తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న సీట్లు: ఏపీలో 263, తెలంగాణలో 179 అసెంబ్లీ స్థానాలు!
నియోజకవర్గాల పెంపు ప్రక్రియ అమలైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి.
By: A.N.Kumar | 24 March 2026 9:27 AM ISTతెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసేలా.. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పెంపు అంశం మరోసారి జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఉన్న స్థానాలను ఏకంగా 50 శాతం మేర పెంచే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది.
దేశవ్యాప్తంగా పెరగనున్న ప్రజాప్రతినిధుల సంఖ్య
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన గనుక పట్టాలెక్కితే భారత పార్లమెంటరీ చరిత్రలో ఇది ఒక మైలురాయి కానుంది. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 534 స్థానాల సంఖ్య ఏకంగా 816కి చేరే అవకాశం ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం ఉన్న 4,123 అసెంబ్లీ స్థానాలు 6,185కి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లోనే కీలక బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో కొత్త సమీకరణాలు
నియోజకవర్గాల పెంపు ప్రక్రియ అమలైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 50 శాతం పెంపుతో అవి 263కి చేరుతాయి. లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 179కి.. లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కి పెరిగే అవకాశం ఉంది. ఈ పెరుగుదల వల్ల క్షేత్రస్థాయిలో కొత్త నాయకత్వం ఉద్భవించడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కోటా కూడా గణనీయంగా పెరగనుంది.
మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ లింక్
కేంద్రం 2023లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించినప్పటికీ అది అమలు కావాలంటే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. వాస్తవానికి 2034 నుంచి ఈ రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉంది. అయితే 2027 మార్చి నాటికి జనగణన పూర్తి చేసి, ప్రాథమిక గణాంకాల ఆధారంగానే పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీనికోసం మహిళా రిజర్వేషన్ , డీలిమిటేషన్ చట్టాలకు అవసరమైన సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలు.. కేంద్రం వ్యూహం
సాధారణంగా జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే, జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు ఎక్కువగా పెరిగి దక్షిణాది ప్రాధాన్యత తగ్గుతుందని ప్రాంతీయ పార్టీలు వాదిస్తున్నాయి. ఈ వివాదానికి చెక్ పెట్టేందుకే కేంద్రం '50 శాతం ఫార్ములా'ను తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో సమాన నిష్పత్తిలో సీట్లు పెంచడం ద్వారా ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలనేది కేంద్రం ఆలోచనగా ఉంది.
రాజకీయ చర్చలు.. భవిష్యత్ కార్యాచరణ
ఢిల్లీ వేదికగా జరిగిన ఎన్డీయే మిత్రపక్షాల సమావేశంలో ఈ అంశంపై ప్రాథమిక చర్చ జరిగినట్లు సమాచారం. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలను కూడా సంప్రదించి.. ఏకాభిప్రాయం సాధించాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలోనే విపక్ష నేతలు నేడు ప్రత్యేకంగా సమావేశమై తమ వ్యూహాన్ని ఖరారు చేసుకోనున్నారు.
ఒకవేళ ఈ ప్రక్రియ అనుకున్నట్లుగా సాగితే.. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా పెరిగిన నియోజకవర్గాల్లో పోలింగ్ జరగడం ఖాయం.
