Begin typing your search above and press return to search.

కొత్త వ్యూహం: దాయాదితో ఈసారి ఎలివేషన్ల యుద్ధం!

ప్రత్యర్థి.. శత్రువు ఒకటి కాదు. ప్రత్యర్థి విషయంలో కొన్ని పట్టువిడుపులకు పోయినా ప్రమాదం ఉండదు.

By:  Tupaki Desk   |   3 May 2025 9:33 PM IST
Isolating Pakistan With Precision and Patience
X

ప్రత్యర్థి.. శత్రువు ఒకటి కాదు. ప్రత్యర్థి విషయంలో కొన్ని పట్టువిడుపులకు పోయినా ప్రమాదం ఉండదు. కానీ.. శత్రువు విషయంలో మాత్రం అద్యంతం అప్రమత్తంగా ఉండాల్సిందే. జిత్తుల మారి నక్క తరహాలో వ్యవహరించే పాకిస్తాన్ ను దెబ్బ తీయాలంటే ఆయుధ సంపత్తి మాత్రమే కాదు.. అంతకు మించిన బుద్ధిబలం చాలా అవసరం. చరిత్రలో దాయాదితో జరిగిన యుద్ధాలు మొత్తం మనం విజయం సాధించటానికి కారణం బుద్ధిబలమే. దీనికి తోడు ఎప్పుడూ కూడా యుద్ధాన్ని మనం ఆరంభించలేదు. వారు ఏదో ఒక కుతంత్రానికి పాల్పడటం.. దానికి జవాబు చెప్పే క్రమంలో మాత్రమే యుద్ధంలోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి.

నాగరిక సమాజంలో.. అందునా సాంకేతికత అపారంగా పెరిగిపోయిన వేళ.. యుద్ధానికి కాలు దువ్వటానికి మించిన పొరపాటు ఇంకేం ఉండదు. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన యుద్ధాల్ని చూస్తే.. ఎక్కడా సంపూర్ణ విజయం కనిపించదు. రోజుల వ్యవధిలో మట్టి కరుస్తుందని భావించిన ఉక్రెయిన్ విషయంలో ఏం జరిగింది? యుద్దానికి కాలు దువ్విన రష్యా తాజా పరిస్థితి ఏమిటి? ఉక్రెయిన్ తో పోలిస్తే రష్యాది పైచేయిగా కనిపించొచ్చు. కానీ.. అందుకు చెల్లించిన మూల్యం ఎంత? అన్నది చూస్తే.. యుద్ధం ఒక దేశాన్ని ఎంతలా దెబ్బ తీస్తుందో అర్థమవుతుంది.

ఇలాంటి విషయాలు భారత్ కు తెలియక కాదు. ఇప్పుడిప్పుడు ఆర్థికంగా బలోపేతం అవుతున్న వేళ.. ఏ చిన్నపాటి పొరపాటు చోటు చేసుకున్నా.. అందుకు చెల్లించాల్సిన మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం భారత పాలకులకు తెలియంది కాదు. నిజానికి పాక్ తో భారత్ ముఖాముఖి తలపడితే.. ఆ దేశ పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో.. తాను నష్టపోయినా పాక్ అంతు చూడాలని ఫిక్స్ అయితే.. ప్రపంచ పటంలో పాక్ కనిపించకుండా పోయినా ఆశ్చర్యం లేదు.

అయితే.. ఇందుకు భారత్ కూడా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తెలివైనోడు ఎప్పుడు శత్రువును దెబ్బ తీయటమే లక్ష్యంగా పని చేస్తాడే కానీ.. ఆ క్రమంలో తాను కూడా దెబ్బలు తినటానికి సిద్ధంగా ఉండడు. ఇప్పుడు భారత పాలకుల ఆలోచనలు కూడా ఇవే. యుద్ధానికి సై అనటం ఎంతసేపు? ఒకసారి ఎవరేం అన్నా.. ముందుకే అన్నది డిసైడ్ అయితే భారత్ ను ఆపేదెవరు? అయితే.. ఇలాంటి నిర్ణయాల కారణంగా మన వైపు నుంచి కూడా నష్టం వాటిల్లుతుంది.

