పాక్ ను కన్ఫ్యూజ్ చేసి కొట్టే ప్లాన్... 'ఈడబ్ల్యూ'లను మొహరించిన భారత్!
ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి అనంతరం భారత్ – పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 May 2025 10:42 AMఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి అనంతరం భారత్ – పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారత్ ఇప్పటికే దౌత్యపరమైన షాకులు ఇచ్చింది. ఈ సమయంలో పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. ఈ నేపథ్యంలో.. పాక్ రవాణా, సైనిక, పౌర విమానాలకు భారత్ నోటీస్ ఎయిర్ మన్ జారీ చేసింది.
దీంతో... పాకిస్థాన్ విమానాలు చైనా, శ్రీలంక గగనతలాల మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో.. పాక్ ఎయిర్ లైన్స్ పై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతుందని అంటున్నారు. మరోపక్క పాకిస్థాన్ మిలటరీ విమానాల లక్ష్యాలను గుర్తించేందుకు వీలులేకుండా భారత్ ఈడబ్ల్యూ వ్యవస్థలను సరిహద్దుల్లో మొహరించింది. ఇది పాక్ కు బిగ్ స్ట్రోక్ అనే చెప్పాలి!
అవును... పాక్ మిలటరీ విమానాలు తమ లక్ష్యాలను గుర్తించేందుకు ఏమాత్రం వీలులేకుండా ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ (ఈడబ్ల్యూ) వ్యవస్థలను సరిహద్దుల్లో మొహరించింది భారత్. పాకిస్థాన్ వినియోగించే గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సిగ్నల్స్ ను ఈ వ్యవస్థ బలంగా అడ్డుకుంటుంది. దీంతో... భారత్ లో లక్ష్యాలను గుర్తించడంలో పాక్ తీవ్ర గందరగోళానికి గురవుతుంది.
సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ ఫేర్ స్టడీస్ 2024 లెక్కల ప్రకారం భారత్ వద్ద ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ వంటి వ్యవస్థలు సుమారు 50 వరకూ ఉండగా... పాక్ వద్ద సొంతంగా తయారు చేసుకొన్న ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ వ్యవస్థలు లేవు. అందువల్ల చైనా తయారుచేసిన ఈడబ్ల్యూ సిస్టం లను, కమర్షియల్ జామర్లను వాడుతోంది.
కాగా... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం తమపై 36 గంటల్లో దాడి చేయవచ్చని పాకిస్థాన్ బుధవారం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై తమవద్ద కచ్చితమైన నిఘా సమచారం ఉందని అంటోంది. మరోపక్క.. సమయం గడిచే కొద్దీ ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావారణం అధికమవుతోందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ తెలిపారు.
మరోపక్క పహల్గాం ఉగ్రదాడికి ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికే ఇచ్చినట్లు భారత ప్రధాని మోడీ తెలిపిన నేపథ్యంలో.. ఏక్షణంలో ఏమి జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.