పాకిస్తాన్ పై దాడికి భారత్ రె’ఢీ‘
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ ప్రభావాలను చూపుతున్నాయి.
By: A.N.Kumar | 4 April 2026 11:09 PM ISTపశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ ప్రభావాలను చూపుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఆర్థికంగా బలహీనంగా ఉన్న పాకిస్థాన్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. పెట్రోల్ ధరలు, ద్రవ్యోల్బణం, విదేశీ నిల్వల కొరత వంటి సమస్యలు పాకిస్థాన్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో భారత్ వ్యూహాత్మకంగా తదుపరి అడుగులు వేస్తుందా అనే చర్చలు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ వేదికలపై ఊపందుకున్నాయి.
పాకిస్థాన్‌పై ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. పలుమార్లు భారత్‌లో జరిగిన ఉగ్రదాడులకు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలే కారణమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్‌లను ఉదాహరణగా చూపుతూ మళ్లీ అలాంటి ఆపరేషన్‌కు భారత్ సిద్ధమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో వరుస భేటీలు నిర్వహించడం, భద్రతా పరిస్థితులపై సమీక్షలు జరపడం విశేషంగా మారింది. సరిహద్దు పరిస్థితులు, ఉగ్రవాద కార్యకలాపాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఇదే సమయంలో పాకిస్థాన్‌కు కఠిన హెచ్చరికలు జారీ చేయడం కూడా ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.
ఇంకా దేశంలోని సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించడం.. అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అధికారుల సూచనలు ఇవ్వడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు ముందస్తుగా మూడు నెలల రేషన్ సరఫరా చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇది యుద్ధ పరిస్థితులు తలెత్తినా ప్రజలు ఇబ్బంది పడకూడదనే చర్యగా భావిస్తున్నప్పటికీ దీనివల్ల ప్రజల్లో అనుమానాలు మరింత పెరిగాయి.
అయితే అధికారికంగా భారత్ యుద్ధానికి సిద్ధమవుతోందని ఎలాంటి ప్రకటన లేదు. కానీ భద్రతా దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం సహజమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు పాకిస్థాన్‌లోని అంతర్గత సంక్షోభం, మరోవైపు సరిహద్దు భద్రతా పరిస్థితులు కలిసి పరిస్థితిని సున్నితంగా మార్చాయి.
మొత్తంగా చూస్తే ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ యుద్ధం తప్పనిసరి అన్న సంకేతాలు స్పష్టంగా కనిపించడం లేదు. అయితే భారత్ తన భద్రత విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే భావన మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
