ఏ క్షణమైనా మాపై భారత్ దాడి.. పాక్ రక్షణ మంత్రి
ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని సరిహద్దుల్లో పాక్ బలగాల మోహరింపును పెంచామని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లుగా మంత్రి తెలిపారు.
By: Tupaki Desk | 28 April 2025 10:24 PM ISTగత వారం కాశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ పరిణామాల మధ్య, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. భారత్ తమ దేశంపై ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. తాము అప్రమత్తంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
రాయిటర్స్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పాక్ రక్షణ మంత్రి ఈ విషయాన్ని అంగీకరించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయని, ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని సరిహద్దుల్లో పాక్ బలగాల మోహరింపును పెంచామని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లుగా మంత్రి తెలిపారు. ఇస్లామాబాద్‌లోని తన కార్యాలయంలో రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. "ఇప్పుడు మా బలగాలను బలోపేతం చేశాం. కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. ఆ నిర్ణయాలు తీసుకున్నాం. భారత్ దూకుడు పెరుగుతోందని, దాడి జరిగే అవకాశం ఉందని పాక్ సైన్యం ప్రభుత్వానికి వివరించింది" అని ఆసిఫ్ చెప్పారు.
పాకిస్థాన్ అత్యంత అప్రమత్తంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే తమ ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఏర్పడితేనే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని ఆయన పేర్కొన్నారు. భారత్ దాడి జరిగే అవకాశం గురించి పాకిస్థాన్ సైన్యం ప్రభుత్వానికి వివరించిందని, అయితే చొరబాటు తప్పదని ఎందుకు అనుకుంటున్నారో మరిన్ని వివరాలలోకి వెళ్ళలేదని తెలిపారు.
మరోవైపు, ఈ దాడి నేపథ్యంలో భారత్ పలు కీలక చర్యలు చేపట్టింది. ఉగ్రవాదుల కోసం భారీ గాలింపు చర్యలు చేపట్టింది. వారిలో ఇద్దరు పాకిస్థానీలుగా భారతదేశం గుర్తించింది. అయితే, పాకిస్థాన్ దీనిని తిరస్కరించి, తటస్థ దర్యాప్తుకు పిలుపునిచ్చింది. దాడి తర్వాత భారతదేశం పాకిస్థాన్‌తో దౌత్య సంబంధాలను తగ్గించుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది, ప్రధాన భూ సరిహద్దు క్రాసింగ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్ జాతీయులకు వీసాలను ఉపసంహరించుకుంది. రెచ్చగొట్టే కంటెంట్ ఉందనే కారణంతో డజనుకు పైగా పాకిస్థానీ యూట్యూబ్ ఛానెల్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది. పాక్ రక్షణ మంత్రి చేసిన ఈ ప్రకటన పాకిస్థాన్‌లో కలకలం రేపింది.
