Begin typing your search above and press return to search.

పాక్ కి భారత్ చేసినట్లే చైనా భారత్ కి ?

ఇక భారత్ తో చైనా సంబంధాలు గురించి అందరికీ తెలిసిందే. నోటితో కూడా నవ్వకుండా నొసటితో వెక్కిరించే తీరుని చైనా కనబరుస్తుంది అని అంటారు.

By:  Tupaki Desk   |   26 April 2025 7:00 AM IST
పాక్ కి భారత్ చేసినట్లే చైనా భారత్ కి ?
X

డ్రాగన్ చైనా సంగతి అందరికీ తెలిసిందే. పూర్తిగా తన దేశం కోసమే ఆలోచిస్తుంది. విస్తరించుకుంటూ పోవడమే అజెండాగా పెట్టుకుంటుంది ఈ విషయంలో బోర్డర్లు హద్దులు పద్దులూ వాదనలు బేఖాతర్ చేస్తుంది. ఏ రూల్ అయినా తనకు అనుకూలంగా ఉండాల్సిందే అని భావిస్తుంది. ఇక భారత్ తో చైనా సంబంధాలు గురించి అందరికీ తెలిసిందే. నోటితో కూడా నవ్వకుండా నొసటితో వెక్కిరించే తీరుని చైనా కనబరుస్తుంది అని అంటారు.

భారత్ దక్షిణాసియాలో చైనాకు పోటీగా ఎదగరాదు అన్నదే పట్టుదలగా చెబుతారు. దాని కోసం చిన్నా చితకా దేశాలకు మద్దతు ఇస్తూ వాటిని మచ్చిక చేసుకుంటూ భారత్ ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చైనా చేస్తుంది అన్న ప్రచారమూ ఉంది. ఇక చైనాకు పాకిస్తాన్ దోస్తీనా కాదా అంటే అవసరాల కోసం పాక్ ని దువ్వుతుంది అని చెబుతారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కొంత భాగం చైనాకు పాక్ రాసివ్వడం వెనక ఏ దోస్తీ ఉందో కూడా అందరికీ తెలిసిందే.

ఇంకో వైపు చూస్తే కనుక పాకిస్థాన్ భారత్ ల మధ్య యుద్ధం వస్తే కనుక చైనా ఎవరి వైపు ఉంటుంది అన్నది అంతర్జాతీయ పరిణామాల మీద అవగాహన ఉన్న వారికి ఎరుకే అని అంటారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు భారత్ పాకిస్థాన్ కి ఉచ్చు బిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సింధు నదిని బంద్ చేయడం ద్వారా ఆటకట్టించాలని చూస్తోంది.

భారత్ మీద ఉగ్రవాదాన్ని ఉసిగొల్పడంలో పాక్ అనుసరిస్తున్న వైఖరిని సొంత దేశం జనాలే తిరస్కరించాలని భారత్ వ్యూహంగా ఉంది. సరే ఇదంతా బాగానే ఉన్నా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నా ఇది కనుక ఒక వ్యూహంగా మరితే భారత్ కి పొరుగున ఉన్న ఎగువన ఉన్న దేశాల నుంచి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అని అంటున్నారు.

ఉదాహరణకు బ్రహ్మపుత్ర నది ఉంది. అది చైనా నుంచి ఇండియాకు ప్రవహిస్తోంది. ఈ నది విషయంలో ఎలాంటి ఒప్పందాలు రెండు దేశాల మధ్యన లేవు. ఇక భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలకు నీటి వనరుగా సాగు నీటి సదుపాయాలుగా బ్రహ్మపుత్ర ఉంది ఆ నది మీదనే ప్రపంచంలో అత్యంత ఎత్తు అయిన ఆనకట్టను చైనా నిర్మిస్తోంది.

అదే సమయంలో భారత్ అభ్యంతరాలను కూడా పట్టించుకోవడం లేదు. మరి పాక్ మీద నీటి ఖడ్గం భారత్ ప్రయోగిస్తే తన దోసీ విషయంలో చైనా బ్రహ్మ పుత్ర అస్త్రం ప్రయోగించినా విడ్డూరం ఏమీ ఉండదని అంటున్నారు.

బ్రహ్మపుత్ర నది మీద హక్కులు అన్నీ మావే అని చైనా కనుక అడ్డుకట్ట వేస్తే కనుక భారత్ లోని కీలక ప్రాంతాలూ ఇబ్బంది పాలు అవుతాయని అంటున్నారు. ఉగ్ర వాదుల పీచమణచేందుకు దౌత్య నీతితో సహా అనేక అంశాలను వాడుకోవచ్చు కానీ మరీ నదుల మీద ఆంక్షలు పెట్టడం వల్ల కొత్త ఇబ్బందులు వస్తాయేమో అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో ఎరగని వారికి ఎత్తులు మప్పే విధంగా చేసినట్లు అవుతుందేమో అని కూడా అంటున్నారు.