పాక్ పౌరులకు జారీ చేసిన 3 వీసాలు మినహా మిగిలినవి రద్దు!
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో.. దీనికి మూలాలు దాయాది పాకిస్థాన్ తో ఉన్నట్లుగా స్పష్టమైన ఆధారాలు లభిస్తున్నవ వేళలో.. ఆ దేశంతో ఉన్న సంబంధాలు తెంచుకునేందుకు భారత్ సిద్ధమైంది.
By: Tupaki Desk | 26 April 2025 10:10 AM ISTపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో.. దీనికి మూలాలు దాయాది పాకిస్థాన్ తో ఉన్నట్లుగా స్పష్టమైన ఆధారాలు లభిస్తున్నవ వేళలో.. ఆ దేశంతో ఉన్న సంబంధాలు తెంచుకునేందుకు భారత్ సిద్ధమైంది. అంతేకాదు.. ఉగ్రదాడికి పాల్పడిన వారికి అండగా నిలుస్తున్న పాక్ కు దిమ్మ తిరిగే షాకులు ఇచ్చే ప్రక్రియను భారత సర్కారు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పాకిస్థాన్ జాతీయులకు ఇచ్చిన 14 రకాలు కేటగిరీల వీసాల్ని రద్దు చేసినట్లుగా కేంద్ర హోంశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే.. పాక్ జాతీయులకు జారీ చేసే వీసాల్ని రద్దు చేసినప్పటికి.. మూడు కేటగిరీల వీసాలను మాత్రం రద్దు చేయలేదు. దీంతో.. ఈ మూడు వీసా విభాగాలకు చెందిన వారు మాత్రం భారత్ లో ఉండొచ్చు. ఇంతకూ ఈ మూడు కేటగిరీలు ఏమంటే.. దీర్ఘకాలిక వీసా.. దౌత్య వీసా.. అధికారిక వీసాలు ఉన్న వారికి మాత్రం మినహాయింపులు ఇచ్చారు.
సార్క్ వీసాలు ఉన్న వారంతా ఈ రోజు(శనివారం)తో పాకిస్థాన్ కు తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇందులో బిజినెస్.. ఫిలిం.. జర్నలిస్టు.. ట్రాన్సిట్.. విద్యార్థి.. గ్రూపు టూరిస్టు లాంటి వీసాలు పొందిన వారంతా భారత్ ను విడిచి పెట్టి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అంతేకాదు పాకిస్థాన్ లోని మైనార్టీలకు జారీ చేసిన గ్రూపు టూరిస్టు వీసాల్ని సైతం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ వీసాలపై భారత్ కు వచ్చిన వారు మాత్రం ఈనెల 29న తిరిగి వారి దేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి నిఘా వర్గాలు ఇప్పటికే దేశంలో ఉన్న పాకిస్థానీయులకు సంబంధించిన వివరాల్ని సేకరిస్తున్నారు.
