Begin typing your search above and press return to search.

రూపీ 2.0: త్వరలో రానున్న ప్లాస్టిక్ నోట్లు? ఆర్‌బీఐ కీలక ముందడుగు!

పాలిమర్ నోట్లు అంటే ఒక ప్రత్యేక రకమైన ప్లాస్టిక్ పదార్థంతో తయారయ్యే కరెన్సీ. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే వీటిలో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

By:  A.N.Kumar   |   30 May 2026 5:00 AM IST
రూపీ 2.0: త్వరలో రానున్న ప్లాస్టిక్ నోట్లు? ఆర్‌బీఐ కీలక ముందడుగు!
X

భారతీయ కరెన్సీ వ్యవస్థలో ఒక పెద్ద మార్పు రాబోతోందా? త్వరలోనే మన జేబుల్లోని కాగితపు నోట్ల స్థానంలో సరికొత్త 'ప్లాస్టిక్ నోట్లు' దర్శనమివ్వనున్నాయా? అంటే అవుననే అంటున్నాయి బ్యాంకింగ్ వర్గాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలోనే ఈ మేరకు ఒక సంచలన ప్రాజెక్టును ప్రకటించే అవకాశముందని సమాచారం.

ప్రస్తుతం ఉన్న సమస్య ఏంటి?

ప్రస్తుతం మన దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లను ప్రత్యేక కాటన్ ఆధారిత కాగితంతో తయారు చేస్తున్నారు.ఈ నోట్లు త్వరగా పాడైపోతుంటాయి. నోట్లు చిరిగిపోవడం, మురికిగా మారడం వల్ల ఆర్‌బీఐ తరచుగా కొత్త నోట్లను ముద్రించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి నిర్వహణ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి.

పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లు అంటే ఏమిటి? ఎందుకు బెటర్?

పాలిమర్ నోట్లు అంటే ఒక ప్రత్యేక రకమైన ప్లాస్టిక్ పదార్థంతో తయారయ్యే కరెన్సీ. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే వీటిలో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇవి సాధారణ నోట్ల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. నీరు, దుమ్ము, తేమ, లేదా చెమట వంటి వాటికి ఇవి అస్సలు దెబ్బతినవు. భారతదేశం లాంటి విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్న దేశానికి ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్. నకిలీ నోట్లకు కళ్లెం పడుతుంది. భద్రత పరంగా పాలిమర్ నోట్లు అత్యంత సురక్షితమైనవి. వీటిలో పారదర్శక విండోలు, హోలోగ్రామ్‌లు, అధునాతన సెక్యూరిటీ ఫీచర్లను సులభంగా అమర్చవచ్చు. ఫలితంగా నకిలీ నోట్ల ముద్రణకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ నోట్ల ట్రెండ్

ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే ఈ టెక్నాలజీని విజయవంతంగా వాడుతున్నాయి. ప్రపంచంలోనే తొలిసారిగా పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టిన దేశం ఆస్ట్రేలియా.. యునైటెడ్ కింగ్‌డమ్ కూడా పౌండ్ నోట్లను ప్లాస్టిక్‌లోకి మార్చి సక్సెస్ అయ్యింది. కెనడా, న్యూజిలాండ్ దేశాల్లో ప్లాస్టిక్ నోట్ల వల్ల నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి.

సవాళ్లు కూడా ఉన్నాయి..!

పాలిమర్ నోట్లను తీసుకురావడం వినడానికి బాగున్నా, దీని వెనుక భారీ కసరత్తు అవసరం అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎం లు, నోట్ల లెక్కింపు యంత్రాలను కొత్త నోట్లకు అనుగుణంగా మార్చాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ నోట్ల ముద్రణ కోసం సరికొత్త టెక్నాలజీ, ప్లాంట్లను ఏర్పాటు చేయాలి ప్రజల్లో ఈ నోట్ల వాడకంపై విస్తృతమైన అవగాహన కల్పించాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు ఆర్‌బీఐ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఈ చర్చలు భారత కరెన్సీ వ్యవస్థ ఆధునికీకరణ దిశగా ఒక కీలక అడుగుగా భావించవచ్చు. ఒకవేళ ఈ ప్రతిపాదన నిజమైతే భారతీయ కరెన్సీ చరిత్రలో ఇదొక సరికొత్త మైలురాయి కానుంది.