Begin typing your search above and press return to search.

మోదీ సర్కార్ టాప్ 5 డెసిషన్స్.. పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాక్!

ప్రస్తుతం దేశం మొత్తం కోపంతో ఊగిపోతుంది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది.

By:  Tupaki Desk   |   24 April 2025 12:07 PM IST
India Strikes Back: 5 Tough Measures Against Pakistan
X

ప్రస్తుతం దేశం మొత్తం కోపంతో ఊగిపోతుంది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. ప్రధానమంత్రి నివాసంలో జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం అనంతరం ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సరిహద్దు దాటి భారత్‌పై జరుగుతున్న కుట్రలను అడ్డుకునేందుకు కఠినమైన చర్యలు తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, పాకిస్తానీ పౌరులకు వీసాల నిలిపివేత వంటి ముఖ్య నిర్ణయాలు ఉన్నాయి. మరి ఈ నిర్ణయాల వల్ల పాకిస్తాన్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం.

భారత్ తీసుకున్న ఆ ఐదు కీలక నిర్ణయాలు ఇవే:

* సింధు జలాల ఒప్పందంపై నిలిపివేత.

* పాకిస్తానీ పౌరులకు వీసాల జారీ నిలిపివేత.

* ఇరు దేశాల హైకమిషన్లలోని అధికారుల సంఖ్య తగ్గింపు.

* SVSE వీసా కింద భారత్‌లో ఉన్న పాకిస్తానీ పౌరులకు 48 గంటల అల్టిమేటం.

* అటారీ-వాఘా సరిహద్దును తక్షణమే మూసివేత.

నీటి కోసం తల్లడిల్లనున్న పాక్

భారత్, పాక్ మధ్య 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలని భారత్ నిర్ణయించింది. ఈ నిర్ణయం పాకిస్తాన్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ఒప్పందం ప్రకారం, పశ్చిమ నదులైన చీనాబ్, జీలం, సింధు నదుల నీరంతా పాకిస్తాన్‌కు అందుతుంది. అదే సమయంలో, తూర్పు నదులైన సట్లెజ్, బియాస్, రావి నదుల నీరు భారత్‌కు లభిస్తుంది. ఈ ఒప్పందం రద్దు చేయడంతో చీనాబ్, జీలం, సింధు నదుల నీరు పాకిస్తాన్‌కు అందదు. పాకిస్తాన్‌లోని పంజాబ్, సింధ్ ప్రావిన్సులు వ్యవసాయం, ఇతర అవసరాలకు పూర్తిగా ఈ నదుల నీటి మీదనే ఆధారపడి ఉన్నాయి. ఒప్పందం రద్దు అయితే ఈ రెండు ప్రావిన్సులు నీటి కోసం తల్లడిల్లిపోతాయి. ఇది పాక్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎదురు దెబ్బ అనిచెప్పొచ్చు.

పాకిస్తానీలకు వీసాలు బంద్

భారత్ తీసుకున్న మరో నిర్ణయం..పాకిస్తానీ పౌరులకు వీసాల జారీని నిలిపివేయడం. భారత ప్రభుత్వం ఇకపై పాకిస్తానీ పౌరులకు వీసాలు జారీ చేయదు. దీని ప్రభావం వైద్య చికిత్స కోసం పెద్ద సంఖ్యలో భారత్ కు వచ్చే పాక్ రోగుల మీద పడుతుంది. గత కొన్నేళ్లుగా భారత్ ఒక పెద్ద మెడికల్ డెస్టినేషన్‌గా ఎదిగింది. పాకిస్తాన్‌తో సహా అనేక దేశాల ప్రజలు చికిత్స కోసం భారత్‌కు వస్తుంటారు. ఒక లెక్క ప్రకారం 2015-16లో భారత్ 54 దేశాల నుంచి దాదాపు రెండు లక్షల మందికి మెడికల్ వీసాలను అందించింది. ఇందులో పెద్ద సంఖ్యలో పాకిస్తానీలు కూడా ఉన్నారు. మీడియా కథనాల ప్రకారం.. 2015-16లో ప్రతి నెలా దాదాపు 166 మంది పాకిస్తానీ పౌరులు చికిత్స కోసం భారత్‌కు వచ్చే వాళ్లు. అయితే, 2017లో మెడికల్ వీసా నిబంధనలు కఠినతరం చేశారు. ఇప్పుడు భారత్ పాకిస్తానీ పౌరులకు వీసాలు జారీ చేయదు. ఈ నిర్ణయం ఇప్పటికే భారత్‌లో చికిత్స పొందుతున్న పాకిస్తానీ రోగులకు కూడా షాక్ ఇవ్వవచ్చు.

అటారీ-వాఘా బోర్డర్ క్లోజ్

అలాగే భారత ప్రభుత్వం అటారీ-వాఘా సరిహద్దును కూడా మూసేయాలని నిర్ణయించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త సంబంధాల కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికే రాకపోకలు పరిమితంగా ఉన్నాయి. ఇప్పుడు అటారీ-వాఘా సరిహద్దు మూసివేయడంతో ఇరు దేశాల మధ్య ఉన్న కొద్దిపాటి రాకపోకలు కూడా తక్షణమే నిలిచిపోయాయి.