Begin typing your search above and press return to search.

పెట్రోల్, డీజిల్ పై రూ.10 తగ్గింపు, కానీ...

పెట్రోల్, డీజిల్ పై రూ10 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం రూ.3కి తగ్గింది.

By:  Tupaki Political Desk   |   27 March 2026 10:30 AM IST
పెట్రోల్, డీజిల్ పై రూ.10 తగ్గింపు, కానీ...
X

పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు ఊరట కల్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా చమురు సంక్షోభం నెలకొనడం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. క్రూడాయిల్ ధరల భారం ప్రజలపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. అంతేకాకుండా పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా ప్రత్యామ్నాయం చర్యలు తీసుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. శుక్రవారం నాటి ట్రేడింగులో బెంట్ క్రూడ్ ధర 100 డాలర్లకు ఎగబాకింది. దీంతో పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిపోతుంది. పెట్రోలియం కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ పై దాదాపు రూ.48 వరకు కంపెనీలు భారం మోస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.10 మేర తగ్గించింది. దీనివల్ల ప్రజలకు నేరుగా మేలు జరగకపోయినా, ఆ మేరకు ధరలు పెరగకుండా ప్రభుత్వం కట్టడి చేసింది.

పెట్రోల్, డీజిల్ పై రూ10 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం రూ.3కి తగ్గింది. డీజిల్ పై పూర్తిగా తొలగిపోయినట్లైంది. ఈ ప్రయోజనం వినియోగదారులకు అందకపోయినా, భవిష్యత్తులో పెట్రో ధరల మోత లేకుండా ఉపశమనం కల్పించడమే అంటున్నారు. ఇక ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో చమురు కొరత తలెత్తకుండా కేంద్రం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది వెల్లడించింది.

దేశంలో ఇంధన కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే 60 రోజులకు పరిపడా పెట్రో నిల్వలు ఉన్నాయని, వినియోగదారులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ కొరత నెలకొంటుందని దేశవ్యాప్తంగా భయాందోళనలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం ప్రకటనతో వినియోగదారులు ఊరట చెందుతున్నారు. దేశంలో అన్ని రిటైల్ అవుట్ లెట్లలో చాలినంత నిల్వలు ఉన్నట్లు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 40 మంది సరఫరాదారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రూడ్ ఆయిల్ దేశానికి వస్తోందని కేంద్రం తెలియజేసింది. దేశంలో ఆయిల్ రిఫైనరీలు కూడా వంద శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దేశంలో అందరికీ 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ రిజర్వు నిల్వలతో కలిపి 74 రోజులకు సరిపోతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇక అసత్య ప్రచారం చేస్తూ పెట్రోల్, డీజిల్ పై వినియోగదారుల్లో గందరగోళం సృష్టించేవారిపై చర్యలు తీసుకుంటామని కేంద్రం ఆ ప్రకటనలో హెచ్చరించింది.