Begin typing your search above and press return to search.

మాస్కో ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్ దాడి.. భారత ఎంపీల విమానం గాల్లోనే ఉత్కంఠ!

అంతర్జాతీయ దౌత్య సంబంధాలు, భద్రతాపరమైన ఉద్రిక్తతలు ఎలా ఒకేసారి ప్రభావితం చేస్తాయో చెప్పడానికి రష్యా రాజధాని మాస్కోలో తాజాగా జరిగిన ఒక సంఘటన నిదర్శనం.

By:  Tupaki Desk   |   23 May 2025 1:16 PM IST
మాస్కో ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్ దాడి.. భారత ఎంపీల విమానం గాల్లోనే ఉత్కంఠ!
X

అంతర్జాతీయ దౌత్య సంబంధాలు, భద్రతాపరమైన ఉద్రిక్తతలు ఎలా ఒకేసారి ప్రభావితం చేస్తాయో చెప్పడానికి రష్యా రాజధాని మాస్కోలో తాజాగా జరిగిన ఒక సంఘటన నిదర్శనం. పాకిస్తాన్ ఉగ్రవాదుల కుట్రలను ప్రపంచానికి తెలియజేయడానికి మాస్కో చేరుకున్న భారత పార్లమెంటరీ బృందం విమానం, ఉక్రెయిన్ డ్రోన్ దాడి కారణంగా గాల్లోనే చాలాసేపు చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతంలోనే ఇలాంటి పరిస్థితుల గురించి అంచనా వేయడం ఈ ఘటనకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.

డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం, పాకిస్తాన్‌లో తిష్ట వేసిన ఉగ్రవాదుల కార్యకలాపాలను రష్యా ప్రభుత్వానికి, అక్కడి ఉన్నతాధికారులకు, నిపుణులకు తెలియజేయడానికి మాస్కో పర్యటనకు వెళ్ళింది. ఈ పర్యటన భారత్‌కు వ్యతిరేకంగా జరిగే ఉగ్రవాద కార్యకలాపాలను అంతర్జాతీయ వేదికపై ఎండగట్టడంలో కీలకమైనది. అయితే, భారత బృందం విమానం మాస్కో గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే, ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. మాస్కోలోని విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. దీంతో అప్రమత్తమైన రష్యా అధికారులు, మాస్కోలోని అన్ని విమానాశ్రయాలలో విమానాల రాకపోకలను వెంటనే నిలిపివేశారు.

రష్యా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా, కనిమొళి నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ అవ్వడానికి అనుమతి లేకుండా చాలా నిమిషాల పాటు మాస్కో గగనతలంలోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఈ అనూహ్య పరిణామంతో బృందంలో కొంత ఆందోళన కలిగింది. చాలా సేపటి తర్వాత సురక్షితంగా భూమిపై దిగారు. చివరికి, భద్రతా పరిస్థితులు అదుపులోకి రావడంతో మాస్కో విమానాశ్రయానికి 'గ్రీన్ సిగ్నల్' లభించింది. దీంతో భారత ప్రతినిధి బృందం ప్రయాణిస్తున్న విమానం సురక్షితంగా మాస్కోలో ల్యాండ్ అయింది.

విమానం ల్యాండ్ అయిన తర్వాత, భారత ప్రతినిధి బృందానికి మాస్కోలో భారత రాయబారి వినయ్ కుమార్ స్వాగతం పలికారు. రష్యా ప్రభుత్వానికి, అక్కడి సీనియర్ పార్లమెంటు సభ్యులకు, అధికారులకు, నిపుణులకు పాకిస్తాన్‌లో తిష్టవేసిన ఉగ్రవాదుల గురించి, వారు ప్రపంచానికి ఎలా ప్రమాదకరంగా మారుతున్నారో వివరించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకోవాలి. ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడినప్పుడు పుతిన్, "ఏ ఇతర దేశం నుండి ప్రభుత్వ ప్రతినిధి బృందాలు రష్యాకు రావాలని చూసినప్పుడు, ఉక్రెయిన్ మాస్కోపై డ్రోన్ దాడులు చేస్తుంది" అని అన్నారు. ఈ భయం కారణంగా రష్యాకు రావడం మానేస్తారు అని పుతిన్ అభిప్రాయపడ్డారు. భారత బృందం రాక సమయంలోనే డ్రోన్ దాడి జరగడం, పుతిన్ వ్యాఖ్యలకు బలం చేకూర్చింది.