అందుకు భిన్నంగా.. మనకు అతి తక్కువ నష్టం (అది ఆర్థికం కావొచ్చు.. మరొకటి కావొచ్చు)తో పాక్ ను దారుణంగా దెబ్బ తీయటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. పహల్గాం ఉగ్రఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. ఇదే అర్థమవుతుంది. ఆగ్రహం.. ఆవేశం ఎంతో ఉన్నప్పటికి తొందరపాటుకు గురి కాకుండా ఆచితూచి అన్నట్లుగా వేస్తున్న అడుగులు అందరిని ఆకట్టుకుంటున్నాయి. అందరి మద్దతు కూడగట్టుకుంటూ పాక్ ను ఒంటరిని చేయటం.. చేసేది ధర్మయుద్దమే తప్పించి.. మిగిలిన యుద్ధాల మాదిరి కాదన్న సంకేతాల్ని భారత్ పంపుతోంది.

అదే సమయంలో ఒకటి తర్వాత ఒకటిగా తీసుకుంటున్న నిర్ణయాలు పాక్ పాలకులకు చెమటలుపట్టించటమే కాదు.. ఆ దేశ ప్రజల్లో పాలకుల తీరుపై ఆగ్రహాన్ని కలిగించేలా చేస్తున్నాయి. వాళ్ల మానాన వాళ్లు ఉంటే.. మనం ఎందుకు కెలకాలి?తమ పాలకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలతో ఇప్పటికే తమ బతుకులు భారంగా మారిన వేళ.. భారత్ తో యుద్ధమే జరిగితే మరెంతటి దారుణ పరిస్థితులు ఏర్పడతాయన్న విషయం ఇప్పుడు వారికి అర్థమవుతోంది. ఈ విషయం సోషల్ మీడియాలో పాక్ ప్రజలు తమ పోస్టులతో చెప్పేస్తున్నారు.

అదే సమయంలో మరో కీలక అంశాన్ని గమనించొచ్చు. ఓవైపు యుద్ధానికి సిద్ధం అవుతూ.. మన శక్తి సామర్థ్యాల్ని ప్రదర్శిస్తున్న తీరు.. శత్రు దేశానికి ఇప్పటికే చెమటలు పట్టేలా మారుతున్నాయి. యుద్ధ విమానాలను హైవే మీద రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా ల్యాండ్ చేస్తున్న వైనం మొదలు.. సముద్రగర్భంలో భారత నౌకాదళం ప్రదర్శిస్తున్న విన్యాసాలకు సంబంధించిన ఫోటోల్ని చూస్తే.. ఈసారి యుద్ధం రోటీన్ కు భిన్నంగా ఉంటుందని చెప్పాలి.

మరింత తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాలంటే.. కొన్నితెలుగు సినిమాల్లో హీరో ఎలివేషన్ కు దర్శకుడు వంద మందిని నరికేయటం లాంటి సీన్లు పెట్టకుండా.. సింఫుల్ గా.. హీరో బుద్ధి బలంతో సరండర్ అయ్యే సీన్లు పెట్టి.. వావ్ ఇది కదా హీరోయిజం అంటే అన్నట్లుగా చేస్తారు. పాక్ విషయంలో భారత్ ఈసారి అలానే వ్యవహరిస్తుందన్న భావన కలిగేలా చేస్తుందని చెప్పాలి. మాతో యుద్ధానికి దిగే ముందు.. నీ పరిస్థితి ఒకసారి చూసుకో బిడ్డా అన్న విషయాన్ని త్రివిధ దళాలు చెప్పకనే చెప్పేస్తున్నాయి. రక్తం బొట్టు చిందించకుండా యుద్ధాలు ముగిసిన చరిత్రలో లేవు. అదే సమయంలో తక్కువ నష్టంతో విజేతలుగా నిలిచిన సందర్భాలు అరుదే. అలాంటి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయటమే లక్ష్యంగా మన వ్యూహకర్తలు ఈసారి యుద్ధాన్ని ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.