Begin typing your search above and press return to search.

భారత్ ఎగుమతులు ఆపితే.. పాకిస్థాన్ పాటలు ఆపేసింది!

ఈ క్రమంలో ఇప్పటికే దౌత్యపరంగా పాకిస్థాన్ ఊహించని రీతిలో భారత్ రియాక్ట్ అవుతూ దెబ్బమీద దెబ్బ కొడుతుంది.

By:  Tupaki Desk   |   2 May 2025 9:53 AM IST
Pakistan Ban India Radio FM
X

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని అంటున్నారు. ఉగ్రదాడి అనంతరం పాక్ కు భారత్ వరుస షాకులిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే దౌత్యపరంగా పాకిస్థాన్ ఊహించని రీతిలో భారత్ రియాక్ట్ అవుతూ దెబ్బమీద దెబ్బ కొడుతుంది.

ఈ క్రమంలో వీసాలు రద్దు చేయడం, సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం వంటి పలు దౌత్యపరమైన చర్యలు తీసుకుంది భారత్. ఇదే సమయంలో పాకిస్థాన్ తో వాణిజ్యాన్ని ఆపేసింది. ఇందులో భాగంగా... పాక్ కు పెద్ద ఎత్తున ఎగుమతి చేసే పండ్లు, కూరగాయలు, కోళ్ల దాణా, డ్రైఫ్రూట్స్ ఎగుమతులను ఆపేసింది.

ఇదే సమయంలో... ఫార్మా ఉత్పత్తుల ఎగుమతిని ఆపే ఆలోచనలో ఉందని అంటున్నారు. మారోపక్క తాజాగా టమాటా రైతులు సీరియస్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ కు టమాటాలను ఎగుమతి చేయకూడదని కర్ణాటకలోని స్థానిక రైతులు, వ్యాపారులు తీర్మానించారు.

వాస్తవానికి కర్ణాటకలోని కోలారు టమాటా విపణి నుంచి పాకిస్థాన్ కు నిత్యం సుమారు 900 టన్నుల సరుకు ఎగుమతి చేస్తుంటారు. ప్రధానంగా.. మే, జూన్ నెలల్లో ఈ ఎగుమతులు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే పాక్ లో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు సామాన్యునికి అందని ద్రాక్షగా మారాయని అంటున్న వేళ.. ఈ తాజా నిర్ణయం వారికి మరో షాక్ అనే చెప్పాలి.

ప్రస్తుతం వెలువడుతున్న నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ లో బియ్యం, కూరగాయలు, పిండి, చికెన్, పండ్లు వంటి ప్రాథమిక ఆహార పదార్థాల ధరలు బాగా పెరిగగా.. బియ్యం ధర కిలో రూ.340కి, చికెన్ ధర కిలోకు రూ.800కి పెరిగిందని మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇకపై కాయగూరల ధరలు పీక్స్ కి చేరనున్నాయని అంటున్నారు.

పహల్గాం ఉగ్రదాడికి ముందు.. ఈ ఏడాది పాకిస్థాన్ లో సుమారు 10 మిలియన్లకు పైగా ప్రజలు తీవ్ర ఆహార అభద్రత ఎదుర్కొంటారని, ఆకలి సమస్యను ఎదుర్కొంటారని ఇటీవల ప్రపంచ బ్యాంకు నివేదిక వెళ్లడించింది. అయితే.. ఆ ఉగ్రదాడి అనంతరం పాక్ కు భారత్ ఎగుమతులు నిలిపివేయడంతో ఆ 10 మిలియన్ల సంఖ్య ఎంత పెరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది.

పాకిస్థాన్ పాటలు ఆపేసింది!:

మరోపక్క పాకిస్థాన్ కూడా భారత్ ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే గగనతలాన్ని మూసేసిన పాక్.. అంతకు మించి భారత్ ను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో లేదని అంటున్నారు! ఈ సమయంలో పాకిస్థాన్ ఎఫ్.ఎం రేడియో కేంద్రలు గురువారం నుంచి భారత్ పాటల ప్రసారాన్ని నిలిపేశాయి.

ఈ నిర్ణయం దేశవ్యాప్తంగ తక్షణం అమల్లోకి వచ్చిందని పాకిస్థాన్ ప్రసారకుల సంఘం తెలిపింది. వాస్తవానికి పాకిస్థాన్ లో మహ్మద్ రఫీ, లతా మంగేష్కర్, కిశోర్ కుమార్, ముకేష్ తదిరతుల పాటలకు మంచి ఆదరణ ఉంది. దీని వల్ల భారత్ కు ఎలాంటి నష్టం లేదు సరికదా.. పాక్ ఎఫ్.ఎం.లకు శ్రోతలు తగ్గడం తథ్యం అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.