Begin typing your search above and press return to search.

తుర్కియే ముప్పేట దాడి.. అన్ని రంగాల్లో దెబ్బ కొడుతున్న భారత్

తాజాగా లఖ్‌నవూలోని ఆభరణాల వ్యాపారులు తుర్కియే డిజైన్ల జ్యువెలరీ దిగుమతి, అమ్మకం, ప్రదర్శనను బహిష్కరించాలని నిర్ణయించారు.

By:  Tupaki Desk   |   17 May 2025 2:00 AM IST
తుర్కియే ముప్పేట దాడి.. అన్ని రంగాల్లో దెబ్బ కొడుతున్న భారత్
X

భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిన తుర్కియేకు భారత్ నుండి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 'బాయ్‌కాట్‌ తుర్కియే' నినాదంతో పలు భారతీయ సంస్థలు , వ్యాపారులు ఆ దేశంతో సంబంధాలను తెంచుకోవడానికి నిర్ణయించుకుంటున్నారు. ఈ ప్రభావం వాణిజ్యం, విద్య, పర్యాటకం వంటి వివిధ రంగాలపై పడుతోంది.

జ్యువెలరీ రంగంలో బహిష్కరణ:

తాజాగా లఖ్‌నవూలోని ఆభరణాల వ్యాపారులు తుర్కియే డిజైన్ల జ్యువెలరీ దిగుమతి, అమ్మకం, ప్రదర్శనను బహిష్కరించాలని నిర్ణయించారు. అక్షయ తృతీయ వంటి పర్వదినాలలో గణనీయమైన అమ్మకాలు సాధించే తుర్కియే ఆభరణాలు ఇప్పుడు బహిష్కరణకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. లఖ్‌నవూలోని చౌక్ సరాఫా అసోసియేషన్ , మహానగర్ సరాఫా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ సమయంలో తుర్కియే వ్యవహరించిన తీరుతో తమ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో రోజువారీ అమ్మకాల్లో 25% వాటా కలిగిన తుర్కియే డిజైన్లను ఇప్పుడు పూర్తిగా నిలిపివేశామని, ఆర్డర్లను సైతం రద్దు చేసుకున్నామని వారు వెల్లడించారు.

వ్యాపార లావాదేవీలు నిలిపివేయాలని జీజేసీ పిలుపు:

భారత రత్నాభరణాల దేశీయ మండలి (జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ - జీజేసీ) తుర్కియే , అజర్‌బైజాన్‌లతో అన్ని వ్యాపార లావాదేవీలను నిలిపివేయాలని దేశీయ వ్యాపారులకు పిలుపునిచ్చింది. వాణిజ్యం కంటే దేశానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పరిశ్రమ ఐక్యతను చాటాలని జీజేసీ ఛైర్మన్ రాజేశ్ రోకడే కోరారు.

విద్యా రంగంలో ఎంవోయూల రద్దు:

విద్యా రంగంలోనూ తుర్కియేకు షాక్ తగిలింది. దిల్లీలోని జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియా, హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ఇప్పటికే తుర్కియే విశ్వవిద్యాలయాలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోగా, తాజాగా ఐఐటీ రూర్కీ , కాన్పూర్ విశ్వవిద్యాలయం కూడా ఇదే బాటలో పయనిస్తూ ఎంవోయూలను రద్దు చేసుకున్నాయి.

పర్యాటకంపై ప్రభావం:

తుర్కియే , అజర్‌బైజాన్ దేశాల పర్యాటక రంగంపైనా 'బాయ్‌కాట్‌ తుర్కియే' ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్ నుంచి వెళ్లే పర్యాటకులు, డెస్టినేషన్ వెడ్డింగ్‌లు, భారతీయ సినిమా షూటింగ్‌లు తగ్గే అవకాశం ఉందని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా తుర్కియే వస్తువులు, పర్యాటకాన్ని బహిష్కరించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే పలు ట్రావెల్ ఏజెన్సీలు తుర్కియేకు ఆన్‌లైన్ బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

యాపిల్ దిగుమతులపై రైతుల నిరసన:

తుర్కియే వైఖరి పట్ల యాపిల్ రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుర్కియే నుంచి యాపిల్స్ దిగుమతిని పూర్తిగా నిషేధించాలని లేదా 100% సుంకాలు విధించాలని హిమాచల్ ప్రదేశ్ రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హిమాలయ ప్రాంత యాపిల్ పెంపకం దారుల సొసైటీ, సంయుక్త్ కిసాన్ మంచ్ , ఇతర రైతు సంఘాలు ప్రధాని మోదీకి లేఖ రాశాయి.

సెలెబీ షేర్ల పతనం, సంస్థ వివరణ:

తుర్కియేకు చెందిన సెలెబీ సంస్థకు భారత్ ఇచ్చిన షాక్ గట్టిగానే తగిలింది. భారతీయ విమానాశ్రయాలలో సరకుల రవాణాతోపాటు పలు సేవలను అందించే సెలెబీ షేరు ధర ఇస్తాంబుల్‌లో మే 16న ఏకంగా 10% పతనమైంది. గత నాలుగు సెషన్లలో ఈ షేరు విలువ 30% ఆవిరైంది. ఆపరేషన్ సిందూర్‌కు తుర్కియే మద్దతు ప్రకటించడంతో భారత ప్రభుత్వం సెలెబీకి ఉన్న సెక్యూరిటీ క్లియరెన్స్‌లను రద్దు చేసింది. అదానీ ఎయిర్‌పోర్ట్స్ సంస్థ కూడా సెలెబీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ముంబై , అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌ల నుంచి సెలెబీ బయటకు వెళ్లాల్సి వచ్చింది. దిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ కూడా తన ఒప్పందాన్ని రద్దు చేసుకొని ఏఐఎస్‌ఏటీఎస్, బర్డ్‌గ్రూప్‌లతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది.

అయితే, తమది తుర్కియే కంపెనీ కాదని, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ కుటుంబంతో తమకు సంబంధం లేదని, ఆయన కుమార్తె తమ కంపెనీని నియంత్రించడం లేదని సెలెబీ తాజాగా వివరణ ఇచ్చింది. తమ యాజమాన్య హక్కులన్నీ సెలెబీయోగ్లు కుటుంబానికే పరిమితమని, వారికి రాజకీయ సంబంధాలు లేవని కంపెనీ తమ ప్రకటనలో పేర్కొంది.

తుర్కియేకు ప్రత్యామ్నాయంగా సందర్శించగల దేశాలు:

'బాయ్‌కాట్‌ తుర్కియే' నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే బదులు పొరుగునే ఉన్న లేదా ఇతర ఆసియా దేశాలను సందర్శించవచ్చు. వాటిలో కొన్నిచూస్తే.. శ్రీలంక,వియత్నాం,థాయ్‌లాండ్ , దుబాయ్, నేపాల్,భూటాన్,బాలి (ఇండోనేషియా), మలేషియాలను తుర్కియేకు ప్రత్యామ్మాయంగా భారతీయులు సందర్శించాలని పిలుపునిస్తున్నారు.

ఈ పరిణామాలు భారత్ వర్సెస్ తుర్కియే మధ్య సంబంధాలలో నెలకొన్న ఉద్రిక్తతలను స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఈ పరిస్థితి ఎలా మారుతుందో వేచి చూడాలి.