పాక్ కోసం పాన్ వరల్డ్ యాక్షన్ సినిమా రెడీ ?
దాయాది పాకిస్థాన్ తెలివే తెలివి. ఒక వైపు ఆర్మీ చీఫ్ మునీర్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తారు. మరో వైపు పాక్ మూలాలు ఉన్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ఉగ్ర దాడిని విచక్షణారహితంగా చేస్తుంది.
By: Tupaki Desk | 24 April 2025 9:26 AM ISTదాయాది పాకిస్థాన్ తెలివే తెలివి. ఒక వైపు ఆర్మీ చీఫ్ మునీర్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తారు. మరో వైపు పాక్ మూలాలు ఉన్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ఉగ్ర దాడిని విచక్షణారహితంగా చేస్తుంది. ఆ వెంటనే ఆ దేశ రక్షణ మంత్రి మాకేమి తెలియదు, మేమేమి పాపం ఎరగమని ప్రకటిస్తారు.
మరి ఏమీ ఎరగని పాక్ ఇంకో వైపు చూస్తే సరిహద్దులలో తన బలగాలను సంపత్తిని మోహరిస్తూ కవ్వింపు చర్యలకు దిగుతుంది. ఇలా ఆకుకు అందకుండా పోకకు పొందకుండా ఉండే పాక్ తీరు అందరికీ తెలుసు. ఈ రోజున భారత్ లో ఉగ్ర దాడి వెనక ఎవరు ఉన్నారు అన్నది అంతర్జాతీయ సమాజానికి ఇంకా బాగా తెలుసు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడితో దేశమంతా షాక్ తిన్నది. సరైన గుణపాఠం పాక్ కి చెప్పమని కోట్లాది ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు. అయితే దేశం మూడ్ ని గమనించిన కేంద్రం కూడా ఆ దిశగా చర్యలకు దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
దీనిని సంబంధించి ఒక హింట్ అయితే దేశ రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఇచ్చారు. ఆయన త్రివిధ దళాలతో నిర్వహించిన కీలక సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ ఈ తరహా దాడులకు భయపడదు అన్నారు. ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు.
భారత్ ప్రతిచర్య ఎలా ఉంటుందో ఆయన స్పష్టంగా చెప్పారు. ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేలా భారత్ చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు ఉగ్రవాదుల కూసాలు కదిలిపోయేలా వారికి మద్దతు ఇస్తున్న వారు సైతం వణికేలా చర్యలు ఉంటాయని ఆయన అంటున్నారు. ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే చర్యలు అంటే ఏమిటి అన్న చర్చ సాగుతోంది.
దానికి భారత్ ముందున్న మార్గాలు ఏమిటి అని కూడా అంతా ఆలోచిస్తున్నారు. అయితే భారత్ పీఓకే మీద దాడి చేసి స్వాధీనం చేసుకుంటే ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది. అలాగే పాక్ మీద సర్జికల్ స్ట్రైక్స్ జరిపి ఆ దేశంలోకి చొచ్చుకుని వెళ్ళి మరీ ఉగ్ర తండాలను సర్వ నాశనం చేసినా ప్రపంచం అంతా కళ్ళు విప్పార్చి చూస్తుంది.
వీటితో పాటుగా పాక్ కి ఏమేమి చేయాలో అన్నీ చేసి కీలెరిగి వాత పెట్టినా అంతర్జాతీయ సమాజం భారత్ తెగువను అలా సంభ్రమాశ్చర్యం తో చూస్తుంది. మరి భారత్ ఏ మార్గం ఎంచుకుంటుంది అన్నది ఒక చర్చగానే ఉంది. అయితే రక్షణ మంత్రి మాత్రం ఇప్పటిదాకా లేనిది ఎవరూ చూడనిది అంటున్నారు. అంటే పాక్ కోసం పాన్ వరల్డ్ యాక్షన్ మూవీనే రెడీ చేసి ఉంచారా అన్నదే అంతా చర్చిస్తున్నారు.
ఇంకో వైపు చూస్తే కనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా శ్రీనగర్ లో ఇదే రకమైన ప్రకటన చేశారు. ఆయన సైతం భారత్ ఎవరికీ తలొగ్గదని తాను ఏమి చేయాలో అది చేస్తుందని ఉగ్రవాదానికి పదునైన జవాబు చెబుతామని గర్జించారు. ఇలా కీలక మంత్రులు ఇద్దరు ఈ విధంగా ప్రకటనలు చేయడంతో కేంద్రం ఏమి చేయబోతోంది అన్నది సర్వత్రా ఆసక్తిగా ఉంది.
పైగా ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు కేంద్ర జాతీయ భద్రతకు సంబంధించి కేబినెట్ కమిటీలో కీలక సభ్యులు. దాంతో కేంద్రం తీసుకోబోయే చర్యలు చూచాయగా అయినా ఇలా వెల్లడించారా అని అంతా అనుకుంటున్నారు. ఈ ప్రకటనల మేరకు పాన్ ఇండియా మూవీ చూపిస్తే కనుక పాక్ కి చరిత్ర లో ఎరగని గుణపాఠమే జరుగుతుందని అంతా అంటున్నారు.
