ఇంతకీ కిమ్ ఎటు.. పాక్‌కు దూరమవుతున్నారా ? భారత్‌కు చేరువవుతున్నారా?
భారత్, ఉత్తర కొరియా సంబంధాలు సాధారణంగా ఫ్రెండ్లీగానే కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు ఒకరికొకరు సహకరించుకుంటూనే ఉన్నారు.
By: Tupaki Desk | 3 May 2025 8:00 AM ISTఇటీవల జరిగిన పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రెండు దేశాలు ప్రత్యక్షంగా యుద్ధం ప్రకటించకపోయినా, పరిస్థితులు మాత్రం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పాకిస్తాన్ నిత్యం భారత్ ను బెదిరిస్తూనే ఉంది. మా దగ్గర 200అణుబాంబులు ఉన్నాయని అణు దాడి చేస్తామని ఒకసారి అంటే, మరోసారి ఇంకేదో మాట్లాడుతోంది. ఇక పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాక్ పై కఠిన చర్యలు తీసుకుంది. ఇది శత్రుదేశానికి ఏమాత్రం నచ్చడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం గనుక వస్తే ఏ దేశాలు భారత్‌కు మద్దతు ఇస్తాయి? ఏవి పాకిస్తాన్‌తో నిలుస్తాయి? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదలుతోంది.
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ ప్రపంచంలో ఉగ్రదాడులు చేయిస్తే ముస్లిం దేశాలు తమకు మద్దతు ఇస్తాయని పాకిస్తాన్ భ్రమపడుతుంది. కానీ ఇది పాకిస్తాన్ అతి పెద్ద అపోహ. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్‌కు తీవ్ర అవమానం జరిగింది. ఇక ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఎవరి పక్షం వహిస్తాడో తెలుసుకుందాం.
భారత్, ఉత్తర కొరియా సంబంధాలు సాధారణంగా ఫ్రెండ్లీగానే కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు ఒకరికొకరు సహకరించుకుంటూనే ఉన్నారు. అయితే ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమం, మానవ హక్కుల ఉల్లంఘనల గురించి భారత్ అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ, ఇరు దేశాలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో, అంతర్జాతీయ సంస్థల్లో సహకారం అందించుకుంటూనే ఉన్నాయి. భారత్ ఉత్తర కొరియాకు మానవతా సహాయం కూడా అందించింది. COVID-19 మహమ్మారి సమయంలో కూడా భారత్ ఉత్తర కొరియాకు సహాయం చేసింది. ఇరు దేశాలు ఐక్యరాజ్యసమితి , ఇతర అంతర్జాతీయ సంస్థల్లో ఒకరికొకరు మద్దతు ఇస్తూ వస్తున్నాయి.
పాకిస్తాన్‌తో ఉత్తర కొరియా సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.పాకిస్తాన్, ఉత్తర కొరియా సైనిక, అణ్వాయుధ సహకారాన్ని పంచుకున్నాయి. ఈ సహకారం 1970లలో ప్రారంభమై 1990ల వరకు కొనసాగింది. ముఖ్యంగా అణు, క్షిపణి సాంకేతికతను ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. ఉత్తర కొరియా, పాకిస్తాన్‌ల సంబంధాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, పరిస్థితులను బట్టి చూస్తే ఉత్తర కొరియా పాకిస్తాన్‌కు కాకుండా భారత్‌కు మద్దతు ఇచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.
