సింధూ రూపంలో ఒక షాక్ భారత్ ఇస్తే.. మరొకటి పాక్ స్వయంకృతం!!
జమ్మూకశ్మీర్ లో పహల్గాం దాడి అనంతరం పాకిస్థాన్ కు భారత్ ఊహించని షాకులిచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 April 2025 4:16 PM ISTజమ్మూకశ్మీర్ లో పహల్గాం దాడి అనంతరం పాకిస్థాన్ కు భారత్ ఊహించని షాకులిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా సింధూ జలాల ఒప్పందన్ని సస్పెండ్ చేసింది. గతంలో ఎన్నోసార్లు పాక్ తో ఘర్షణలు జరిగినప్పటికీ ఈ ఒప్పందానికి కట్టుబడి ఉన్న భారత్ ఈ సారి మాత్రం ఉపేక్షించేది లెదన్నట్లుగా ఈ నిర్ణయం తీసుకొంది.
దీంతో.. ఈ దెబ్బ ఇచ్చిన షాక్ నుంచి పాక్ ఇంకా తేరుకున్నట్లు లేదు. భారత్ తాజా నిర్ణయంపై అటు నుంచి ఇంకా ఎటువంటి ప్రతిస్పందనా రాలేదు. మరోపక్క క్షిపణి ప్రయోగాలు చేస్తూ, సరిహద్దుల వైపు యుద్ధ విమానాలు మళ్లిస్తూ కాస్త హడావిడి చేస్తుంది. ఈ సమయంలో సింధూ జలాల విషయంలో భారత్ చర్యకు పాక్ ప్రతిచర్య కు ఛాన్స్ ఉందని అంటున్నారు.
అవును... సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేయడంతో పాకిస్థాన్ చీమ కుట్టిన దొంగలా మిన్నకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే.. భారత్ కు ఎఫెక్ట్ ఏమీ ఉండకపోయినప్పటికీ.. కనీసం ఆ దేశ ప్రజలు మాట్లాడుకోవడం కోసమైనా ఈ చర్యకు ప్రతిచర్య తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే సిమ్లా ఒప్పందం!
1971లో భారత్ - పాక్ యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. దీనిని బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం అని కూడా పిలుస్తారు. అంటే.. భారత్ – పాక్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ.. తూర్పు పాకిస్థాన్ కాస్తా బంగ్లాదేశ్ గా స్వాతంత్ర్యం పొందడానికి దారి తీసింది. ఇది 1971 డిసెంబర్ 3న మొదలై 1971 డిసెంబర్ 16న ముగిసింది.
ఈ యుద్ధం అనంతరం 1972 జూలై 2న భారత్ – పాక్ మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం నియంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చకూడదు.. సమస్యాత్మక అంశాలను ఉభయ దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. దీనిపై నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ.. పాక్ ప్రెసిడెంట్ జుల్ఫికర్ అలీ భుట్టొ సంతకాలు చేశారు.
దీనివల్ల ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారంలో మూడో దేశం, లేదా అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవడానికి వీలు లేదు! ఇది భారత్ కు ఓ కవచంలా ఉపయోగపడిందని అంటారు. అయితే.. ఇప్పుడు ఈ ఒప్పందనికి కట్టుబడకుండా పాక్.. సింధూ జలాల భారత్ చర్యకు ప్రతిచర్యగా తప్పుకోవాలనుకునే అవకాశం ఉందని అంటున్నారు.
అదే జరిగితే... ఇరు దేశాల మధ్య ఉన్న కశ్మీర్ సహా ఇతర వివాదాంశాల పరిష్కారంలో మూడో పక్షం జోక్యానికి అవకాశం కల్పించినట్లవుతుంది. ఇదే జరిగితే అది పాకిస్థాన్ కే నష్టం అని.. అది ఆదేశ సెల్ఫ్ గోల్ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకుగల కారణాలను వివరిస్తున్నారు.
ఇందులో భాగంగా... పాకిస్థాన్ సిమ్లా ఒప్పందం నుంచి తప్పుకుంటే.. అప్పుడిక ద్వైపాక్షిక ఒప్పందం అమల్లో ఉండదు. అప్పుడు ఏదైనా చర్చల ప్రతిపాదన వస్తే భారత్ తోసిపుచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. అందువల్ల... ఈ నిర్ణయం కూడా పాక్ కే సెల్ఫ్ గోల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు!
