భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కరాచీ తీరానికి తుర్కియే యుద్ధనౌక..
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి.
By: Tupaki Desk | 5 May 2025 9:29 AM ISTపహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. భారత్ పలు కీలక చర్యలు తీసుకుంటూ పాక్‌పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ భయాందోళనలకు గురవుతోంది. మద్దతు కోసం తన మిత్రదేశాలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నడుమ తుర్కియేకు చెందిన ఒక భారీ యుద్ధనౌక కరాచీ తీరానికి చేరుకోవడం గమనార్హం. మరోవైపు దేశీయంగా ఉద్రిక్తతలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశానికి ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ హాజరుకాబోమని ప్రకటించింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ దూకుడుగా వ్యవహరిస్తోంది. దేశంలో ఉన్న పాకిస్థాన్ జాతీయులను వెనక్కి పంపడం, సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసే అంశాన్ని పరిశీలించడం, పాక్ విమానాలకు భారత గగనతలం మూసివేయడం, పాక్ నుంచి దిగుమతులను స్తంభింపజేయడం వంటి కఠిన చర్యలతో భారత్, పాక్‌ను కట్టడి చేస్తోంది. దీంతో ఎప్పుడు, ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందోనని పాకిస్థాన్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ తన మిత్రదేశాలతో మద్దతు కోసం ప్రయత్నిస్తున్నట్లు భారత్ వద్ద సమాచారం ఉంది.
-కరాచీ తీరానికి తుర్కియే యుద్ధనౌక 'టీజీసీ బుయుకడా'
పాకిస్థాన్ ప్రయత్నాలకు బలం చేకూర్చేలా తాజాగా తుర్కియేకు చెందిన భారీ యుద్ధనౌక 'టీజీసీ బుయుకడా' కరాచీ తీరానికి చేరుకుంది. 2013లో జలప్రవేశం చేసిన ఈ నౌక, జలాంతర్గాములకు వ్యతిరేకంగా పోరాడటంలోనూ, గస్తీ నిర్వహణలోనూ సమర్థమైనదిగా పేరు పొందింది. పలు నౌకాదళ విన్యాసాల్లో కూడా ఇది పాల్గొంది. కాగా, ఇప్పటికే పాకిస్థాన్‌కు చెందిన నౌకలను భారత జలమార్గాల్లోకి భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. మరోవైపు, భారత ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాల ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తుండటంతో, భారత్ ఎప్పుడైనా ఎదురుదాడికి దిగవచ్చని పాకిస్థాన్ అప్రమత్తమైంది. ముఖ్యంగా సముద్ర మార్గం గుండా కూడా దాడి చేసే అవకాశం ఉందని భావించిన పాక్, తన మిత్రదేశమైన తుర్కియేను సంప్రదించి, సముద్ర తీరంలో గస్తీ నిర్వహణ కోసం ఈ నౌకను తెప్పించుకున్నట్లుగా సమాచారం.
-ఉన్నత స్థాయి సమావేశానికి పీటీఐ డుమ్మా
ఇదిలా ఉండగా భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాజా పరిణామాలను, భవిష్యత్ కార్యాచరణను చర్చించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఆర్మీ ఉన్నతాధికారులు, ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో ఆర్మీ అధికారులు వివిధ పార్టీల నాయకులకు పరిస్థితిని వివరించాలని భావించారు. అయితే ఈ సమావేశానికి తాము హాజరుకాబోమని ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన పీటీఐ, తమ పార్టీ చాలా కాలంగా ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తోందని, పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ కూడా పలు సందర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారని పేర్కొంది. ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌లో ఈ రాజకీయ పరిణామం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.
