సరిహద్దులో పాక్ ఆగడాలు.. కాల్పుల విరమణ ఉల్లంఘన.. భారత సైన్యం దీటు జవాబు!
ఈ హఠాత్ పరిణామానికి భారత సైన్యం తక్షణమే స్పందించింది. పాక్ సైన్యానికి దీటుగా బదులిచ్చింది.ఈ ఎదురుకాల్పుల్లో పాకిస్తాన్ వైపు భారీగా నష్టం వాటిల్లినట్లు సమాచారం.
By: Tupaki Desk | 2 April 2025 6:55 PM ISTIndia - pakistan: భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో మరోసారి అలజడి చోటుచేసుకుంది. పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద చొరబాటుకు ప్రయత్నించింది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)ని దాటి భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. దీనికి భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. ఈ ఘటనలో పాకిస్తాన్ వైపు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
సైనిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 1న కృష్ణ ఘాటి సెక్టార్ వద్ద పాకిస్తాన్ ఆర్మీ భారత భూభాగంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో అక్కడ మందుపాతర పేలిన ఘటన కూడా చోటుచేసుకుంది. అనంతరం పాక్ సైన్యం భారత సైనిక స్థావరాలపై కాల్పులు జరిపి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ ఆర్మీ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎల్‌ఓసీని దాటి భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చింది. అనంతరం భారత సైన్యం పోస్టులపై కాల్పులు జరిపింది.
ఈ హఠాత్ పరిణామానికి భారత సైన్యం తక్షణమే స్పందించింది. పాక్ సైన్యానికి దీటుగా బదులిచ్చింది.ఈ ఎదురుకాల్పుల్లో పాకిస్తాన్ వైపు భారీగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. నలుగురైదుగురు పాక్ చొరబాటుదారులు హతమయ్యారు. అయితే, దీనిపై అధికారికంగా ధృవీకరణ రావాల్సి ఉంది. ఈ ఘటనలో భారత సైన్యం వైపు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
గత కొంతకాలంగా ఎల్‌ఓసీ వెంబడి పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనలు పెరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య 2021లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ తరచూ ఉల్లంఘిస్తోంది. ఈ తాజా ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా జరిగిన ఈ చొరబాటు ప్రయత్నం సరిహద్దుల్లో ఉద్రిక్తతను మరింత పెంచే అవకాశం ఉంది.
