్గంలోనూ భారీ మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని రాజధాని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరో వారం పది రోజుల్లోనే పార్టీ, ప్రభుత్వంలో ప్రక్షాళన ఉండొచ్చని కమలం పెద్దలు సంకేతాలు పంపుతున్నారు. అయితే కొత్త అధ్యక్షుడు కాబోయే నేత పార్టీతోపాటు ప్రభుత్వంపైనా పట్టుసాధించేలా ఉండాలని సంఘ్ పరివార్ కోరుకుంటుందనే ప్రచారమే ఆసక్తి రేపుతోంది.
ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రధాని మోదీ శకం నడుస్తోంది. 2014లో ప్రధానిగా మోదీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వం, బీజేపీలో మోదీ వన్ మేన్ షో నడిచేది.. ప్రస్తుతం నడుస్తుంది కూడా.. అయితే ఈ పరిస్థితిలో మార్పు రావాలని సంఘ్ పరివార్ కోరుకుంటోందని అంటున్నారు. మోదీ మూడోసారి ప్రధాని పదవీకాలం పూర్తయిన తర్వాత కూడా బీజేపీ బలంగా ఉండాలనే ఆలోచనతో ఉన్న సంఘ్ పరివార్ పార్టీ అధ్యక్షుడిగా బలమైన నేత ఉండాలని కోరుకుంటున్నారని అంటున్నారు. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన ఆర్ఎస్ఎస్ తాజా సూచనలను బీజేపీ పెద్దలు పాటించాల్సిన అనివార్య పరిస్థితులు ఉన్నాయంటున్నారు. దీంతో మరో వారం రోజుల్లోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతోపాటు పార్టీలోనూ భారీ మార్పులు ఉంటాయంటున్నారు. అదే సమయంలో నాలుగైదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే అవకాశం ఉందని అంటున్నారు.
దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ, మిత్రపక్షాల ప్రభుత్వాలే ఉన్నప్పటికీ గత సార్వత్రిక ఎన్నికల్లో అత్తెసరు సంఖ్యలో గెలవడం, మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని కొనసాగించాల్సి రావడాన్ని బీజేపీ పెద్దలతోపాటు ఆర్ఎస్ఎస్ అగ్ర నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో కచ్చితంగా ఓడిపోతాయని సర్వేలు తెలిపిన మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలల్లో ఆఎస్ఎస్ ఫార్ములా వర్క్ అవుట్ అవ్వడాన్ని గుర్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా ఈ ఫార్ములా అమలు కావాలంటే బలమైన నేత పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని ఆర్ఎస్ఎస్ సూచిస్తోందని అంటున్నారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో ఉన్న కొందరు మంత్రులను తప్పించాలని సూచనలు ఉన్నాయంటున్నారు.
ప్రజలతో నేరుగా సంబంధం లేని చాలా మంది కేంద్ర మంత్రులుగా ఉన్నారని, దీనివల్ల ప్రజలను ఆకర్షించలేకపోతున్నామని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడుతోందని అంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా పనిచేసిన కొందరి ప్రతిభ ఆధారంగా కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకోవడం వల్ల రాజకీయంగా ప్రయోజనం దక్కడం లేదని ఆర్ఎస్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ఐపీఎస్ గా పనిచేసి రాజీనామా చేసిన తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై వంటివారిని కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకోవాలని ఆర్ఎస్ఎస్ నుంచి సూచనలు వస్తుండటం గమనార్హం అంటున్నారు.
ఇదేవిధంగా కొంతమంది గవర్నర్ల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందని బీజేపీతోపాటు ఆర్ఎస్ఎస్ నేతలు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారని చెబుతున్నారు. తమిళనాడు గవర్నర్ రవి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం పెట్టుకోవడం, తమిళనాడు ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించడమే కాకుండా నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలతో దక్షిణాదితో పార్టీని వేరు చేసే వ్యూహాన్ని అమలు చేయడాన్ని బీజేపీ పెద్దలు సీరియస్ గా తీసుకున్నారని అంటున్నారు. ఈ రాజకీయ వ్యూహం నుంచి బయటపడాలంటే గవర్నర్ ను మార్చాలనే అంశాన్ని పరిశీలిస్తున్నారని అంటున్నారు. అయితే ఒక్క తమిళనాడు గవర్నర్ ను మార్చితే స్టాలిన్ ప్రభుత్వానికి తలొగ్గినట్లు అవుతుందనే ఆలోచనతో దేశవ్యాప్తంగా నలుగురైదుగురు గవర్నర్లను మార్చాలనే ప్రతిపాదన పరిశీలిస్తున్నారని అంటున్నారు. దీంతో ఈ నెలాఖరు లేదా మే మొదటి వారంలో దేశ రాజకీయాల్లో భారీ మార్పులు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
