Begin typing your search above and press return to search.

నక్క - నాగలోకం... భారత్ – పాక్ ల్లో ఎవరి బలమెంత?

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 May 2025 9:54 AM IST
నక్క - నాగలోకం... భారత్ – పాక్ ల్లో ఎవరి బలమెంత?
X

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ పహల్గాం ఉగ్రదాడికి ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికే ఇచ్చినట్లు భారత ప్రధాని మోడీ చెప్పారు. మరోపక్క భారత్ 36 గంటల్లో తమపై దాడి చెస్తుందనే సమాచారం తమకు ఉందని పాక్ మంత్రి చెబుతున్నారు.

ఇదే సమయంలో... ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధం జరగకుండా ఆపడం దేవుడి చేతుల్లో ఉందంటూ పాక్ రక్షణ మంత్రి చెప్పిన పరిస్థితి. మరోపక్క.. ఒక రోజు అటో ఇటో యుద్ధం జరిగే అవకాశాలను కొట్టి పారేయలేమని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం వ్యాఖ్యానించారు! ఈ సమయంలో ఇండియా - పాక్.. ఎవరి బలమెంత అనేది ఆసక్తిగా మారింది.

అవును... పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధాన్ని తలపిస్తున్న సంగతి తెలిసిందే! ఇప్పటికే సరిహద్దుల్లో వాతావరణం తీవ్రంగా వేడెక్కింది. సరిహద్దుల్లో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఆయుధాలతో మొహరిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో... భారత్ యుద్ధం మొదలుపెడితే పాక్ పరిస్థితి ఏమిటనే చర్చ తెరపైకి వచ్చింది.

ఇటు ఆర్ధికంగా చూసినా, జనాభా పరంగా, సైనిక శక్తి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలంపరంగా చూసినా... భారత్ కు పాకిస్థాన్ కు ఎక్కడా పొంతనలేని పరిస్థితి. పైగా ఇప్పుడు పాకిస్థాన్ కు చైనా, బంగ్లాదేశ్, టర్కీ మినహా మిగిలిన దేశాల నుంచి మద్దతు దక్కే అవకాశాలు ఆల్ మోస్ట్ లేవనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల బలాలు చూద్దామ్..!

గ్లోబల్ ఫైర్ పవర్ డేటాబేస్ ప్రకారం... భారత్ కు ఉన్న రెగ్యులర్ సైన్యం 14.6 లక్షలు కాగా, పాక్ సైన్యం 6.5 లక్షలుగా ఉంది. ఇక.. రిజర్వ్ బలగాల విషయానికొస్తే... భారత్ సంఖ్య 11.6 లక్షలు కాగా, పాకిస్థాన్ సంఖ్య 5.5 లక్షలు. పారా మిలటరీ బలగాల విషయానికొస్తే... భారత్ వద్ద వీరి సంఖ్య 25.3 లక్షలుగా ఉండగా.. పాక్ వద్ద వీరి సంఖ్య 5 లక్షలుగా ఉంది.

ఆర్మీ విషయానికొస్తే... భారత్ వద్ద యుద్ధ ట్యాంకులు 4,201 ఉండగా, పాకిస్థాన్ వద్ద 2,627 ఉన్నాయి. ఆర్టిలరీ వాహనాల విషయానికొస్తే.. భారత్ వద్ద అవి 3,975 ఉంటే.. పాక్ వద్ద 2,629 ఉన్నాయి. ఇక సాయుధ వాహనాలు భారత్ వద్ద 1,48,594 ఉండగా.. పాకిస్థాన్ 17,516 వాహనాలను కలిగి ఉంది.

ఎయిర్ ఫోర్స్ విషయానికొస్తే... భారత్ వద్ద 2,229 విమానాలు ఉండగా.. పాక్ వద్ద వీటి సంఖ్య 1,399గా ఉంది. ఇక ఫైటర్ జట్లు భారత్ వద్ద 513 ఉండగా.. పాక్ కి ఉన్న ఫైటర్ జట్ల సంఖ్య 328. ఇక.. హెలీకాప్టర్ల విషయానికొస్తే... భారత్ వద్ద 899 ఉండగా, పాక్ వద్ద 373 ఉన్నాయి. ఇక అటాక్ హెలీకాప్టర్లు భారత్ వద్ద 80 ఉండగా పాక్ వద్ద 57 ఉన్నాయి.

ఇక నేవీ విషయానికొస్తే... 239 యుద్ధ నౌకలను భారత్ కలిగి ఉంటే.. పాక్ వద్ద 121 యుద్ధ నౌకలున్నాయి. విమాన వాహన నౌకలు భారత్ వద్ద రెండు ఉండగా.. అలాంటివి పాక్ వద్ద ఏమీ లేవు! భారత్ 18 జలాంతర్గాములను కలిగి ఉండగా.. వాటి సంఖ్య పాక్ వద్ద 8 గా ఉంది. గస్తీ నౌకలు భారత్ వద్ద ఉన్నవి 135 కాగా.. పాక్ వద్ద ఉన్నవి 69!

ఇదే సమయంలో... జీడీపీ విషయానికొస్తే... భారత్ జీడీపీ 4.2 లక్షల కోట్ల డాలర్లు కాగా, పాక్ జీడీపీ 37,400 కోట్ల డాలర్లు. అదేవిధంగా రక్షణ బడ్జెట్ విషయానికొస్తే... భారత్ రక్షణ బడ్జెట్ అంచనా 7,700 కోట్ల డాలర్లు కాగా.. పాక్ రక్షణ బడ్జెట్ 760 కోట్ల డాలర్లు. ఇక జనాభా సంగతి చూస్తే... భారత్ జనాభా సుమారు 140 కోట్లు కాగా.. పాకిస్థాన్ జనాభా 30 కోట్లు!