Begin typing your search above and press return to search.

పహల్గామ్ దాడికి ఎదురు దెబ్బ..భారత్ చర్యతో పాకిస్తాన్‎లో రోగులు విలవిల

సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన తర్వాత, పాకిస్తాన్ కూడా గురువారం నాడు న్యూఢిల్లీతో అన్ని వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది.

By:  Tupaki Desk   |   27 April 2025 3:00 PM IST
పహల్గామ్ దాడికి ఎదురు దెబ్బ..భారత్ చర్యతో పాకిస్తాన్‎లో రోగులు విలవిల
X

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న చర్యలతో పాక్ కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. భారత ప్రభుత్వం పాకిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలను నిలిపివేయడంతో మందుల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం ఉండడంతో సరఫరాను భద్రపరచడానికి పాక్ అత్యవసర చర్యలు ప్రారంభించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. భారత్ నుండి దిగుమతి చేసుకునే మందులు, ముడిసరుకుల సరఫరా నిలిచిపోవడంతో పాకిస్తాన్‌లో ఔషధ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది.

సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన తర్వాత, పాకిస్తాన్ కూడా గురువారం నాడు న్యూఢిల్లీతో అన్ని వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. దీని ఫలితంగా అవసరమైన ప్రాణాలను కాపాడే మందుల సరఫరా నిలిచిపోయింది. పరిస్థితి తీవ్రతను గ్రహించిన పాకిస్తాన్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ (DRAP) అత్యవసర చర్యలను ప్రారంభించింది.

పాకిస్తాన్‌లో మందుల కొరత

ఔషధ రంగంపై నిషేధం గురించి ఇంకా ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ జారీ చేయనప్పటికీ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉండడంతో చైనా, రష్యా, అనేక యూరోపియన్ దేశాల నుండి ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను అన్వేషిస్తున్నట్లు పాకిస్తాన్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ (DRAP) తెలిపింది. ఏజెన్సీ ప్రత్యేకంగా యాంటీ-రేబీస్ వ్యాక్సిన్, యాంటీ-స్నేక్ వెనమ్, క్యాన్సర్ థెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వంటి మందుల దిగుమతులను తీసుకురావడంపై దృష్టి సారించింది. DRAP సన్నాహాలు కొంతవరకు భరోసా కలిగిస్తున్నప్పటికీ, తక్షణమే చర్యలు తీసుకోకపోతే పాకిస్తాన్ తీవ్రమైన ఔషధ సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వానికి PPMA విజ్ఞప్తి

ఇదిలా ఉండగా, పాకిస్తాన్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (PPMA) ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌లో ప్రభుత్వ అధికారులను కలిసి ఔషధ రంగానికి వాణిజ్య నిషేధాల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరింది. అనేక ప్రాణాలను కాపాడే మందులకు అవసరమైన ముడిసరుకు కేవలం భారత్ నుండి మాత్రమే లభిస్తుందని DRAP, వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులతో జరిగిన సమావేశాలలో వారు నొక్కి చెప్పారని PPMA అధ్యక్షుడు తౌకీర్-ఉల్-హక్ తెలిపారు. రోగుల ప్రాణాలను కాపాడటానికి ఆరోగ్య రంగాన్ని నిషేధం నుండి మినహాయించాలని ప్రతినిధి బృందం ప్రత్యేక పెట్టుబడి సౌకర్యాల మండలి (SIFC)కి కూడా విజ్ఞప్తి చేసింది.